Monday, January 20, 2025

గ్రహాంతరాలపై సశాస్త్రీయ అధ్యయనం అవసరం

- Advertisement -
- Advertisement -

కెప్ కెనవెరాల్ : ఆకాశంలో కన్పించే గుర్తు తెలియని ఎగిరే వస్తువులు (యుఎఫ్‌ఒ)లను మరింత సశాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ( నాసా) స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న పలు సాంకేతిక పరిజ్ఞానాలను వాడుకోవల్సి ఉంటుంది. హైటెక్ శాటిలైట్లను కూడా రంగంలోకి దింపాల్సి ఉంటుంది. ఆకాశంలో యుఎఫ్‌ఒలు కన్పిస్తున్నాయనే వాదనలను కేవలం మూఢనమ్మకాలుగా కొట్టి పారేయరాదు. ఇంతవరకూ యుఎఫ్‌ఒల పట్ల కొనసాగుతూ వస్తున్న తేలిక పాటి భావనను వదిలిపెట్టాల్సి ఉంది. కొట్టిపారేసే పద్దతి కాకుండా వీటి రహస్యాలను పసికట్టే సైంటిఫిక్ పద్దతులు అత్యవసరం అని నాసా తన 33 పేజీల నివేదికలో తెలిపింది. యుఎఫ్‌లపై ఏడాదిగా జరిపిన అధ్యయనాల క్రమంలో ఈ నివేదికను వెలువరించారు. ఆకాశంలో ఎగిరే వింత వస్తువుల గురించి ప్రతికూల భావన ఇవన్నీ గాలి కట్టుకథలు అనే ధోరణి తగదని నాసా హెచ్చరించింది. యుఎఫ్‌ఒల పట్ల నెగెటివిటి తలెత్తితే అది తగు సమాచారం సేకరించడానికి అడ్డంకి అవుతుంది.

ఏదైనా వింత విషయాన్ని తేలిగ్గా తీసిపారేస్తే సంబంధిత విషయంపై నిజాలు తెలుసుకోవడం కష్టం అవుతుందని నాసా నిర్వాహక అధికారి బిల్ నెల్సన్ చెప్పారు. గ్రహాంతర వాసులు లేదా యుఎపిలు లేదా గుర్తు తెలియని జీవుల పరిణామం గురించి ప్రచారం జరిగితే దీనిని శాస్త్రీయ దృక్పథంతో చూడటం అలవర్చుకోవల్సి ఉంటుందని నెల్సన్ తెలిపారు. మెక్సికో పార్లమెంట్‌లో ఇటీవల కొన్ని గ్రహాంతర జీవులు సభల దశలో కన్పించాయని , వీటికి మూడు వేళ్లు, భారీ ముఖాకృతి ఉందని, అక్కడి జర్నలిస్టులు కొన్ని ఫోటోలతో వార్తలు వెలువరించిన విషయంపై నాసా స్పందించింది. దీనిని నమ్మడం నమ్మకపోవడం అనేది పక్కన పెడితే దీనిపై సైంటిఫిక్‌గా పరిశీలన జరిపితే అది సైన్స్ దిశలో ఉపయుక్త అంశం అవుతుందని బిల్ నెల్సన్ తెలిపారు. దీనిపై పారదర్శకతతో సాగుతామని వివరించారు. అయితే యుఎపిలు లేదా, యుఎఫ్‌ఒలు గ్రహాంతర వాసులే అని చెప్పడానికి ఎటువంటి సాక్షం లేదని నాసా అధికారులు తెలిపారు.

ఏమో ఇక్కడి మనిషి కాకుండా వేరే చోట వేరే జీవి మనిషి వంటి వారు ఉండి ఉంటారు లేదా లేకపోవచ్చు అని పేర్కొన్నారు. అంతరిక్షంలో బిలియన్ల కొద్ది గెలాక్సీలలో బిలియన్ల స్థాయిలో నక్షత్రాలు ఉండి ఉంటాయి. వీటిలో మరో భూమి ఉండే ఉంటుందని నాసా నిర్వాహకులు నెల్సన్ చెప్పారు. గ్రహాంతర అంతరిక్ష నౌకలు వచ్చి ఉంటాయా? వచ్చి ఉంటే శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞాన సంపన్నయుత అమెరికా ఇతర దేశాల ప్రభుత్వాలు వీటిని లేదా గ్రహాంతర జీవులు లేదా వస్తువులను దాచి పెట్టి తమ అవసరాలకు వాడుకునే వీలుందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు నెల్సన్ సమాధానమిస్తూ ఇవన్నీ కూడా ఊహాజనిత ప్రశ్నలు, ఇటువంటి ఘటనలు జరిగినట్లు తెలిపే ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. యుఎఫ్‌ఒలు ఇతరత్రా ఖగోళంలో తలెత్తుతున్న గుర్తుతెలియని అరుదైన పరిణామాలు వింతలను అధ్యయనం చేసేందుకు ఖచ్చితంగా కృత్రిమ మేధ (ఎఐ) శక్తిని వాడుకోవల్సి ఉందని నాసాకు చెందిన 16 మంది సభ్యుల ప్యానెల్ తెలిపింది.

ఎఐ, మెషిన్ లర్నింగ్‌లు కీలకం అవుతాయని వివరించారు. యుఎఫ్‌ఒల పరిశోధనలపై ఈ మధ్యకాలంలో నాసా మరింత ఆసక్తి పెంచింది. ఇందుకు జరిపే పరిశోధనల సారధ్యానికి ఓ డైరెక్టరును ఏర్పాటు చేశారు. అయితే పలు కారణాలతో తమ టీం, టీం డైరెక్టర్ పేర్లను ఉనికిని వెల్లడించడం లేదని నాసా వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News