Monday, December 23, 2024

విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాలలు బాగుండాలి

- Advertisement -
- Advertisement -
  • సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ

మంచాల: విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాలలు బాగుండాలని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ అన్నారు. మండల పరిధిలోని చీదేడ్ గ్రామంలో జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పున:నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్‌రెడ్డితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణ పట్టుదలతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం బలోపేతం చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో చీదేడ్ గ్రామాన్ని జెడి ఫౌండేషన్ దత్తత తీసుకుంటుందని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ బైరికా రమాకాంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అభినందించారు. అనంతరం జడ్పిటిసి నిత్యనిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. తమవంతుగా మండల పరిధిలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తన సొంత నిధులతో మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు.

సర్పంచ్ మాట్లాడుతూ అడగగానే స్కూల్ నిర్మాణానికి సహాయం అందించిన జెడి ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. తనవంతుగా పాఠశాల అభివృద్ధికి రూ. 50 వేలు అందజేసినట్లు చెప్పారు. గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ శ్రీనివాస్, ఎంఇఒ వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ తిరుమలేష్, ప్రదానోపాధ్యాయుడు శంకరయ్య, గ్రామస్థులు శ్యామ్‌సుందర్, వెంకయ్య, శేఖర్ రెడ్డి, దేవరకొండ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News