Monday, December 23, 2024

చదువులు సాగేనా.. ఆగేనా..?

- Advertisement -
- Advertisement -

రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
ఈనెల 8 నుంచి విద్యాసంస్థలకు సెలవు
టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభం
డైలమాలో తల్లిదండ్రులు

Schools will be closed with Corona virus
మనతెలంగాణ / హన్మకొండ ప్రతినిధి:  రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులుగా పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులతో మూడోవేవ్ ముంచుకొస్తుందా అనే ఆందోళన ప్రజల్లో మొదలైంది. ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ వరకు సభలు, సమావేశాలకు అనుమతులు నిరాకరించడంతో పాటు విద్యాసంస్థలకు ఈనెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించడంతో ముందస్తు జాగ్రత్తలేననే చర్చ సాగుతోంది. ప్రస్తుతం టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. అయినప్పటికీ పాజిటివ్ కేసులు భారీగా వస్తుండడంతో ఈ విద్యాసంవత్సరం సాగేనా.. ఆగేనా అనే ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్యం ఉంది.

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 40,400 మంది విద్యను అభ్యసిస్తుండగా ప్రైవేట్ పాఠశాలల్లో 1,01,030 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కరోనా మొదటి, రెండో వేవ్ నుంచి తేరుకుని ఇప్పుడిప్పుడే పాఠశాలలకు విద్యార్థులు పూర్తిస్థాయిలో పోతున్నారు. ఇటీవల మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ ముప్పుతో టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థులకు గతేడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచే ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి విద్యాసంస్థలు మూతబడేనా అనే ప్రచారం జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తుండడం కూడా ఆలోచనలో పడేస్తుంది.

గందరగోళంగా విద్యావ్యవస్థ

2019-, 20 విద్యాసంసత్సరం చివరలో కరోనా విజృంభించడంతో వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. 20, 21 విద్యా సంవత్సరంలో ప్రత్యక్ష తరగతులు సాగలేదు. దీంతో ఆన్‌లైన్ అలవాటు లేని విద్యార్థులు, యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విద్యాసంవత్సరంలోనూ ఆగస్టు వరకు కూడా ఆన్‌లైన్ తరగతులే నడిచాయి. దీంతో విద్యార్థులు విద్యకు దూరమయ్యాయి. ఇన్నేళ్లు ప్రత్యక్ష తరగతులకు అలవాటుపడ్డ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో విద్యావ్యవస్థ గాడితప్పింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తేదీనుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా కరోనా కల్లోలాన్ని ప్రత్యక్షంగా చూసిన తల్లిదండ్రులు నెలరోజుల వరకు కూడా పిల్లలకు పాఠశాలలకు పంపేందుకు సాహసించలేదు. ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న విద్యావ్యవస్థపై మూడో ముప్పు ప్రచారం దెబ్బతీసే ప్రమాదం ఉంది.

మళ్లీ ఆన్‌లైనా..

ప్రస్తుతం 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారికి కరోనా వ్యాక్సినేషన్ జిల్లావ్యాప్తంగా చేస్తున్నారు. విద్యార్థులు కూడా ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. అతికొద్ది రోజుల్లోనే 100 శాతం పూర్తిచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ తల్లిదండ్రుల్లో మాత్రం భయం ఉంది. ప్రస్తుత పరిణామాలతో మళ్లీ ఆన్‌లైన్ తరగతులు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవల పెరుగుతున్న కేసులతో మూడో వేవ్ ముప్పు ఉన్నట్లయితే మళ్లీ ఆన్‌లైన్ తరగతులు తప్పవనే ప్రచారం మాత్రం సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News