Monday, January 20, 2025

శాస్త్ర సాంకేతిక రంగాలకు మానవీయ విలువలు అవసరం: జూలూరు గౌరీశంకర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శాస్త్ర సాంకేతిక రంగాలకు మానవీయ విలువలు తోడైతేనే ఆ రంగాలలో సాధించిన ప్రగతి ప్రపంచానికి ఉపయోగపడుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు పురోభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే మానవ శాస్త్రాల పరిజ్ఞానం కూడా ఆ శాస్త్రవేత్తలకు ఎంతో అవసరం అన్నారు. రవీంద్రభారతిలో ఎక్స్‌ప్లోరా నాలెడ్జి ఒలింపియాడ్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఐఐటి టెస్ట్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు వార్షిక అవార్డుల ప్రదాన ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూలూరు విద్యార్థులకు వార్షిక అవార్డులు ప్రదానం చేశారు.

ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఎక్స్ ప్లోరా నాలెడ్జి ఒలింపియాడ్ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 50 నగరాల్లోని 350 స్కూళ్ళలో వేలాది మంది విద్యార్థులకు నిర్వహించిన ఐఐటి టెస్టులో ప్రతిభ చూపిన రెండు వందల మంది విద్యార్థులకు జూలూరు సర్టిఫికేట్లను, మెమొంటోలను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషపై గౌరవాన్ని ప్రేమను పిల్లలకు బాల్య దశలోనే వారి మనసుల్లో నాటాలని చెప్పారు. మంచి పుస్తకాలు మంచి కథలు మంచి కవిత్వం చదువుకుంటే వాళ్లు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు.

మార్కులు ర్యాంకులతో పాటుగా మానవీయ విలువలు కూడా ఎంతో ప్రధానమైనవని చెప్పారు. తల్లిదండ్రులు మంచి పుస్తకాలను సాహిత్యాన్ని చదువుతూ ఉంటే ఆ ప్రభావం పిల్లలపై బలంగా పడుతుందని విశ్లేషించారు. వినోదానికి పెట్టే ఖర్చులో పుస్తకాలను కూడా కొనేందుకు వెచ్చించాలని కోరారు. మనిషిని మనిషి ప్రేమించే మహోన్నత సంస్కృతిని పిల్లల మనస్సుల్లో నాటాలని ఈ గురుతరమైన బాధ్యతను విద్యాసంస్థలు చేపట్టాలని జూలూరు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సైంటిస్టు డా. ఎన్. కిశోర్ నాథ్, క్లార్క్ యూనివర్సిటీ అసిస్టెంటు ప్రొఫెసర్ గూఢపతి నిశాంత్ , కృష్ణవేణి, ది మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల ఛైర్మన్ సంగాని రాజు, సి.ఇ.ఓ మామిడిశెట్టి రజిత్ కుమార్‌లు కూడా ప్రసంగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News