Monday, December 23, 2024

మోగిన బడిగంట

- Advertisement -
- Advertisement -
సెలవులు పొడిగింపునకు విద్యాశాఖ ససేమిరా
రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్న పాఠశాలలు

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సోమవారం బడిగంట మోగింది. ఆదివారంతో వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. కొత్త ఆశలతో రానున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ఏడాది నుంచి కొన్ని నూతన కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఎండల తీవ్రత ఉన్నందున సెలవులు పొడిగించాలన్న వినతులను విద్యాశాఖ అంగీకరించలేదు. ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, మోడల్, కెజిబివి పాఠశాలలన్నీ సోమవారం తెరుచుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 వేల బడుల్లో దాదాపు 58 లక్షల మంది విద్యార్థులు బడిబాట పట్టారు. సర్కారు బడుల్లో కొత్త తరగతిని ప్రారంభించేందుకు వస్తున్న విద్యార్థుల కోసం ఈ ఏడాది పలు నూతన కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది. గతేడాది పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ఆలస్యం కావడంతో.. ఈ ఏడాది జాగ్రత్తగా వ్యవహరించింది. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ఇప్పటికే బడులకు చేరాయి. అయితే కొన్నిచోట్ల యూనిఫాం దుస్తుల రంగు మారడంతో.. ఆయా ప్రాంతాల్లో విద్యార్థులకు చేరేందుకు కొంత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఒకటి నుంచి 5వ తరగతి వరకు వర్క్ బుక్స్, 6 నుంచి పదో తరగతి వరకు నోట్ బుక్స్‌ను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయనుంది.

20 నుంచి విద్యార్థులకు రాగిజావ
సర్కారు బడుల్లో విద్యార్థుల్లో రక్తహీనత సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. ఈనెల 20 నుంచి రోజూ ఉదయం రాగిజావ ఇవ్వాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజనం మెనూలోనూ మార్పులు చేశారు. వారంలో ఒక రోజు కిచిడీ, మరో రోజు వెజిటబుల్ బిర్యానీ ఇవ్వనున్నారు. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియంను ఏటా ఒక తరగతికి విస్తరిస్తున్నారు. ఈ ఏడాది తొమ్మిదో తరగతికి ఇంగ్లీష్ మీడియం ప్రారంభం కానుంది. మరోవైపు పలు సమస్యలు కూడా విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు కొలిక్కి రాకపోవడంతో.. టీచర్ల నియామక ప్రక్రియ జరగలేదు. అనేక బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరత, సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యావాలంటీర్ల నియామకం పాఠశాల విద్యాశాఖ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News