10 నెలల తర్వాత బడిబాట పట్టనున్న విద్యార్థులు
పాఠశాలల్లో 9,10 తరగతులకే ప్రత్యక్ష తరగతులు
ప్రారంభం కానున్న ఇంటర్, ఆపై కోర్సుల క్లాసులు
హాజరు తప్పనిసరి కాదు….
హాజరయ్యేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
ఈ ఏడాది 89 పనిదినాలలో ప్రత్యక్ష బోధన
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 10 నెలల తర్వాత స్కూల్, కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. కొవిడ్ 19 పరిస్థితులతో గత ఏడాది మార్చిలో మూతపబడిన విద్యాసంస్థలు సోమవారం మళ్లీ తెరుచుకోనున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం ఇప్పటివరకు ఆన్లైన్ తరగతులకే పరిమితమైన విద్యార్థులు సోమవారం నుంచి మళ్లీ ప్రత్యక్ష తరగతులకు హాజరుకానున్నారు. పాఠశాలల్లో 9,10 తరగతులకే ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానుండగా, ఇంటర్ ఆపైన కోర్సులు చదివే విద్యార్థులందరూ క్లాసు రూముల్లో ప్రత్యక్షంగా నిర్వహించే తరగతులకు హాజరుకానున్నారు.
చాలా రోజుల తర్వాత విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖతో పాటు సంక్షేమ శాఖల పరిధిలో నడిచే గురుకులాల్లో పగడ్భంధీగా ఏర్పాట్లు చేశారు. ప్రతి పాఠశాల, కళాశాలతో పాటు ప్రతి హాస్టల్లో ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మాస్కులు ధరించేలా జాగ్రత్త వహించనున్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల మధ్య 6 మీటర్ల భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం సింగిల్ సీటింగ్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. విద్యాసంస్థల్లో పరిశుభ్రత పాటిస్తూ ఫర్నీచర్, స్టేషనరీ, కిచెన్, క్యాంటీన్, లేబరేటరీ, లైబ్రరీలలోని వస్తువులను ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు డిస్ఇన్ఫెక్ట్ చేయించారు. విద్యాసంస్థల్లో థర్మోమీటర్లు, సబ్బులు అందుబాటులో ఉంచారు. పాఠశాలలు, కళాశాలలకు హాజరయ్యేందుకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఇప్పటికే విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆన్లైన్, డిజిటల్ తరగతులు కొనసాగుతాయని వెల్లడించింది. అలాగే ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని, కనీస హాజరుతో సంబంధం లేకుండా టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలతో పాటు డిగ్రీ, పిజి సెమిస్టర్ పరీక్షలకు అనుమతించాలని విద్యాశాఖ పేర్కొంది.
జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన మానిటరింగ్ కమిటీ
విద్యాసంస్థల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఒసి) మార్గదర్శకాలను అమలు చేసేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ కమిటి(డిఎల్ఇఎంసి)లను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్, జిల్లా వైద్యాధికారి, మున్సిపల్ కమిషనర్ జిల్లా పంచాయత్ ఆఫీసర్, జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, కళాశాల విద్యాశాఖ గుర్తించిన ప్రిన్సిపాళ్లు, కలెక్టర్ నామినేట్ చేసిన ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. టాయిటెట్లు, తాగునీరు సౌకర్యాలు, పరిశుభ్రత, సానిటైజేషన్ సౌకర్యాలపై డిపిఒలు పర్యవేక్షించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. పాఠశాలలు రెగ్యులర్ పనివేళల్లో పనిచేస్తాయనున్నాయి. 9,10 తరగతుల విద్యార్థులకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తం 89 పనిదినాలలో భౌతిక తరగతులు జరుగనున్నాయి. ఫిబ్రవరి నెలలో 24, మార్చిలో 25, ఏప్రిల్‌లో 21, మే నెలలో 19 రోజులలో విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన జరుగనుంది. ఈ విద్యాసంవత్సరం మొత్తం 204 పని దినాలుగా నిర్ణయించారు. అందులో గత ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు 115 రోజులు ఆన్లైన్ తరగతులు నిర్వహించగా, 89 రోజులపాటు ప్రత్యక్ష విద్యా బోధనతో పాటు ఆన్లైన్ తరగతులు కూడా కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పాఠశాలలు కొనసాగనుండగా, హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలలో ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల పాఠశాలలు కొనసాగనున్నాయి. అలాగే ఆన్లైన్ తరగతులు కొనసాగనున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రెండు పిరియడ్ల చొప్పున డిజిటల్ తరగతులు కొనసాగనున్నాయి. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు హాజరు తప్పనిసరి కాదని ఇప్పటికే విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంటినుంచే చదువుకుంటామనే విద్యార్థులను అనుమతించడంతోపాటు కనీస హాజరును పట్టించుకోకుండా పరీక్షలకు అనుమతించాలని విద్యాశాఖలో జారీ చేసిన ఆదేశాలలో స్పస్టం చేసింది. 70 శాతం సిలబస్‌ను తరగతులు బోధిస్తారని, 30 శాతం సిలబస్‌కు అసైన్మెంట్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.
విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే రోజు విడిచి రోజు తరగతులు
జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే ప్రథమ సంవత్సరం ఒక రోజు, ద్వితీయ సంత్సరం ఆ తర్వాత రోజు తరగతులు నిర్వహించనున్నారు. 300లకు పైగా విద్యార్థులు ఉన్న కళాశాలల్లో విద్యార్థులకు రోజు విడిచి రోజు తరగతులు జరుగనున్నాయి. ఇంటర్లో కూడా 70 శాతం సిలబస్‌ను తరగతులు బోధించనుండగా, 30 శాతం సిలబస్‌కు అసైన్మెంట్ మాత్రమే ఉంటుంది. అలాగే వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ కళాశాలల్లో 50 శాతం విద్యార్థులు భౌతిక తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించారు. యుజిసి మార్గదర్శకాలకు అనుగుణంగా భౌతిక తరగతులు ప్రారంభం కానున్నాయి. సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు కనీస హాజరు అవసరం లేదని ఇప్పటికే విద్యాశాఖ స్పష్టం చేసింది.యూనివర్సిటీలలో మాత్రం నాలుగైదు రోజుల తర్వాత హాస్టళ్లు తెరుచుకోనున్నట్లు సమాచారం.
కొవిడ్ జాగ్రత్తలు తప్పనిసరి
పాఠశాలలు, కళాశాల్లలో కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ప్రత్యక్ష బోధన కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయుల సమీప ఆరోగ్య కేంద్రాల వివరాలు, ఫోన్ నెంబర్లు సేకరించి పెట్టుకున్నారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విద్యార్థులకు ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వారి తల్లిదండ్రులకు తెలియజేసి, తగిన జాగ్రత్తలతో ఇళ్లకు పంపేంచేలా ముందస్తుగా సంసిద్ధమవుతున్నారు. విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలిగించేలా భౌతికదూరం పాటిస్తూ సాధారణ యోగా, మెంటల్ మ్యాథ్స్ గేమ్స్, అంత్యాక్షరి వంటి కో కరికులమ్ కార్యకలాపాలు నిర్వహించేలా సమాయత్తమవుతున్నారు.
అకడమిక్ క్యాలండర్
ఫిబ్రవరి 1 నుంచి 9,10 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభం
మే 26వ తేదీ చివరి పని దినం
మే 27 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు
మార్చి 15 లోగా ఫార్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్ష
ఏప్రిల్ 15 లోగా ఫార్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్ష
మే 7 నుంచి మే 13 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఎ) పరీక్షలు
మే 17 – మే 26 వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలు
విద్యా సంస్థల్లో చేపడుతున్న చర్యలపై ఎప్పటికప్పుడు తనిఖీలు: విద్యాశాఖ మంత్రి సబిత
ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రత్యక్ష తరగతులకు విధిగా కోవిడ్ మార్గదర్శకాలు పాటించాల్సిందేనని విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తామని, ఉదాసీనంగా వ్యవహరించకుండా చూడాలని మంత్రి కోరారు. ప్రభుత్వ, ప్రయివేటు, మోడల్ స్కూళ్లలో 11,38, 382 విద్యార్థులు హాజరుకానున్నారని మంత్రి తెలిపారు. ప్రతి నిత్యం శానిటేషన్ పనులను చేపట్టాల్సిన బాధ్యత ఆయా యజమాన్యాలదే నని మంత్రి తెలిపారు. విద్యా సంస్థలు సురక్షితమన్న భావనను కల్పించాలని కోరారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. వైద్య, ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలల్లో కూడా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు.