‘The pursuit of science is a never-ending journey into the unknown, fueled by curiosity and guided by reason’ Neil Armstrong
‘Science is important for many reasons, among which is the ability to amaze us with what we see and experience. Almost everyone has experienced moments when science has unravelled or created a puzzle of the world and the univers’ Fabr&cio Pamplona Researcher, Max Planck Institute of Psychiatry.
ఇటీవల శాస్త్ర సాంకేతిక నిపుణుల పరిభాషలో స్థిరపడిన సంక్షిప్త పదం Scicom. సైన్స్ కమ్యూనికేషన్ (Science communica tion) అనేది దీని పూర్తి రూపం. శాస్త్రీయ సమాచారం, ప్రయోగాలు ఫలితాలనూ జనసామాన్యానికి అర్థమయ్యే విధంగా వివరించడాన్నే సైన్స్ కమ్యూనికేషన్ అంటారు. Scicom గురించి మాట్లాడుకునే ముందు జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ డార్విన్ మహాశయుడు నవంబర్ 24, 1859లో ప్రచురించిన బృహద్గ్రంథం ‘On the Origin of Species’ మూలంగా తత్పూర్వపు మత దృక్పథం స్థానంలో ఆధునిక దృక్పథం అలవడటంతో పాటు అనేక కారణాల రీత్యా సైన్స్ చాలా ముఖ్యమైందన్న అవగాహన ప్రజలకు బలపడిన విషయాన్ని మాట్లాడుకోవాలి. మనం చూసే, అనుభవించే ప్రపంచంలో మనల్ని సంభ్రమాశ్చర్యచకితులను చేస్తూ వాస్తవాలెన్నిటినో ఇప్పటికే సైన్సు బహిర్గతపరచింది.
అధునాతనంగా ఎప్పటికప్పుడు సైన్సు వ్యాప్తి, వివిధ ఆవిష్కరణలు ప్రయోగాలు విప్పి చెబుతున్న విశ్వ రహస్యాలను, సైన్సు అందిస్తున్న సౌకర్యాలను అనుక్షణం ప్రతి ఒక్కరం చవిచూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో దృగ్విషయాలతో పాటు ప్రాకృతిక సంఘటనలు పర్యవసానాల గ్రహింపునకు అతి ముఖ్యమైన వారధిగా సైన్స్ కమ్యూనికేషన్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సైన్స్ కమ్యూనికేషన్ ద్వారానే సైన్స్ విస్తృతిని పొందుతూ, అనంతర శాస్త్రీయ ఆవిష్కరణలకూ, ఆచరణకూ పాదులు వేస్తుంది. ఇంతేకాదు, సైన్స్ కమ్యూనికేషన్ ఇప్పుడు కెరీర్ అభివృద్ధికి అత్యధ్బుతమైన అవకాశాలనూ సృష్టిస్తున్నది. సహజ శాస్త్రాలు, అనువర్తిత శాస్త్రాలు, ఇంజినీరింగ్, వైద్య శాస్త్రం, పర్యావరణం సామాజిక శాస్త్రాల వివిధ విభాగాల్లో ఏర్పడి వున్న ప్రజా శాస్త్రీయ అంతరాలను పూడ్చేందుకు సైన్స్ కమ్యూనికేషన్ ఒక పరిష్కార మంత్రంగా పని చేస్తున్నది. సైన్స్ కమ్యూనికేటర్లు మానవ చైతన్యానికి అడ్డంకిగా వున్న అనేక సవాళ్లను అధిగమిస్తూ సైన్స్ సిద్ధాంతాలనూ పరికల్పనలనూ రోజువారీ భాషలోకి అనువదిస్తున్నారు.
శాస్త్ర సంబంధిత విషయాలలో ఏ శాస్త్రవేత్తకైనా లేదా రచయితకైనా సైన్స్ కమ్యూనికేషన్ ఎందుకు కీలకమైందో కూడా సైన్స్ కమ్యూనికేటర్లు తమ అధ్యయనాల్లో, పరిధిలో చర్చకు పెడతారు. సమాజంలో మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో సంక్లిష్టతల దిగ్బంధంలో సైన్స్ కమ్యూనికేషన్, కమ్యూనికేటర్ల ఆవశ్యకత ప్రపంచానికి ఎంతైనా ఉంది.
