Monday, January 20, 2025

స్వాతంత్య్రోద్యమంలో సైన్సు

- Advertisement -
- Advertisement -

1908 సెప్టెంబర్ 28న హైదరాబాదులో వచ్చిన వరదలు విపరీతమైన నష్టాన్ని కలిగించాయి. బొంబాయి ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగి అధ్యయనం కోసం లండన్‌లో ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు హైదరాబాదును రక్షించమని విన్నపం నిజాం నుంచి వెళ్ళింది. మధ్యలో రావడం ఇష్టం లేకపోయినా 1909 ఏప్రిల్‌లో హైదరాబాదు సంస్థానానికి విశ్వేశ్వరయ్య చీఫ్ ఇంజినీర్ అయ్యారు. శాశ్వత పరిష్కారం కోసం అన్ని కోణాల్లో అధ్యయనం చేసి మూసి, ఈసి నదుల మధ్య ఉండే హైదరాబాదు వరదల వల్ల నష్టపోకుండా మిగులు నీరు వ్యవసాయానికి, ఉద్యానవనాల రూపకల్పనకు, మంచిడ్రైనేజ్ సిస్టమ్‌కోసం ఉపయోగపడేలా ఆయన ప్రణాళిక చేశారు. దాని ఫలితంగానే ఈ నదుల మీద హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ డాముల నిర్మాణం జరిగింది. ఒక్క హైదరాబాదుకే కాదు ఆయన సేవలు పొందని భారతీయ నగరం లేదేమో! మైసూరు, బరోడా, భోపాల్, గ్వాలియర్, ఇండోర్ ఇలా 20 నగరాల పేర్లు, ఓ అరడజను నదుల పేర్లు మనం చెప్పుకోవచ్చు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే మూడు దారులు విశ్వేశ్వరయ్య సూచించినవే! సైంటిస్టులు ఈ రీతిలో దేశం కోసం తోడ్పడ్డారు.

18 85లో జగదీశ్‌చంద్రబోస్ లండన్ నుంచి తిరిగివచ్చి, కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో ఆచార్యుడుగా చేరారు. భారతీయుడైనందుకు మూడింట రెండు వంతులు, తాత్కాలిక (అఫిషియేటింగ్) ఉద్యోగం కనుక అందులో సగం (అంటే కేవలం మూడో వంతు) జీతాన్ని ఇవ్వాలని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆత్మాభిమానమున్న జగదీశ్ చంద్రబోస్ ఆ తక్కువ జీతాన్ని అంగీకరించకుండా నిరసన తెలియజేస్తూ ఉద్యోగాన్ని మాత్రం కష్టాలెదుర్కొంటూ చేశారు. మూడేళ్ళ తర్వాత మొత్తం జీతం బ్రిటీష్ ప్రభుత్వం ఇవ్వక తప్పలేదు. అప్పట్లో జగదీశ్ చంద్రబోస్ పరిశోధనా పత్రాలను బ్రిటీష్ జర్నల్స్ ప్రచురించలేదు.స్వామి వివేకానంద శిష్యురాలు నివేదిత పూనికపై ఆ పత్రాలు పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఎప్పుడూ ఖాదీ వాడ్డం వల్ల డాక్టర్ కె.ఎల్. రావును ‘ఖాదీ ఇంజినీర్’ అనేవారు. భారత స్వాతంత్య్రోద్యమంలో ఇంజినీర్లు పెద్దగా పాల్గొనలేదని కె.ఎల్.రావు చింతించేవారు.

ఇలాంటి స్ఫూర్తివంతమైన సైన్స్ కథనాలు మన చరిత్ర పుటల్లో తరచిచూస్తే కనబడతాయి. వందమంది ఆయుర్వేద వైద్యులతో కన్యాకుమారి నుంచి పెషావర్ వరకు ఆచంట లక్ష్మీపతి రెండు సార్లు ఆరోగ్య యాత్రలు చేశారు. గ్రామాలు సందర్శించి, అలవాటుల్లోని పొరపాట్లను సవరిస్తూ, ఔషధాలను సూచిస్తూ అవగాహన పెంచేవారు. గాంధీజీ ఆహ్వానంపై సేవాగ్రాం నుంచి లక్ష్మీపతి ఆరోగ్యయాత్ర చేయడమే కాక, సేవాగ్రాంలో ఔషధ వనం ఏర్పాటు చేశారు. మహా శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు వైద్యానికి పనికివచ్చే ఖాదీహాండ్ గ్లౌవ్స్, ఖాదీ సర్జికల్ సూట్ రూపొందించారని ఎంత మందికి తెలుసు? ‘అఛీవ్‌మెంట్స్ ఇన్ అనానిమిటీ’ (అజ్ఞాతంలో ఉండిపోయిన అఖండ విజయాలు)పేరున చీకటిలో మిగిలిపోయిన భారతీయ శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని, త్యాగాన్ని ప్రస్తుతిస్తూ 1994లో సి.ఎస్.ఐ.ఆర్ విలువైన పుస్తకాన్ని ప్రచురించింది. ఇందులో చోటు చేసుకున్న 14 మంది శాస్త్రవేత్తలలో ఎల్లాప్రగడ సుబ్బారావు, కొలాచల సీతారామయ్య తెలుగువారు కావడం; ఇంకా వారిద్దరి గురించి రాసిన ఎస్.పి.కె. గుప్త కూడా తెలుగువారు కావడం మనం గర్వించాల్సిన విషయం.

1757 జూన్‌లో ప్లాసీ వద్ద బెంగాలు నవాబుపై విజయం సాధించడంతో బ్రిటీష్ పాలన భారత దేశంలో మొదలైంది. ఇది జరిగిన మూడేళ్ళకు 1760లో ఇంగ్లండులో మొదటి పారిశ్రామిక విప్లవం ఆరంభమైంది. భారత దేశ సహజ సంపదను, వనరులను అన్వేషించే (తరువాతి కాలంలో దోపిడీకి పనికి వచ్చే) రీతిలో 1767లో ‘సర్వే ఆఫ్ ఇండియా’ సంస్థ మొదలైంది. ఇక్కడ నుంచి ముడి ఖనిజాలు, ముడి పదార్థాలు సముద్రంమీద అక్కడికి తరలించి, తయారైన వస్త్రాలు మొదలైన వాటిని మళ్ళీ భారత దేశంలోనే అమ్ముకోవడానికి సైన్స్ (బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి) దోహదపడింది. జమ్‌షెడ్‌జీ టాటాకు సైన్స్ పరిశోధనా సంస్థ ప్రారంభించమని స్వామి వివేకానంద ఇచ్చిన సలహా కొన్ని దశాబ్దాల పాటు వాస్తవ రూపం దాల్చలేదు. సైన్స్ దృష్టి భారతీయులకు లేదు, పరిశోధనకు పనికిరారు అనే తప్పు కారణం మీదనే ఈ పరిశోధనా సంస్థను వాయిదా వేయాలని ప్రయత్నించారు. సరిగ్గా అదే కారణం చూపి బోసు జీతాన్ని కూడా తగ్గించారు. హైదరాబాదులో మలేరియా గురించి పరిశోధన చేసి నోబెల్ బహుమతి పొందిన రోనాల్డ్ రాస్ మహాశయుడు తన సహాయకులు కిషోరీ మోహన్ తోడ్పాటును ప్రస్తావించడానికి ఇష్టపడలేదు.

ఆధునిక కాలంలో అణ్వస్త్రాలు ఇతర దేశాలను బెదిరించి లొంగదీసుకోవడానికి బూచిలాగా అగ్ర దేశాలు వాడినట్టే, అప్పట్లో బ్రిటీష్ ప్రభుత్వం సైన్స్‌ను కూడా తన దోపిడీకి విజయవంతంగా వినియోగించింది. కానీ రుచి రాం సహానీ, ప్రఫుల్ల చంద్ర రే, అశుతోష్ ముఖర్జీ వంటి మహానుభావులు ఎందరో విజ్ఞాన శాస్త్రరంగంలో మహోన్నతమైన కృషి చేశారు. వీరి సేవలను ప్రస్తుతిస్తూ మరుగుపడిన సైన్సు పాత్ర, అణచివేతకు గురైన సైంటిస్టులు, దేశభక్తితో కూడిన సైన్సు సంస్థలు, సైంటిస్టులు రాక ఇటువంటి విషయాలను వివరించే రీతిలో వంద పేజీలలో ‘స్వాతంత్య్ర సమరంలో విజ్ఞానశాస్త్రం’ అనే తెలుగు పుస్తకం ఇటీవల (ప్రచురణ కాలం ఇవ్వలేదు) వెలువడింది. జయంత సహస్రబుద్ధే దేవవ్రత ఘోష్, రంజనా అగర్వాల్, రుచిర్ గుప్త, ఆనంద్ సి. రనడే, సోనంద్ సింగ్ సుబేదార్, చైతన్య గిరి, వివేకానంద పాయ్, జయంతి ఘోష్ వంటి వారు రాసిన ఆంగ్ల వ్యాసాలను తెలుగులో అనువదించి ఆకర్షణీయమైన రంగుల పుస్తకాన్ని విజ్ఞాన భారతి ప్రచురించింది.

అయితే ఏ వ్యాసాన్ని ఎవరు తెలుగులో అనువదించారో వారి వివరాలు ఆ వ్యాసం దగ్గరే ఇవ్వలేకపోయారు. అనువాదం సంబంధించి లోటుపాట్లు, గౌరవం ఆయా అనువాదకులు పొందడం సబబు. స్ఫూర్తి దెబ్బ తినకుండా సజీవమైన లేదా జీవకళ ఉట్టిపడే రీతిలో సైన్స్ అనువాదాలుండాలి.ఎందుకంటె ‘సైన్స్ లిటరసీ’ తక్కువ ఉన్న చోట సంబంధించిన రచనలు మరింత కమ్యూనికేటివ్‌గా ఉండాలి. అలాగే ఖరీదైన ప్రచురణగా కాకుండా లోప్రైస్ ఎడిషన్ అయితే మరింత ప్రయోజనకరం. ఈ తెలుగు అనువాదం తరువాయి భాగం రావాల్సి వుంది. ముందు ముందు విజ్ఞాన భారతి ఈ సూచనలు గమనించగలరని ఆశ.

డా. నాగసూరి వేణుగోపాల్
9440732392

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News