మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈసారి విద్యావలంటీర్లను నియమించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది దాదాపు 1.72 లక్షల మంది కొత్తగా చేరినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ప్రభుత్వ స్కూళ్లలో వసతులు, విద్యా ప్రమాణాలు పెరగడం వల్లే విద్యార్థులు ఆకర్షితులయ్యారని అధికారులు పేర్కొంటున్నారు. అయితే విద్యార్థులకు తగినట్లుగా ఉపాధ్యాయులు లేకపోతే బోధనపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో విద్యావలంటీర్లను నియమించాలనే ప్రతిపాదనలపై అధికారులు చర్చిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే వెంటనే విద్యావలంటీర్ల నియామకాలు చేపట్టనున్నారు.
త్వరలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని విద్యాశాఖ చెబుతోంది. అందులో భాగంగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించి, ఫలితాలు వెల్లడించారు. అయితే ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ వెలువడినా ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఆరు నెలలకు పైగానే సమయం పడుతుంది. జూన్ 13వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 23వ తేదీతో 2022 -23 విద్యా సంవత్సరం ముగుస్తుంది. ఈ నెలలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడినా వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి వరకు నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఏడాది ఉపాధ్యాయుల నియామకం చేపట్టినా ఈ విద్యాసంవత్సరం కొత్త టీచర్లు బోధించే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో కొత్త టీచర్లు వచ్చేంతవరకు విద్యా వలంటీర్లను నియమించడమే ఉత్తమం అని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. కరోనా పరిస్థితుల కంటే ముందు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల మంది విద్యావలంటీర్లు విధులు నిర్వహించగా, ఆ తర్వాత వారిని ప్రభుత్వం నియమించలేదు. ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం విద్యావలంటీర్లను నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది.