ఏదైనా విషయాన్ని హేతుబద్ధంగా ఆలోచించే విధంగా, మంచి చెడులను గురించి, విలువలను గురించి తెలియ చేసి సత్ప్రవర్తనతో నడుచుకునే విధంగా తద్వారా ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకునే విధంగా మనిషిని తయారు చేయడంలో మానవీయ శాస్త్రాలలో ఒకటైన తత్వశాస్త్రం (ఫిలాసఫీ) పాత్ర చాలా విశిష్టమైనది. క్లుప్తంగా చెప్పాలంటే లోపలి మనిషిని నిశితంగా గమనించే విధం గా, ప్రకృతి అసలు తత్వాన్ని గ్రహించే విధంగా, తనకు ఈ ప్రకృతికి గల విశిష్టమైన సంబంధాన్ని తెలియ చేసే విధంగా ఈ తత్వశాస్త్రం ఘనమైన పాత్రను నిర్వహిస్తుంది. ఈ శాస్త్రం పైన ప్రజలు ఒక భావనను ఏర్పరచుకున్నారు. అదేమిటంటే ఈ శాస్త్రం ఆత్మల గురించి, దయ్యాల గురించి, ఇంకా ఎన్నో అనవసరమైన అంశాలను గురించి చర్చించి విద్యార్థులను ప్రక్కదోవ పట్టించి సమాజానికి హాని చేసే విధంగా వ్యక్తులను తయారు చేస్తుందని, ఇలాంటి భావన ఒక తప్పుడు భావన అని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది.
నిత్యం మనం న్యూస్ ఛానెల్స్‌లో, న్యూస్ పేపర్లలో ఇక్కడ హత్య జరిగిందని, అక్కడ అఘాయిత్యం జరిగినదని, పైచదువులు చదువుకున్న విద్యార్థులు హైటెక్ దొంగతనాలకు పాల్పడ్డారని, పాఠా లు చెప్పే పంతుళ్ళు మోసాలకు, అవినీతికి పాల్పడ్డారని ఇంకా ఎన్నెనో ఘోరమైన వార్తలను చూస్తుంటాం, చదువుతుంటాం. వీటికి మూల కారణాలు ఏమై ఉండవచ్చు అనే ప్రశ్న మనలను ఎన్నో సార్లు, ఎన్నో రకాలుగా తడుతూనే ఉంటుంది. నేరం జరిగిన ప్రత్యేక సందర్భాలను ప్రత్యేక కోణంలో విశ్లేషించి వాటికి సంబంధించిన కారణాలను మాత్రమే మనం తెలుసుకోవడం సహజంగా జరుగుతుంటుంది. కానీ మూలకారణం వెతికితే అసలు విషయం మనకు అర్థమవుతుంది. టెక్నాలజీపరంగా అత్యంత వేగంగా వెళుతున్న ఈ ప్రపంచంలో మనిషి తానూ ఒక సంఘజీవినని, ఈ సమాజంలో తన చుట్టూ ఎంతో మంది ఉన్నారని, తన మనుగడ వారి మనుగడతో ముడిపడి ఉందని, వారిలో కలిగే అశాంతి తన అశాంతికి దారి తీస్తుందనే విషయ పరిజ్ఞానాన్ని రోజురోజుకు కోల్పోతున్నాడు.
క్లుప్తంగా చెప్పాలంటే తన మానసిక స్థితి సమాజ మానసిక స్థితితో అనుసంధానమైయున్నదన్న విషయ జ్ఞానం సన్నగిల్లిపోతుంది. ఈనాటి తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థలు పిల్లలకు ఒక రిజిడ్ గ్రేడ్ ఆధారిత విద్యా విషయాలను అందులోనూ టెక్నాలజీ, సైన్స్ ఆధారిత అంశాలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు అంశాల ప్రాధాన్యత నేటి పరిస్థితులకు అత్యంత అవసరం కూడాను. అయితే అందరూ గమనించవలసిన విషయం ఏమిటంటే నైతిక విలువలు, మనోవైజ్ఞానిక స్పృహ, సామాజిక స్పృహ, పర్యావరణ స్పృహ అనే అంశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ఒకవేళ ఈ అంశాలను విద్యలో భాగం చేసినప్పటికీ వాటిని విద్యార్థుల మనోఫలకంపై స్థిరపరచి ఆయా అంశాలను నిజ జీవితంలో అప్లై చేసుకునే విధంగా చేయడంలో నిర్లక్ష్యం వహించడం ఒక గర్హనీయ విషయం. సైన్స్ సంబంధిత అంశాలను, టెక్నాలజీ సంబంధిత అంశాలను నేర్చుకుంటే ఒక వ్యక్తి పరిపూర్ణుడవడు.
ఆ నేర్చుకున్న జ్ఞానంతో ఆ వ్యక్తి ఎలాంటి దారుణాలకైనా ఒడికట్టవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత జ్ఞానంతో పాటు విలువలు, సామాజిక స్పృహ, మనో వైజ్ఞానిక స్పృహ వంటి అంశాలు కూడా కరిక్యులంలో భాగం చేస్తే ఆయా సబ్జెక్ట్ వ్యక్తిని ఒక సరైన దారిలో నడుపుతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హోమీ జె. బాబా, విశ్వేశ్వరయ్య, అబ్దుల్ కలాం వంటి ఎంతో మంది మహానీయులను మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వారికి సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు మానవీయ, సామాజిక అంశాలపట్ల మంచి అవగాహన ఉండడంవల్లనే వారు గొప్పవారిగా చరిత్రలో నిలిచిపోయారు. మానవీయ, సామాజిక శాస్త్రాల అవసరం నేటి సమాజంలో ఎంతగానో ఉంది అని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు మనకు ఉపయోగపడుతాయి.
ఏదైనా విషయాన్ని హేతుబద్ధంగా ఆలోచించే విధంగా, మంచి చెడులను గురించి, విలువలను గురించి తెలియ చేసి సత్ప్రవర్తనతో నడుచుకునే విధంగా తద్వారా ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకునే విధంగా మనిషిని తయారు చేయడంలో మానవీయ శాస్త్రాలలో ఒకటైన తత్వశాస్త్రం (ఫిలాసఫీ) పాత్ర చాలా విశిష్టమైనది. క్లుప్తంగా చెప్పాలంటే లోపలి మనిషిని నిశితంగా గమనించే విధంగా, ప్రకృతి అసలు తత్వాన్ని గ్రహించే విధంగా, తనకు ఈ ప్రకృతికి గల విశిష్టమైన సంబంధాన్ని తెలియ చేసే విధంగా ఈ తత్వశాస్త్రం ఘనమైన పాత్రను నిర్వహిస్తుంది. ఈ శాస్త్రం పైన ప్రజలు ఒక భావనను ఏర్పరచుకున్నారు. అదేమిటంటే ఈ శాస్త్రం ఆత్మల గురించి, దయ్యాల గురించి, ఇంకా ఎన్నో అనవసరమైన అంశాలను గురించి చర్చించి విద్యార్థులను ప్రక్కదోవ పట్టించి సమాజానికి హాని చేసే విధంగా వ్యక్తులను తయారు చేస్తుందని, ఇలాంటి భావన ఒక తప్పుడు భావన అని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది.
సమాజంలో పాతుకుపోయిన ఎన్నో హానికారకమైన అంశాల నుంచి మనిషిని బయట పడవేసి మనిషిని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో దీని పాత్ర అనిర్వచనీయం. డేవిడ్ హ్యూమ్ అనే తత్వవేత్త అంటాడు ఫిలాసఫీ అనేది రోగాలను నయం చేసే ఒక చక్కని మందు బిళ్ళ వంటిదని. ఇంతటి విశిష్టమైన సబ్జెక్టును తెలుగు రాష్ట్రాలలో నిరాదరణకు గురి చేయడమనేది ఒక జీర్ణించుకోలేని అంశం. కనీసం డిగ్రీ స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఈ సబ్జెక్టును ఎస్టాబ్లిష్ చేయవలసిన అవసరం ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలలో అక్కడక్కడా ఈ సబ్జెక్టు ఉన్నప్పటికీ దాని విశిష్టతను, దాని ఆవశ్యకతను కాపాడడంలో అక్కడ పని చేసే అధ్యాపక బృందాలు సఫలం కాలేదని నొక్కి చెప్పవచ్చు. కారణాలు ఏమైనా అయ్యి ఉండవచ్చును గాక.
వీటిని తిరిగి పటిష్టం చేయవలసిన అవసరం ఉంది.డిగ్రీ స్థాయి నుండి ఆ పై స్థాయిల వరకు ఈ సబ్జెక్టును నిబద్ధతతో బోధించినట్లయితే విద్యార్థి తనపై బలవంతంగా రుద్దబడిన తుప్పు పట్టిన ఆలోచనల నుండి బయటపడి తన కెరీయర్‌ను విశిష్ట రీతి లో మలుచుకుంటాడు. తన అస్తిత్వాన్ని పునర్నిర్మించుకుంటాడు. విదేశాలలో ఈ సబ్జెక్టు పాఠశాల స్థాయి నుండి ఉండడం మనం గమనించవచ్చు. ఇప్పుడిప్పుడే, మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్, ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఈ సబ్జెక్టును విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నాయి. సంతోషించదగిన విషయం. ప్రతీ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో, ఇంజినీరింగ్, వైద్య విద్య వంటి విభాగాలలో దీని అవసరం చాలానే ఉందని చెప్పవచ్చు.
కొన్ని విద్యలు పొట్టకూటి కోసం నేర్చుకుంటే కొన్ని విద్యలు సమాజంలో వినూత్నంగా, నీతివంతంగా బతకడం కోసం నేర్చుకోవాలి. మొదటిది ఎంత అవసరమో రెండోది కూడా అంతే అవసరం అని మరిచిపోకూడదు. పురాణాలలోని ధర్మవ్యాధుని కథను మనం గుర్తు చేసుకోవాలి. ధర్మవ్యాధుడు బతకడం కోసం మాంసం అమ్మే వృత్తిని చేపట్టినప్పటికీ, వేదశాస్త్రాల సారాన్ని అవపోసన పట్టినవాడు. నిజాయితీతో తన వృత్తి ధర్మాన్ని పాటించినవాడు. బతకడానికి మనసుకు నచ్చిన వృత్తి విద్య నేర్చుకోవడం చాలా అవసరం. అదే విధంగా నేర్చుకున్న విద్యను నీతివంతంగా తన జీవితంలో అప్లై చేసుకోవడం కూడా అంతే అవసరం. ఈ రోజున అలా లేకపోవడం వల్లనే మన చుట్టూ కల్తీ ప్రపంచం, అవినీతి ప్రపంచం, మోసపూరిత ప్రపంచం ఏర్పాటవుతున్నది. వీటన్నింటినీ అధిగమించాలంటే తత్వశాస్త్రం లాంటి సబ్జెక్టు ఆవశ్యకత చాలా ఉంది అని సుస్పష్టంగా చెప్పవచ్చు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మధ్య కళాశాల స్థాయిలో హ్యూమన్ వాల్యూస్ (తత్వశాస్త్రంలో ఒక భాగం) అనే సబ్జెక్టును కరీక్యులంలో చేర్చారు. కానీ వాటిని తూ తూ మంత్రంగా బోధించేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆయా కళాశాలల్లో పని చేసే అధ్యాపకులు నిజానికి వారు ఆ సబ్జెక్టును బోధించే అర్హత కలిగిన వారు కారు. వేరే సబ్జెక్టు అధ్యాపకులచే ఈ పని చేయించడం వలన ఇలాంటి ప్రాముఖ్యమైన సబ్జెక్టులకు విలువ తగ్గిపోతున్నది అనేది వాస్తవం. విషయ పరిజ్ఞానం లేని వాడు విషయాన్నీ చాలా చప్పగా బోధించి విద్యార్థులు ఆసక్తిని కోల్పోయే విధంగా చేయడంలో పాత్ర వహిస్తారు. లేదా విద్యార్థులే ఈ సబ్జెక్టును చదువుకోగలరని బోధించకుండా ఉండడం కూడా విద్యార్థులలో ఆసక్తి తగ్గిపోవడానికి కారణం అవుతుంది. ఇది తిరోగమనానికి దారి తీస్తుంది తప్పితే మరొకటి కాదు. ఈ విషయం అందరూ గమనించవలసిన అవసరం ఉంది.
తత్వశాస్త్రంలో వివిధ అంశాలను క్షుణ్ణంగా చదివినవాడికి, సబ్జెక్టులోని టెక్నికల్ పదాల అర్థాలు తెలియని వాడికి విషయ పరిజ్ఞానంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అది గమనించి విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పు లు తీసుకు రావలసిన అవసరం ఉంది.ఒక చిన్న ఉదాహరణతో ఈ సబ్జెక్టు ఆవశ్యకతను మనం అర్థం చేసుకోవచ్చు. తాత్విక చింతన లేని, నైతిక విలువలు పాటించని వ్యక్తి ఏదైనా ఒక శాఖకు అధికారి అయితే ఆ శాఖలో అభివృద్ధి కుంటుపడి తీవ్రమైన అవినీతికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా, నైతిక విలువలు కలిగిన సమాజం అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి అధికారి అయితే ఆ శాఖ గాని, అందులో పని చేసే సభ్యులుగాని, ఆ సంస్థ గాని, ఆ దేశం గాని మునుపెన్నడూ చూడని గొప్ప అభివృద్ధిని చూస్తాయి. అందుకేనేమో ప్రాచీన గ్రీకు తత్వవేత్త ప్లేటో తాత్విక చింతన కలిగిన వారు పరిపాలించాలి అన్నాడు.
మన భారతీయ దర్శనాలన్నీ కూడా సత్యశోధనను గురించే అన్వేషణను సాగించమని మనిషిని కోరుతాయి. ఎందుకంటే సత్యశోధన చేసేవాడు అందరి మంచినీ కాంక్షిస్తాడు. తత్త్వ శాస్త్రంతో పాటె మరికొన్ని అత్యావశ్యకమైన సబ్జెక్టులను (జాగ్రఫీ, సోషియాలజీ, సైకాలజీ వంటివి) కనీసం డిగ్రీ స్థాయి నుండి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా వ్యవస్థలలో ప్రవేశపెట్టి సైన్స్, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ అనే భేదం లేకుండా అందరూ నేర్చుకునే విధంగా చర్యలు చేపట్టాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఈ సబ్జెక్టులను పొట్టకూటి కోసం కాకుండా మనల్ని మనం అర్థం చేసుకునే విధంగా, ఈ ప్రకృతిని అర్థం చేసుకునే విధంగా, ఈ సమాజాన్ని అర్థం చేసుకునే విధంగా తద్వారా శాంతియుత జీవనం గడిపే విధంగా ఉండడం కోసం నేర్చుకోవాలి.
డా. చింతపల్లి ఆంజనేయులు
8096003579