కర్నాటకలో కొనసాగుతున్న వివాదం
బెంగళూరు: హైకోర్టు ఆదేశాల మేరకు కర్నాటకలో సోమవారంనుంచి విద్యాసంస్థలు తెరుచుకున్నప్పటికీ హిజాబ్ వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. హిజాబ్ తొలగించి పాఠశాలలకు హాజరుకావాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించాలని ఉపాధ్యాయులు సూచించడంతో సోమవారం 13 మంది విద్యార్థినులు ప్రీఫైనల్ పరీక్షలు రాయకుండానే వెనుదిరగ్గా మంగళవారం మరో విద్యార్థిని కూడా అలాగే వెనుదిరిగింది. శివమొగ్గ పట్టణంలో మంగళవారం ఓ ముస్లిం విద్యార్థిని హిజాబ్ ధరించి పరీక్ష రాయడానికి పాఠశాలకు వచ్చింది. అయితే హిజాబ్ తొలగించకపోతే లోపలికి వెళ్లనీయమని అధికారులు స్పష్ట చేయడంతో ఆ విద్యార్థిని పరీక్ష రఆయకుండానే వెనుదిరిగింది.తాము చిన్నప్పటినుంచీ హిజాబ్ ధరించే పెరిగామని, దాన్ని వదిలేయలేమని చెప్పిన ఆ విద్యార్థిని పరీక్ష రాయడానికి అనుమతించనందున ఇంటికి వెళ్లిపోతున్నానని తెలిపింది. చిక్క మగళూర్ జిల్లా ఇందావర గ్రామంలో కూడా హిజాబ్ ధరించి వచ్చిన ముస్లిం విద్యార్థినులను స్కూలు లోపలికి వెళ్లనీయలేదు.
విషయం తెలిసి ఆగ్రహంతో వచ్చిన వారితల్లిదండ్రులు స్కూలు ఆవరణలోకి చొరబడి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు కోర్టు ఆదేశాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొడవ ముదరడంతో మరో విద్యార్థి తన బ్యాగ్‌లోంచి కాషాయ స్కార్ఫ్ బైటికి తీశాడు. అయితే టీచర్లు నచ్చ జెప్పడంతో అతను దాన్ని తిరిగి బ్యాగ్‌లో పెట్టేశాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడం గమనించిన హెడ్మాస్టర్ స్కూలుకు సెలవు ప్రకటించారు. ఉడుపి, తుమకూరు తదితర జిల్లాల్లో కూడా అక్కడక్కడా ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టులో మంగళవారం కూడా వాదనలు కొనసాగాయి. ముస్లిం బాలికల తరఫున సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపిస్తూ, పౌరుల ప్రాథమిక హక్కులకు సంబంధించిన రాజ్యాంగంలోని 25వ అధికరణాన్ని ప్రస్తావించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఈ ప్రాథమిక హక్కులకు భంగకరమని పేర్కొన్నారు. కాగా కోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.