Thursday, January 23, 2025

పాఠశాల ఆరోగ్య సేవలేవీ?

- Advertisement -
- Advertisement -

School health services

నేటి బాలలే రేపటి పౌరులు. నేటి ఆరోగ్యవంతులైన విద్యార్థులే రేపటి దేశాభివృద్ధి పునాదులు. పాఠశాలల బాలల ఆరోగ్యాలను కాపాడుతూ, వారి ఆరోగ్య పరిరక్షణకు కావలసిన వ్యవస్థలను ప్రభుత్వాలు, విద్యారంగం మరిచిపోయాయి. కరోనా వైరస్ విజృంభణతో బడి పిల్లల్లో పలు శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం కావడం చూశాం, చూస్తు న్నాం. కొవిడ్-19 అలలు తొలగిన వేళ దేశ వ్యాప్తంగా పాఠశాలల తలుపులు తెరుచుకున్నాయి. బడులు కళకళలాడుతూ, ఆఫ్‌లైన్ బోధనలు ఊపందుకున్నాయి. పాఠ్యాంశాల బోధనలో దృష్టి సారించిన విద్య విభాగాలు బడి పిల్లల ఆరోగ్యంపై ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. బడి పిల్లల్లో అనారోగ్య సమస్యలు తక్కువగానే ఉన్నప్పటికీ వైద్య శిబిరాల నిర్వహణతో పాటు ఆరోగ్య సూత్రాల బోధనలను అవగాహన పరచడం ప్రభుత్వాల, ప్రైవేట్ విద్యా సంస్థల కనీస అవసరమని మరిచిపోయాయి. ప్రస్తుతం భారతదేశంలో 1.5 మిలియన్ల పాఠశాలల్లో 8.5 మిలియన్ల ఉపాధ్యాయులు, 250 మిలియన్ల విద్యార్థులు నమోదైనారు. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 1,043 యూనివర్సిటీల్లో 55,000 ఉన్నత విద్య సంస్థల ద్వారా దాదాపు 3.74 కోట్ల యువత విద్యను అభ్యసిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా విస్తరించిన వివిధ విద్యాలయాల్లో కోట్ల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న కారణంగా వారి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు తమ తమ పాత్రలను నిర్వహించాల్సిందే. విద్యార్థినీ, విద్యార్థులను తరుచుగా అసంబద్ధ ఆహారపు అలవాట్లు, అసాధారణ నిద్ర అలవాట్లు, శారీరక శ్రమలేకపోవడం, మానసిక సమస్యలు, నేత్ర సమస్యలు, లైంగిక సంబంధ సమస్యలు, పొగాకు దురలవాట్లు, మాదకద్రవ్యాల వాడకం, సెల్‌ఫోన్ అడిక్షన్ లాంటి పలు సమస్యలు వెన్నాడుతున్నాయి. చిరు ప్రాయంలోనే ఇలాంటి ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పించడానికి పాఠశాల ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, పౌర సమాజం బాధ్యత తీసుకోవాలి. పాఠశాల స్థాయిలో ఇలాంటి దురలవాట్లు, అనారోగ్యాల బారిన పడితే జీవితాంతం వాటి దుష్ప్రభావాలు వెంటాడతాయని మరిచిపోరాదు. పొగాకు, మాదకద్రవ్యాల దురలవాట్లను చిరుప్రాయంలోనే మాన్పించటం చాలా సులభమని, యుక్త వయస్సు తరువాత తొలగించడం కష్టమని తెలుసుకోవాలి.
ఆరోగ్య సేవల కల్పన
పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య సేవల కల్పనకు సంబంధించిన చర్చలు 1909 నుంచే ప్రారంభం అయ్యాయి. 1946లో నియమించిన సర్ జోసఫ్ భోర్ కమిటీ నివేదిక ప్రకారం పాఠశాలల్లో ఆరోగ్య సేవల ప్రస్తావనే లేదని గమనించారు. 1953లో సెకండరీ విద్యా కమిటీ సిఫార్సుల ప్రకారం పాఠశాలల్లోనే ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన కనీస జ్ఞానంతో పాటు మధ్యాహ్న పోషకాహార పథక రచనలు జరగాలని సూచించింది. కరోనా అనంతరం ఢిల్లీ పాఠశాలల్లో ఆరోగ్య కేంద్రాలు లేదా హెల్త్ క్లినిక్స్ ప్రారంభించడం శుభపరిణామే కాదు అనుసరణీయం కూడా. చిన్నారుల ఆరోగ్య భాగ్యాల కోసం ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, సమాజం బాధ్యత తీసుకోవడం తప్పనిసరి. పాఠశాల ఆరోగ్య సేవల కల్పనలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సియస్‌ఆర్) గొడుగును పట్టాల్సిన బాధ్యత బహుళజాతి వ్యాపార వ్యవస్థల కనీస కర్తవ్యం అని గుర్తుంచుకోవాలి. విద్యా వ్యవస్థలతో వైద్య శాఖలు అనుసంధానం కావాలి.
యునెస్కో, యూనిసెఫ్, డబ్ల్యుహెచ్‌ఒ సిఫార్సులు
ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పాఠశాల ఆరోగ్య సేవల వ్యవస్థల కల్పన కనిపించడం లేదు. యునెస్కో, యూనిసెఫ్, డబ్ల్యూహెచ్‌ఒ, ప్రపంచ బ్యాంకులు పాఠశాలల్లో ఆరోగ్య సేవలు నెలకొల్పుటకు స్పష్టమైన మార్గదర్శకాలు ‘ఫోకసింగ్ రిసోర్సెస్ ఆన్ ఎఫెక్టివ్ స్కూల్ హెల్త్ (ఫ్రెష్)’ అనే ప్రతిపాదనలు తీసుకువచ్చాయి. పాఠశాలల్లో ఆరోగ్య సేవల కేంద్రాలు నెలకొల్పడం, స్వచ్ఛమైన తాగు నీరు అందించడం, పాఠశాల ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఆరోగ్య సూత్రాల బోధనలు, పోషకాహారం అందించడం లాంటివి ఆచరణలో పెట్టాలని సూచించాయి. విద్యాశాఖ, వైద్య శాఖ, కమ్యూనిటీ, విద్యార్థులు సమన్వయంతో సాగితేనే నేటి ఆరోగ్య బాలలు రేపటి సౌభాగ్య మానవ సంపదలుగా ఎదుగుతారని మరువరాదు.వీటికి తోడుగా పాఠశాల బాలల తీవ్ర అత్యవసర సేవలు, కుటుంబ సభ్యుల భాగస్వామ్యం, దీర్ఘకాలిక వ్యాధుల పరిష్కారం, పలు ప్రభుత్వ విభాగాల సఫల సమన్వయం లాంటి చర్యలు బాలల సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేస్తాయని వివరించడం జరిగింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాఠశాల ఆరోగ్య సేవలు ఉండాలని, బాలలకు సమయానుకూలంగా ఆరోగ్య విద్య బోధనలు, వైద్య శిబిరాల నిర్వహణ వ్యవస్థలను నెలకొల్పితే సత్ఫలితాలు కలిపిస్తాయని పేర్కొనబడింది. ఆరోగ్యం పట్ల సానుకూల పరిజ్ఞానం, ఆరోగ్య స్పృహ, రోగ నివారణ, రోగ నిర్ధారణ, చికిత్సలు వంటి లక్ష్యాలతో పాఠశాల ఆరోగ్య సేవలు పని చేయాలి. గత 3 దశాబ్దాలుగా అనేక యూరోప్ దేశాలు విజయవంతంగా ‘ఆరోగ్య ప్రోత్సాహక పాఠశాల (హెల్త్ ప్రమోటింగ్ స్కూల్స్)’లను నిర్వహిస్తూ మనకు దారిని చూపుతున్నాయి.
ఆరోగ్య సేవల పట్ల ప్రస్తుత కర్తవ్యం
పూర్తి స్థాయి విద్యార్థులతో నడుస్తున్న దేశవ్యాప్త పాఠశాలల్లో ఆరోగ్య ప్రోత్సాహక సేవల కేంద్రాలను సత్వరమే నెలకొల్పి బలోపేతం చేయాలి. వీటికి సంబంధించిన నిధుల విడుదల, అమలు జరగాలి. పాఠశాలల్లో ఆరోగ్య భద్రతకు అవసర మౌలిక వసతులను కల్పించాలి. ఆరోగ్యకర జీవనశైలి పట్ల అవగాహనతో వ్యాధి నివారణకు పునాదులు వేయాలి. ఆరోగ్య సంబంధ ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయులు కనీస ఆరోగ్య పరిరక్షణ పరిజ్ఞానాన్ని అందించడం జరగాలి. కౌమారదశ యువతకు లైంగిక విద్య (సెక్స్ ఎడ్యుకేషన్), బాలికలకు వ్యక్తిగత రుతుస్రావ పరిశుభ్రతలు పాఠ్యాంశాల్లో భాగం చేసి బోధించాలి. పాఠశాల హెల్త్ క్లినిక్స్ నెలకొల్పి బాలల శారీరక, మానసిక విసాసానికి పునాదులు వేయాలి.

తరుచుగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహిస్తూ, పిల్లల సంపూర్ణాభివృద్ధి జరిగేలా దోహదపడాలి. పాఠశాలల్లో బాలలకు, ఉపాధ్యాయులకు వైద్య శిబిరాలు నిర్వహించాలి. ప్రతి విద్యార్థి హెల్త్ కార్డులను భద్రపరచాలి. ప్రైవేట్ పాఠశాలల్లో పటిష్ట ఆరోగ్య సేవల విభాగం పని చేసేలా పర్యవేక్షణ చేయాలి. 2020లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్’ను బలోపేతం చేసి రేపటి ఆరోగ్యకర తరానికి నేడే ఆరోగ్య సేవల రూపంలో పునాదులు వేయాలి. విద్యతో పాటు ఆరోగ్య ఉంటేనే రేపటి భారతం ఆరోగ్యవంతమైన నైపుణ్య మానవ వనరుల కేంద్రంగా అవతరిస్తుందని గుర్తుంచుకోవాలి. పిల్లల్లో ఆరోగ్య వికాసానికి పిల్లల డాక్టర్లు (పెడియాట్రీషన్స్) ప్రముఖ పాత్రను నిర్వహించాలి. ఆరోగ్య ఉంటేనే విద్యకు సార్థకత అని గుర్తుంచుకొని నూతన విద్యా విధానం -2020, జాతీయ ఆరోగ్య పాలసీ- 2017ల ద్వారా ప్రతి పాఠశాలను ఆరోగ్య కోవెలగా రూపాంతరం చెందేలా కృషి చేయాలి. రోగ చికిత్స కన్న వ్యాధి నివారణకే అధిక ప్రాధాన్యతను ఇవ్వడంలో ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యుల పాత్ర వెలకట్టలేనిదని గమనించాలి. మన ముద్దు బిడ్డల్ని రేపటి బాధ్యత గల ఆరోగ్యవంతమైన విద్యాధికులుగా మార్చుకుందాం.

డా. బుర్ర
మధుసూదన్ రెడ్డి
9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News