Monday, January 20, 2025

చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్

- Advertisement -
- Advertisement -

నిజాంపేట్ : అతివేగంగా వచ్చిన స్కూల్ బస్సు స్కూటీని ఢీకొట్టడంతో ఓ బాలిక మృతి చెందింది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్కూల్ బస్సు, స్కూటీని ఢీకొట్టడంతో 8 ఏళ్ల చిన్నారి మృతి చెందగా, పాప తండ్రికి గాయాలయ్యాయి. పొద్దున్న చక్కగా ముస్తాబై బడికి వెళ్లిన కూతురు.. మధ్యాహ్నం ఇంటికి చేరుకోకుండానే ప్రాణాలు కోల్పోవడం జీర్ణించుకోలేని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాలిక మృతితో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే…రెడ్డిల్యాబ్స్ కంపెనీ వద్ద కిషోర్ తన కూతురు 8 ఏళ్ల దీక్షితతో కలిసి స్కూటీపై వెళ్తూ రోడ్డు దాటుతున్నారు.

ఇదే క్రమంలో స్కూల్ బస్సు వేగంగా వచ్చి వీరు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. వెనుక కూర్చున్న పాప స్కూటీ పైనుండి కింద పడటంతో స్కూల్ బస్సు పాపపై నుండి వెళ్లింది. ఇలా తీవ్ర గాయాలపాలైన పాప అక్కడి కక్కడే మృతి చెందింది. దీక్షిత ప్రస్తుతం బోరంపేటలోని డిల్లీ పబ్లిక్ స్కూల్ లో మూడో తరగతి చదువుతోంది. బస్సు డ్రైవర్ రహీమ్ అతివేగంగా వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అలాగే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే పాప మృతికి కారణం అని బాచుపల్లి సిఐ సుమన్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీక్షిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News