Saturday, December 21, 2024

అంతరిక్ష శోధనలో ముందడుగు

- Advertisement -
- Advertisement -

ప్రపంచ దేశాల్లో శాస్త్రసాంకేతిక డిజిటల్ యుగపు నవ విప్లవ ఫలాలు సగటు మానవుని జీవితంలో ఊహించలేనంతగా మార్పును తెచ్చాయి. విశ్వమానవాళి సంక్షేమానికి, సులభతర జీవన విధానానికి శాస్త్ర పరిశోధనలు ఊతం ఇస్తూనే ఉన్నాయి. అరచేతిలో స్మార్ట్ ఫోన్ వైకుంఠం వెలసి, విశ్వాన్ని కుగ్రామం చేసింది. ప్రయోగశాల నుండి ఖగోళం దాకా, వంటింటి నుంచి నక్షత్ర, గ్రహాల దాకా మానవుడు స్పృశించని తావు లేదు, అర్థం చేసుకోని అంశం లేదు. భూగ్రహాన్ని ఆకళింపు చేసుకోడానికి అంతరిక్ష పరిశోధనలు కావాలి. అనంత అంతరిక్షంలో లెక్కకు మించిన నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు లాంటి అతి భారీ ఆకారాలు ఉన్నాయి. అంతరిక్షంలోని పాలపుంతలోని సూర్యమండలంలో భానుడు కేంద్రం గా భూమితో కూడిన నవ గ్రహాలు, చందమామ లాంటి సహజ ఉపగ్రహాలు వున్నాయి. అనేక గ్రహాల్లో భూగ్రహం మాత్రమే జీవ మనుగడకు అనుకూలంగా ఉందని మన నమ్మకం. అంతరిక్షంలో విహరించి గ్రహాలను, ఉపగ్రహాలను శోధించేందుకు, గ్రహ ఉపగ్రహాలలో దాగిన మూలకాలు / రసాయన పదార్థాల విశ్లేషణ, అంతరిక్ష గ్రహ రహస్యాల గుట్టు విప్పేందుకు ఆధునిక అంతరిక్ష ప్రయోగాలు ముమ్మరంగా జరుతూనే ఉన్నాయి.

ఇటీవల భారత ప్రతిష్ఠాత్మక ఇస్రో సంస్థ ప్రయోగించిన చంద్రయాన్-3 విక్రమ్ లాండర్ విజయవంతంగా చందమామ ఉపరితలంపై దిగడం, ప్రజ్ఞా రోవర్ ఉపరితలం మీద పరిశోధిస్తూ కదలడం లాంటి అసాధారణ ఫలితాలు దేశ ప్రజలను విస్మయ పరిచింది. అదే విధంగా ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 మిషన్ విజయవంతంగా దూసుకుపోతూ 9.2 లక్షల కిమీ దాటి గురుత్వాకర్షణ పరిధి దాటి భానుడి గుట్టు విప్పేందుకు ముందుకు సాగుతోంది. అంతరిక్ష అంతు చూడడం, మానవాళి జీవనశైలిలో సకారాత్మక మార్పులు తేవడానికి ప్రపంచ దేశాలు అంతరిక్ష ప్రయోగాలకు అత్యధిక ప్రాధాన్యతలను ఇస్తున్నా యి. ఈ క్రమంలోనే ప్రతి ఏటా అక్టోబర్ 04 నుండి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. 06 డిసెంబర్ 1999న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను సభ్య దేశాలు నిర్వహిస్తున్నాయి.2016లో నాసా ప్రయోగించిన ఓసిరిస్- రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్ బెన్నెటా అనే భారీ గ్రహ శకలం చేరి ఏడేళ్లుగా తర్వాత అక్కడ లభించిన గుళకరాళ్లు, ధూళి కణాల సాంపుల్స్ తీసుకొని వచ్చి ఇటీవలే ఎంపిక చేసిన ప్రాంత నేలను చేరడం ఓ అద్భుత ప్రయోగంగా నిలుస్తున్నది.

అదే కాకుండా గతంలో భూగ్రహాన్ని ఢీ కొట్టే అవకాశం ఉన్న గ్రహ శకలాలను ధ్వంసం లేదా దారి మళ్లించడానికి కూడా అమెరికన్ నాసా సంస్థ చేసిన డార్ట్ (డబుల్ ఆస్టరాయిడ్ రీ డైరెక్షన్ టెస్ట్) ప్రయోగాలు సఫలం కావడం ప్రపంచ మానవాళికి శుభవార్తగా వ్యాపించింది. 24 నవంబర్ 2021న ప్రయోగించిన డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్ 11 మిలియన్ కి.మీ దూరంలో 526 అడుగుల వ్యాస పరిమాణం ఉన్న ‘డైమార్ఫోస్’ గ్రహ శకలాన్ని 26 సెప్టెంబర్ 2022న ఢీ కొట్టడంతో గ్రహ శకలం ముక్కలు కావడం, దారి మళ్లడం జరిగింది. ఇలాంటి అద్భుత అంతరిక్ష ప్రయోగాలతో విశ్వ మానవాళి మనుగడ (శాస్త్ర సాంకేతిక ప్రగతితో) సుగమం అవుతున్నది. డార్ట్ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో భూమిని ఢీ కొట్టే అవకాశం వున్న గ్రహశకలాల దారిని మళ్లించడానికి మార్గం సుగమం అయింది.ఈ ఏడాది ‘ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు -2022’ నినాదంగా అంతరిక్షం, ఔత్సాహికత (స్పేస్ అండ్ ఎంటర్‌ప్రినర్‌షిప్) అనబడే అంశాన్ని తీసుకున్నారు. విశ్వ అంతరిక్ష పరిశ్రమలో దాదాపు 22% వరకు మహిళా శక్తి వినియోగించబడుతున్నది.

అంతరిక్షంలో మహిళలు దూసుకుపోవడానికి ఐరాస ‘స్పేస్ 4 వూమెన్’ అనే నినాదంతో అంతరిక్ష వైజ్ఞానికశాస్త్రం, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఎక్స్‌ప్లోరేషన్ రంగాల్లో పలు ప్రణాళికలు వేస్తున్నారు. 1963లో వాలెంటీనా తెరిస్కోవా అంతరిక్షయానం చేసిన తొలి మహిళగా చరిత్రకు ఎక్కారు. నాటి నుండి నేటి వరకు 65 మంది మహిళలు అంతరిక్ష నౌకలో ప్రయాణించి పరిశోధనలు చేశారు. భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునితా విలియమ్స్, రాకేష్ శర్మ, శిరీష బండ్లలు వ్యోమగాములుగా అంతరిక్షయానం చేశారు.ప్రపంచ అంతరిక్ష చరిత్రలో 04 అక్టోబర్ 1957న ప్రథమ మానవ నిర్మిత భూ ఉపగ్రహం (ఎర్థ్ శాటలైట్), స్పుత్నిక్-1ను అంతరిక్షంలోకి ప్రయోగించగా, 10 అక్టోబర్ 1967న బాహ్య అంతరిక్ష ఒప్పందం (అవుటర్ స్పేస్ ట్రీటి) లో సంతకాలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వారోత్సవాలలో ఐరాస సభ్యదేశాలకు చెందిన విద్యాలయాలు, ప్రభుత్వ వేదికలు, అంతరిక్ష సంస్థలు, ప్రదర్శన శాలలు, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ, సామాన్యులకు అంతరిక్ష పరిశోధనలు, రహస్యాలను వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

సామాన్య ప్రజానీకంలో అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంచడం, అంతరిక్ష శాస్త్రం పట్ల ఆసక్తిని కలిగించడం, అంతరిక్ష పరిశోధనలతో మానవాళి సుస్థిరాభివృద్ధి, అంతరిక్ష శాస్త్రజ్ఞుల సేవలు గుర్తించడం, యువతను వైజ్ఞానిక, సాంకేతిక, ఇంజినీరింగ్, గణిత శాస్త్రాల వైపు దృష్టి మరల్చడం, అంతరిక్ష పరిశోధనలలో ప్రపంచ దేశాలను సమన్వయ పరచడం లాంటి అంశాలను చేపడతారు. గత ఆరు దశాబ్దాలుగా పలు అంతరిక్ష సంస్థలు కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగిస్తూ, పరిశోధిస్తూ, సాంకేతిక ఫలాలను సకల మానవాళి సన్నిధికి చేర్చడంలో అనేక మైలు రాళ్ళు దాటుతూ వస్తున్నది. మన అంతరిక్ష పరిశోధనల ఫలితంగా వాతావరణ హెచ్చరికలు, టివిలో ప్రత్యక్ష ప్రసారాలు, స్మార్ట్ ఫోన్ విప్లవాలు, జిపియస్ టెక్నాలజీ లాంటి అద్భుతాలు సుసాధ్యం అయ్యాయి. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మెుదటిసారి (20 జులై 1969న) చంద్ర మండలంపై అడుగిడి అర్ధ శతాబ్దం దాటింది. సూక్ష్మ, చిన్న, 10 సెంటీమీటర్ల ఘనాకారం ఉపగ్రహాలను చవకగా ప్రయోగించే స్థాయికి చేరాం. రిమోట్ సెన్సింగ్, గురుత్వాకర్షణ, పర్యావరణ పరిజ్ఞానం, అంతరిక్ష శాస్త్రం, గ్రహ వ్యవస్థ, ఆస్ట్రానమీ, మెటీరియల్ సైన్స్, జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్ర రంగాల్లో విప్లవాత్మక అంతరిక్ష పరిశోధనలు జరుగుతున్నాయి. ఐఒటి, ఎంబెడెడ్ వెబ్ టెక్నాలజీ, కెమెరా సెన్సార్స్, జిపియస్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్ లాంటి ఆధునిక విప్లవానికి అంతరిక్ష పరిశోధనలే పునాదులు వేశాయి.

అంతరిక్షంలో భారతం
ఇండియా అంతరిక్ష చరిత్రలో 1969లో తొలి అడుగుగా స్వయం ప్రతిపత్తి గల భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రోను నెలకొల్పడం జరిగింది. ప్రతిష్ఠాత్మక ఇస్రో నేతృత్వంలో ఉపగ్రహాల రూపకల్పన, అభివృద్ధి, అసెంబ్లింగ్, ప్రయోగించడం జరుగుతోంది. అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగ వాహనాలను తయారు చేయడం, శ్రీహరికోట ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి అంతరిక్ష కక్ష్యలోకి చేర్చడం తేలికైంది. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో, అంతరిక్ష అనువర్తన కేంద్రం అహద్మాబాద్, విక్రం సారాబాయ్ అంతరిక్ష కేంద్రం తిరువనంతపురం, సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ హసన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు ఇస్రో సొంతం కావడం మనందరికీ గర్వకారణం. 1975లో రష్యా నుండి ఇస్రో ప్రయోగించిన మెుదటి భారత ఉపగ్రహం ఆర్యభట్టా, 1980 భారత్ స్వతంత్రంగా ప్రయోగించిన రోహిణి, ఇన్సాట్, జీ సాట్, పియస్‌యల్‌వి, జియస్‌యల్‌వి, చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్1 వరకు అనేక మైలు రాళ్ళు విజయవంతంగా దాటుతూ వస్తోంది. అనంత అంతరిక్షంలో దాగి ఉన్న విశ్వాంతరాళ రహస్యాలను బయటకు తీసి, ప్రపంచ మానవాళి సుఖ జీవనయానాలకు, సౌభాగ్యాలకు పూలబాటలు వేయాలనే అంతరిక్ష సంస్థల ఆశలు సఫలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News