ఇదివరకటి కంటే కోవిడ్ అనంతరం మానవాళికి సైన్సు అవసరం మరింత పెరిగింది. వ్యాక్సిన్‌ల తయారీ, ఆరోగ్య సంబంధ వస్తూత్పత్తులు, చికిత్స, ప్రాణరక్షణ గురించి సైన్సు రంగంలో సంచలనాత్మక ఆవిష్కరణలు జరుగుతున్నాయి. వీటి లోటుపాట్లను ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా సైన్స్ కమ్యూనికేటర్లదే. పరిశోధనా సంస్థలు సరికొత్త జ్ఞానాన్ని అందించడంలో ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తాయి. అసలు పరిశోధనలే ప్రాథమిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని నిర్దిష్ట అనువర్తనాలుగా మార్చగలవు. పాండమిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఎంట్రీ, ఆహార భద్రత, విద్యుత్తు, వాతావరణ మార్పుల వంటి ప్రధానమైన విషయాల్లో పరిశోధనలే సమాచారాన్ని సాక్ష్యాలతో సహా ప్రజలకు శీఘ్రగతిన చేరవేస్తాయి.
‘సైన్స్ యూరప్’ సంస్థ చెబుతున్నట్టు ‘సైన్స్ దాని గొప్ప కోసం ఏదీ మాట్లాడదు: శాస్త్రీయ ఆధారాలు తక్షణమే అందుబాటులో ఉంచడం, అర్థం చేయించడం అనేదే ప్రజలకు కావలసింది’. ‘ఈ బాధ్యతనే Scicom నెరవేర్చగలదు. మరీ ముఖ్యంగా తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు, అభూత కల్పనలు, ఛాందసాచారాలు, సమాచార చౌర్యం వివిధ రూపాల్లో సమస్యగా మారి ప్రజల్ని తికమకపెడుతున్న నేపథ్యంలో సైన్స్ కమ్యూనికేషన్ తీర్పరి పాత్ర పోషించాలి, పోషిస్తున్నది కూడా. సైన్స్ కేవలం తత్సంబంధిత అంశాలనే కాకుండా ఇతరత్రా సామాజిక శాస్త్రాలు, కళలకు సంబంధించిన భావనలను తార్కికంగా వెల్లడించగలదు. ఇందుకు సైన్సుకు కొత్త జోడింపులు కూడా అవసరం. అందుకే ప్రసిద్ధ ఫిజిషియన్, పులిట్జర్ ప్రైజ్ విజేత సిద్ధార్థా ముఖర్జీ తన గ్రంథం ‘ద జీన్: యాన్ ఇంటిమేట్ హిస్టరీ’ Through the looking new glasses అధ్యాయంలో ‘The new science would be used to understand history, language, memory, culture, sexuality, identity and race’ అంటూ సైన్సు పరిణతిని ప్రస్తావించారు. సమాజ భవిష్యత్తు కోసం ప్రతిభావంతులైన తరువాతి తరం రూపొందాలంటే విద్యార్థులకు సాంఘిక శాస్త్రాలతో సహా అన్నింటిలో శాస్త్రీయస్పృహ వైపుకు ప్రేరేపణ అందాల్సి వుంది.
ఆర్థిక వ్యవస్థ మొదలుకొని పర్యావరణం దాకా వైజ్ఞానిక పంథాను అనుసరించే ప్రజా సమూహాలున్నప్పుడే సంక్షోభాల నుండి భూమి గట్టెక్కగలదు. ఇందుకు సైన్స్ కమ్యూనికేషనే శక్తివంతమైన సాధనం. అయితే సైన్స్, ప్రపంచంలో ఎక్కడో ఓ మూలన ఉత్పన్నమవుతుంటుంది. అక్కడ నుంచి సైన్స్ ఇతర ప్రాంతాలకు, కమ్యూనిటీలకు బట్వాడా అయ్యేది సైన్స్ కమ్యూనికేటర్ల మూలంగానే. అందుకే సైన్స్ అభివృద్ధిలో కమ్యూనికేషన్‌తో పాటు కమ్యూనికేటర్లు కూడా ముఖ్యమైన వాళ్లు. ఈ మొత్తం వ్యవహారంలో సైన్స్ లిటరసీది కూడా ప్రధాన భూమిక.
