న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ స్కూలు పిల్లలతో కలిసి రక్షాబంధన్ వేడుకను జరుపుకొన్నారు. ఢిల్లీ పాఠశాలల విద్యార్థినులు బుధవారం ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు.అనంతరం మోడీ వాళ్లతో కొద్ది సేపు ముచ్చటించారు. ‘స్కూలు పిల్లలు ఇటీవలి చంద్రయాన్ విజయంపై తమ పాజిటివ్ మనోభావాలను ప్రధానితో పంచుకున్నారు. రాబోయే ఆదిత్య ఎల్1 మిషన్‌పై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు’ అని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ సందర్భంగా పిల్లలు పద్యాలు, పాటలు పాడారు కూడా.
వారి ఉచ్చారణకు ముచ్చటపడిన ప్రధాని వారినిప్రజల కోసం ప్రభుత్వ పథకాతో పాటుగా వివిధ అంశాలపైపాటలు రాయాల్సిందిగా కోరారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు, వారి టీచర్లతో కలిసి ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల( ఎన్‌జిఓలు) ప్రతినిధులు, బృందావన్‌కు చెందిన వితంతువులు కూడా ఈ సంర్భంగా పాలు పంచుకున్నట్లు ఆ ప్రకటన తెలిపింది. అంతకు ముందు రాఖీ పండగ సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘రక్షాబంధన్ ఓ పవిత్రమైన పండగ. మన దేశ సంస్కృతికి ప్రతి రూపం.ఈ పండుగ ప్రజల జీవితాల్లో బంధాలు, ఆప్యాయత, సామరస్య భావాలను మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.