నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం
వేసవి సెలవుల పొడిగింపు లేదు
సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధన
మన ఊరు మనబడికి రూ.2,700 కోట్లు
కేంద్రం ఇచ్చినట్లు బండి సంజయ్ నిరూపించాలి
తెలంగాణకు కేంద్రం అన్నింటా మొండి చేయి చూపుతోంది
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ బిజెపి నాయకులు
ఎవరూ ప్రశ్నించేందుకు ధైర్యం చూపడం లేదు
రాష్ట్రానికి ఒక్క ప్రతిష్టాత్మక విద్యా సంస్థనయినా ఇవ్వాలని అడగలేదు
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వేసవి సెలవుల పొడిగింపు లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరూ ప్రపంచ స్థాయి విద్యను అభ్యసించాలనే ఆకాంక్షతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరంలోనే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ప్రారంభిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. విద్యార్థులకు సౌలభ్యంగా ఉండేందుకు వీలుగా బై లింగ్వల్(రెండు భాషలలో) పాఠ్య పుస్తకాలను కూడా అందిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు.
దేశానికే ఆదర్శంగా నిలిచేలా మన ఊరు-మన బడి
పాఠశాల విద్యలో కొత్త ఒరవడి సృష్టించి, దేశానికే ఆదర్శంగా నిలిచేలా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని రూ.7,289.54 కోట్లతో దశల వారీగా చేపడుతున్నామని వివరించారు. మొదటి దశలో భాగంగా 9,123 పాఠశాలల్లో రూ. 3,497.62 కోట్లతో 12 రకాల మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమగ్రాభివృద్ధి, మౌళిక వసతుల పెరుగుదలే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మూడు సంవత్సరాల పాటు నిర్వహించనున్నామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా పాఠ్యపుస్తకాలను, ఉచిత యూనిఫాం, సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతకై ఉచిత ఆరోగ్య పరీక్షలను నిర్వహించి తగిన చికిత్సలను అందజేస్తున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిస్తున్న నాణ్యమైన విద్యను పొంది భవితను బంగారుమయం చేసుకొని ఆదర్శ పౌరులుగా ఎదగాలని రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని మంత్రి ఆకాంక్షించారు. విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులందరూ హాజరై పండుగ వాతావరణాన్ని కల్పించాలని కోరారు.
బండి సంజయ్‌కి సవాల్
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దమ్ముంటే విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి ప్రధాని నరేంద్ర మోడితో మాట్లాడి ఇకనైనా న్యాయం చేసేందుకు ప్రయత్నించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి సవాల్ విసిరారు. ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పట్ల అడుగడుగునా వివక్ష చూపుతోందని, దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్నింటా మొండి చేయి చూపుతోందని మంత్రి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఐఐటి, ఐఐఎం, నిడ్, వైద్య కళాశాల, నవోదయ పాఠశాల ఒక్కటి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పరంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకులు ఎవరూ ప్రశ్నించేందుకు ధైర్యం చూపడం లేదని, ఏ ఒక్క రోజు తెలంగాణకు ఒక్క ప్రతిష్టాత్మక విద్యా సంస్థనయినా ఇవ్వాలని అడగలేదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల స్థాయి పెంపు, పెద్ద ఎత్తున గురుకులాల ఏర్పాటు, కొత్తగా జూనియర్, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, యూనివర్సిటీలను ప్రారంభించి విద్యా రంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బలోపేతం చేస్తున్నారని, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ట్యూషన్ ఫీజులను, కాస్మోటిక్ చార్జీలతో సహా ఇతర సౌకర్యాలను కల్పిస్తూ ముందుకు సాగుతున్నామని వివరించారు. బేటీ పడావో- బేటీ బచావో నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మోడల్ స్కూళ్ళను ఎత్తివేసిన ఘనత ఈ కేంద్ర ప్రభుత్వానిది కాదా అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం స్వయం సమృద్ధి చెందుతూ విద్యారంగంలో అద్భుతాలు సృష్టిస్తోందని, దీనిని ప్రశంసించకపోగా బండిసంజయ్ పచ్చి అబద్దాలు చెబుతూ విమర్శలు చేయడం దారుణమని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చేవి చెప్పకుండా యుపిఎ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన సర్వశిక్ష అభియాన్‌ను ఇప్పుడు ప్రస్తావించి, మన ఊరు-మనబడికి, దానికి సంబంధం ఉందని చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
ఆధారాలతో నిరూపించాలి
మన ఊరు-మన బడి పథకం మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నరు రూ. 3,497 కోట్లలో రూ.2,700 కోట్లు కేంద్ర నిధులు ఉన్నాయంటున్న బండి సంజయ్ అధారాలతో నిరూపించాలని మంత్రి సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమంగా చేపట్టిందని దానికి అధిక మొత్తంలో నిధులిచ్చి పనులను చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్థాయికి మించి ఈ కార్యక్రమం ద్వారా రూపొందిస్తుంటే చూసి ఓర్వలేక బండి సంజయ్ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని పేర్కొన్నారు. విద్యారంగానికి కేంద్రం నుంచి చేయుతనివ్వకపోగా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు అవాకులు చవాకులు మాట్లాడటం బండి సంజయ్ ఇకనైనా మానుకోవాలని మంత్రి హితవు పలికారు. ఇప్పటికైనా ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థను ఒక్కటైనా కేంద్రం నుంచి మంజూరు చేయించి మాట్లాడితే మంచిదని సలహా ఇచ్చారు. విద్యారంగానికి రాజకీయాలతో ముడిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన బడిబాటలో బిజెపి నాయకులు కూడా పాల్గొనాలని, ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ చదువును అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి సహకరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.
Schools Re-Open Today in Telangana