సైన్స్ కమ్యూనికేషన్ ఎట్లా ఉపయోగపడుతుందనే ప్రశ్నకు ఓజోన్ ఉద్యమం మంచి ఉదాహరణ. హాలెండ్‌కు చెందిన పాల్ జె. క్రూట్‌జెన్ అనే శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత 1980 లలో ఓజోన్ పొరను క్లోరోఫ్లోరో కార్బన్ (సిఎఫ్‌సి)లు దెబ్బ తీస్తున్నాయని కనుగొన్నాడు. అతని ఆవిష్కరణ వివిధ పరిశోధనా పత్రాల ద్వారా, జర్నల్స్ ద్వారా కమ్యూనికేటర్ల కృషితో క్లోరోఫ్లోరో కార్బన్‌ల ప్రమాదాలను ప్రజలు గుర్తించారు. ఫలితంగా 1987లో ఐక్యరాజ్య సమితి మాంట్రియల్ ప్రోటోకాల్‌ను రూపొందించింది. ఈ అంతర్జాతీయ ఒప్పందం సిఎఫ్‌సిల ఉత్పత్తిని, వినియోగాన్ని సాధ్యమైనంత అడ్డుకోగలిగింది, పరిమితం చేయగలిగింది. అప్పటి నుంచి ఓజోన్ పొర కోలుకోవడమే కాకుండగా పరిరక్షణకు అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమం ఉధృతమైంది. క్రూట్‌జెన్ మహానుభావుడి ఓజోన్ సేఫ్టీ వాదనలు సైన్స్ కమ్యూనికేషన్ ద్వారా భూగ్రహానికి దాపుండి కాపుకాస్తున్నవి.
అంతర్జాతీయంగా సువెర్నో సుజికి, గ్రేటా థంబర్గ్, మన దగ్గర సుందర్ లాల్ బహుగుణ, మేధాపాట్కర్, అరుంధతీరాయ్, వనజీవి దరిపెల్లి రామయ్య, పర్యావరణ పరిరక్షణోద్యమాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, సామాజిక అడవుల పెంపకం ఓజోన్ లిటరసీలో భాగమే. సైన్సుకు పరిశోధనా పత్రాలు, బ్లాగ్ పోస్టులు, సైన్సు శ్వేత పత్రాలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. సైన్సు కమ్యూనికేషన్ ప్రక్రియలో తమదైన కృషిని కొనసాగిస్తున్న వరిష్ఠ పరిశోధకులకు గత పదిహేను సంవత్సరాలుగా నవంబరు 15 న ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ అవార్డులతో సత్కరిస్తుంది. ఈ అవార్డు క్రింద ఒక్కొక్కరికి లక్ష అమెరికా డాలర్లను ప్రైజ్ మనీగా అందిస్తూ ‘ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్సెస్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ (6) విభాగాల్లోంచి విజేతలను ఎంపిక చేస్తుంది. మానవీయ శాస్త్రాల విభాగంలో ఇన్ఫోసిస్ అవార్డు 2023ను కైవసం చేసుకున్న జహ్నవి ఫాల్కే ‘I prefer the term public engagement in Science’ అంటూ సైన్స్ కమ్యూనికేషన్‌ను పునర్నిర్వచించింది.
పబ్లిక్ అవేర్‌నెస్ ఆఫ్ సైన్స్, పబ్లిక్ అండర్ స్టాండింగ్ ఆఫ్ సైన్స్, సైంటిఫిక్ కల్చర్, సైంటిఫిక్ లిటరసీ మొదలైన పర్యాయ పదాలతో సంబోధించబడుతున్న సైన్స్ కమ్యూనికేషన్ అధ్యయనానికి డిగ్రీ, పిజికోర్సులు కూడా ఆయా విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో వున్నాయి. ఉపాధి అవకాశాలకు వస్తే సైన్స్ జర్నలిస్టు/ రైటర్, సైంటిఫిక్ కాపీ ఎడిటర్, సైంటిఫిక్ కమ్యూనికేషన్ డైరెక్టర్, సైంటిఫిక్ కమ్యూనికేషన్ ఆఫీసర్ ఇత్యాది ఉద్యోగాలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో లభిస్తాయి. స్టీఫెన్ హాకింగ్ అన్నట్టు జ్ఞానానికి శత్రువు అజ్ఞానం కానేకాదు, జ్ఞానంలో తిష్ఠ వేసిన భ్రమ. మరి, భ్రమలను పాపి జ్ఞానం ఒడ్డుకు మానవాళిని చేర్చే కర్తవ్యాన్ని ఈ యుగంలో సైన్స్ కమ్యూనికేషన్ తీసుకుంది.విద్యావంతులు చేయాల్సిందల్లా ఆహ్వానించడం సైన్సును ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళడమే.