మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం బడిగంట మోగింది. మంగళవారంతో వేసవి సెలవులు ముగియడంతో 48 రోజుల తరువాత పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. సుమారు రెండు నెలల పాటు బోసిపోయిన స్కూల్స్ విద్యార్థుల రాకతో ఒక్కసారిగా కళకళలాడా యి. ఉపాధ్యాయులు, విద్యార్థులు తిరిగి వచ్చినందున పాఠశాల్లో సందడి వాతావరణం నెలకొంది. కొత్త ఆశలతో రానున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ఏడాది నుంచి కొన్ని నూతన కార్యక్రమాలను అమలు చేస్తోంది. సర్కారు బడుల్లో కొత్త తరగతిని ప్రారంభించేందుకు వస్తున్న విద్యార్థుల కోసం ఈ ఏడాది పలు నూతన కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది. గతేడాది పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ఆలస్యం కావడంతో.. ఈ ఏడాది ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించింది. పాఠశాలలు ప్రారంభించిన రోజునే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలను విద్యాశాఖ పంపిణీ చేసింది. తొలిరోజు పలు ప్రభుత్వ పాఠశాలల్లో మంత్రులు, ఎంఎల్‌ఎలు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేశారు. స్కూళ్ళు పునః ప్రారంభమవుతున్న సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్,
ఎంఎల్‌ఎ రాజాసింగ్ బుధవారం అబిడ్స్‌లోని ప్రభుత్వ అలియా స్కూల్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మంత్రి సన్మానించారు. పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా మంత్రి విద్యార్థులకు పుస్తకాలు,యూనిఫాం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్,డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, గన్ ఫౌండ్రి కార్పొరేటర్ సురేఖ ఓం ప్రకాష్,డిఇఒ రోహిణి ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో మంత్రి సి.దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలను స్థానిక మంత్రులు, ఎంఎల్‌ఎలు సందర్శించారు. మారుతున్న పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా సిలబస్ మార్చే విషయమై ప్రభుత్వం విద్యా కమిషన్ నిర్ణయం ఏర్పాటు చేస్తుందని ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా ఈసారి ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రైవేటు మోజు నుంచి బయటపడేలా పిల్లల తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. నాణ్యమైన విద్యను అందించే సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప్రారంభించిన రోజునే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలను పంపిణీ చేసింది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 21,19,439 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈసారి రెండు జతల దుస్తులకు అవసరమైన క్లాత్‌ను సరఫరా చేయాలని కోరుతూ విద్యాశాఖ టెస్కో ఎండీకి ఇండెంట్ పెట్టింది. ఇప్పటికే ఒక జతకు సరిపడే క్లాత్ టెస్కో సరఫరా చేసింది. అన్ని ప్రభుత్వ, జెడ్‌పి, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, మైనారిటీ సొసైటీ, కెజిబివి, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, ట్రైబల్ వ్ఫెర్ స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ ఈ యూనిఫాం అందిస్తుంది. విద్యార్థులకు యూనిపాం కుట్టే బాధ్యతలను ఈసారి ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అప్పగించింది. దీంతో దాదాపు 30 వేల మహిళా సంఘాలకు ఉపాధి లభించింది.
నెలాఖరులోగా రెండో జత యూనిఫాం
పాఠశాలలు పున: ప్రారంభమైన బుధవారం రోజున 21,19,439 మంది విద్యార్థులకు ఒక జత యూనిఫాం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెలాఖరులోగా రెండో జత కూడా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టింది. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదవే విద్యార్థుల కోసం 1,11,97,976 నోట్‌బుక్‌లకు ఇండెంట్ ఉంచారు. వీరిలో తొలి రోజున 11,65,995 విద్యార్థులకు ఈ నోట్ పుస్తకాలు పంపిణీకి అందుబాటులో ఉంచారు. 2024 -25 సంవత్సరానికి 25,80,291 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. మొత్తం 1,50,17,812 పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తారు. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు వర్క్ బుక్స్‌ను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. తొలి రోజున 10,09,464 మంది విద్యార్థులు వర్క్ బుక్స్ అందుకునేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ ఇప్పటికే సరఫరా అయ్యాయి.
జనవరి 10 నాటికి టెన్త్ విద్యార్థులకు సిలబస్‌ను పూర్తి
పాఠశాలల్లో ప్రతి రోజు కనీసం ఐదు నిమిషాల పాటు ధ్యానం లేదా యోగా లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ప్రతి నెలా రెండో శనివారం సెలవు దినంగా ఉన్నందున నాలుగో శనివారాన్ని ‘నో బ్యాగ్ డే’గా అమలు చేయనున్నట్లు అధికారులు వివరించారు. ప్రాథమికోన్నత పాఠశాలలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు తరగతులు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. అకడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించడంతో టెన్త్ క్లాస్ విద్యార్థులకు జనవరి 10వ తేదీ నాటికి సిలబస్‌ను పూర్తి చేసేలా రాష్ట్రంలోని అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలకు సర్క్యులర్ జారీ అయింది. పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న తొలి రోజునే కొన్ని స్కూళ్లలో విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ జరిగేలా జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకున్నారు. స్వయం సహాయక మహిళా బృందాలకు ఈసారి యూనిఫామ్ కుట్టు పనులను ప్రభుత్వం అప్పగించింది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్య పుస్తకాలు ఇప్పటికే చాలా స్కూళ్లకు చేరినా ఇంకా కొన్ని స్కూళ్లకు పంపిణీ చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరంలోని ప్రభుత్వ టెక్ట్ బుక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆర్‌టిసి కార్గో సర్వీస్ ద్వారా పాఠ్యపుస్తకాలు చేరవేసే పనులు ఊపందుకున్నాయి.
కొనసాగుతున్న బడిబాట
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్షంగా ఈ నెల 6న ప్రారంభమైన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19 వరకు రోజుకో కార్యక్రమం నిర్వహిస్తారు. బడిబయట పిల్లలను గుర్తించి, వారిని సమీపంలోని అంగన్‌వాడీలు, పాఠశాలల్లో చేర్పించడం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడం, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించడం బడిబాట ఉద్దేశ్యం. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ‘ఇంగ్లిష్ మీడియం బోధన’ వంటి అంశాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం, ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫాం వంటివన్నీ సమకూరుతాయని తల్లిదండ్రులకు వివరిస్తున్నారు.