Saturday, November 23, 2024

గంట గణగణ

- Advertisement -
- Advertisement -

10 నెలల తర్వాత బడిబాట పట్టిన విద్యార్థులు

మొదటి రోజు పాఠశాలల్లో 54 శాతం హాజరు పదవ తరగతిలో ఎక్కువగా హాజరు నమోదు
రెండు మూడు రోజుల్లో హాజరు పెరుగుతుంది: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు మళ్లీ విద్యార్థులతో కలకలలాడాయి. పది నెలల పాటు విద్యార్థులు లేక ఖాళీగా ఉన్న విద్యాసంస్థల్లో మళ్లీ సందడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. కొవిడ్ 19 జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులు ధరించి విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేసిన సీటింగ్‌కు అనుగుణంగా విద్యార్థులు కూర్చుకున్నారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు విద్యార్థులకు సాదర స్వాగతం పలికారు. మొదటి రోజు ఎక్కువగా ఆన్‌లైన్ క్లాసుల సందేహాలపై విద్యార్థులు ఉ పాధ్యాయులతో చర్చించారు. పాఠశాలల్లో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తున్నప్పటికీ మొదటి రోజు ఎక్కువగా పదవ తరగతి విద్యార్థులే హాజరయ్యారు. పదవ తరగతి విద్యార్ధులకు కచ్చితంగా వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థులు ఎక్కువగా పాఠశాలలకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న 11, 976 పాఠశాలల్లో పదవ తరగతిలో 4,47,831 మంది విద్యార్థులకు 2,40,022 మంది(54 శాతం) హాజరుకాగా, 9వ తరగతిలో 4,44,994 మందికి 1,89,185 మంది(41 శాతం) హాజరయ్యారు. రాష్ట్రంలోని 4,668 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 1,93,189 మంది విద్యార్థులు ఉండగా, అందులో మొదటి రోజు 1,03873 మంది(54 శాతం హాజరయ్యారు). అలాగే ఈ పాఠశాలల్లో 9వ తరగతిలో మొత్తం 1,90,669 మంది విద్యార్థులకు 81,967 మంది(43 శాతం) హాజరయ్యారు.
ప్రైవేట్‌లోనే ఎక్కువ హాజరు
రాష్ట్రంలో పాఠశాలల్లో మొదటిరోజు ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే ప్రైవేట్ స్కూళ్లలోనే ఎక్కువగా హాజరు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 6,373 ప్రైవేట్ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులు మొత్తం 2,01,858 మంది ఉండగా, అందులో 1,22,526 మంది(61 శాతం) హాజరయ్యారు. అదేవిధంగా ఈ పాఠశాలల్లో 9వ తరగతిలో 1,97,906 మంది విద్యార్థులకు 97,403 మంది హాజరయ్యారు. 194 మోడల్ స్కూళ్లలో పదవ తరగతిలో 18,779 మంది విద్యార్థులకు 10,164 మంది(54 శాతం) హాజరుకాగా, 9వ తరగతిలో 19,569 మందికి 7,063 మంది (36 శాతం) హాజరయ్యారు. అలాగే రాష్ట్రంలోని 452 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు(కెజిబివి)లలో విద్యార్థులు తక్కువగా హాజరయ్యారు. పదవ తరగతిలో 17,220 మంది విద్యార్థులకు 1,454 మంది(8 శాతం), 9వ తరగతిలో 18,263 మందికి 1,082(6 శాతం) హాజరయ్యారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే 289 గురుకుల విద్యాసంస్థల్లో పదవ తరగతిలో 16,785 మంది విద్యార్థులకు 2,005 మంది(12 శాతం), 9వ తరగతిలో 18,587 మందికి 1,650(9 శాతం) మంది హాజరయ్యారు.
ఇంటర్‌లో 45 శాతం హాజరు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో మొదటి రోజు 45 శాతం హాజరు నమోదైంది. మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 33 శాతం, ద్వితీయ సంవత్సరంలో 24 శాతం హాజరు నమోదైంది. కెజిబివిలలోని జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో 7 శాతం, ద్వితీయ సంవత్సరంలో 5 శాతం, గురుకులాలలో ప్రథమ సంవత్సరంలో 25 శాతం, ద్వితీయ సంవత్సరంలో 14 శాతం హాజరు నమోదైంది. 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 85,255 మంది విద్యార్థులకుగానూ 27,963 మంది(33 శాతం) విద్యార్థులు హాజరయ్యారు.
విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి సబిత
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం విద్యాసంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యాశాఖ పి.సబితా ఇంద్రారెడ్డి జిల్లెలగూడ, శివరాంపల్లి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. జిల్లెలగూడలో మంత్రి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతి పత్రాలతో పాఠశాలలకు వచ్చారని అన్నారు. రెండు మూడు రోజుల్లో పూర్తి హాజరు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలు, కళాశాలలకు వచ్చారని పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఎవరికైనా జ్వరం, జలుబు ఉంటే వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తెలియజేయాలని సూచించారు. మధ్యాహ్న భోజనం వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలకు హాజరుకాని విద్యార్థులకు సైతం ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తారని చెప్పారు. 70 శాతం సిలబస్ ప్రకారమే మూడు నెలలు తరగతులు కొనసాగుతాయని అన్నారు. కింది స్థాయి తరగతులు ప్రారంభించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
జనగాంలో పాఠశాలలను సందర్శించిన డైరెక్టర్ శ్రీదేవసేన
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల ప్రారంభమైన నేపథ్యంలో మొదటి రోజు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన జనగాం జిల్లాలో పలు పాఠశాలలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పెంబర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, లింగాల ఘన్‌పూర్‌లోని కెజిబివి, మోడల్ స్కూల్‌ను, జనగాంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్ సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ దేవసేన చాక్‌పీస్ పట్టుకుని విద్యార్థులకు పాఠాలు బోధించారు.
కొవిడ్ జాగ్రత్తల పర్యవేక్షణ జిల్లాల వారీగా అధికారుల నియామకం
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కొవిడ్ జాగ్రత్తల పర్యవేక్షణకు పాఠశాల విద్యాశాఖ జిల్లాలవారీగా అధికారులను నియమించింది. ఈ అధికారులు నాలుగు రోజులపాటు ఆయా జిల్లాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ, నారాయణపేట జిల్లాలకు జాయింట్ డైరెక్టర్ ఎం.సోమిరెడ్డిని నియమితులయ్యారు. అలాగే రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు డిప్యూటీ డైరెక్టర్ బి.వెంకటనర్సమ్మ, హైదరాబాద్ జిల్లాకు జాయింట్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాస చారి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు జాయింట్ డైరెక్టర్ కె.సత్యానారాయణరెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మీబాయి, అదిలాబాద్, నిర్మల్, కొమురంభీం, అసిఫాబాద్, మంచిర్యాల్ జిల్లాలకు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్, పెద్దపల్లి జిల్లాలకు జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్,వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్‌నగర్ జిల్లాలకు జాయింట్ ఆర్‌జెడి కె.లింగయ్య, నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆర్‌జెడి జి.రమేష్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాకు జాయింట్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాస చారిలు నియమించారు.

Schools reopen after 10 months in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News