మన తెలంగాణ / హైదరాబాద్ : జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భముగా ఫిబ్రవరి 26 నుండి 28 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సైన్స్ డే వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భముగా నిర్వహించే వివిధ కార్యక్రమాలు, పోటీలలో వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి విద్యార్థినీ విద్యార్థులు హాజరు కానున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారి డా.కె. రజనీ ప్రియ తెలిపారు. ఈ నెల 26 నుండి 28 ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే సైన్స్ ఇన్నోవేషన్ ఎక్సహిబిట్స్ ను శాస్త్రీయ, పరిశోధన, అభివృద్ధి సంస్థలైన ఎన్‌ఆర్‌ఎస్‌సి, ఎన్‌జిఆర్‌ఐ, సిసిఎంబి, జిఎస్‌ఐ, ఎన్‌ఎస్‌టిఐ, ఐఐఐటిహెచ్ ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేసి వారి సాంకేతికతను ప్రదర్శిస్తారని తెలిపారు.
నేషనల్ బుక్ ట్రస్ట్, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన జరుగనుందని, మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ విజ్ఞాన, సాంకేతికతను సంబంధించిన పుస్తకాల ప్రదర్శన ఉంటుందన్నారు. ఫిబ్రవరి 26న ప్రారంభం కానున్న ఈ వేడుకల్లో మొదటి రోజున ‘సైన్స్ టెక్నాలజీలో తాజా పోకడలు’ పేరుతో క్విజ్ కాంపిటీషన్ జరగనుందని, సైన్సుకు సంబందించిన సెమినార్లు జరగనున్నాయని తెలిపారు. ఫిబ్రవరి 27న వివిధ పాఠశాలలు, విద్య సంస్థల నుండి విద్యార్థులు తమ ఎక్సహిబిట్స్ ను ప్రదర్శిస్తారు. ఈ పోటీకి స్టార్టుప్ ఇండియా వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మూడు రోజులు పాటు వివిధ శాస్త్రవేత్తల ద్వారా జరిగే ఈ విజ్ఞాన, సాంకేతిక సమ్మేళనంలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని విజ్ఞానానికి సంబందించిన వివరాలు తెలుసుకోగలరని రజని ప్రియ తెలిపారు.