జెనీవా: కరోనా వైరస్ మహమ్మారి మూలాలను శోధించడానికి రెండే ళ్ల క్రితం చైనాకు వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్‌ఓ)కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందానికి సారథ్యం వహించిన శాస్త్రవేత్తను లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలపై బర్తరఫ్ చేసినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన డబ్లుహెచ్‌ఓ ప్రకటించింది. చైనాను సందర్శించిన ఉన్నత స్థాయి సంయుక్త శాస్త్రవేత్తల బృందానికి సారథ్యం వహించిన పీటర్ బెన్ ఎంబారెక్‌ను గత ఏడాది బర్తరఫ్ చేసినట్లు డబ్లుహెచ్‌ఓ తెలిపింది. ఇటీవలి కాలంలో లైంగిక దాడులు, వేధింపులు, బెదిరింపులకు సంబంధించిన సంఘటనలు పెద్దసంఖ్యలో జరిగినట్లు పత్రికలలో వార్తలు వెలువడిన నేపథ్యంలో వీటిని నిరోధించేందుకు చ్యలను మ్మురం చేసినట్లు ఆరోగ్య సంస్థ తెలిపింది.
లౌంగిక దుష్ప్రవర్తనకు సంబంధించి ఆరోపణలు నిజమని దర్యాప్తులో తేలడంతో క్రమశిక్షణా చర్యల కింద శాస్త్రవేత్త పీటర్ బెన్ ఎంబారెక్‌ను బర్తరఫ్ చేసినట్లు డబ్లుహెచ్‌ఓ మహిళా ప్రతినిధి మార్షియా పూలె ఇమెయిల్ ద్వారా వెల్లడించారు. 2015, 2017 మధ్య ఎంబారెక్ లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని, డబ్లుహెచ్‌ఓకు చెందిన దర్యాప్తు బృందం దృష్టికి మొదటిసారి 2018లో ఈఆరోపణలు వచ్చాయని ఆమె తెలిపారు.
బాధితులు దర్యాప్తు బృందంతో నేరుగా కలవకపోవడం వల్ల ఈ ఆరోపణలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపడం సాధ్యం కాలేదని ఆమె పేర్కొన్నారు. డబ్లుహెచ్‌ఓ ఎంపిక చేసిన ఎంబారెక్ సారథ్యంలోని అంతర్జాతీయ బృందం 2021 ప్రారంభంలో చైనాను సందర్శించింది. కరోనా కేసులు మొదటగా నమోదైన వుహాన్‌లోని హువానన్ మార్కెట్‌ను ఈ బృందం సందర్శించింది. కరోనా వైరస్ మనుషులను ఏ విధంగా ప్రభావం చూపించిందో తెలుసుకునేందుకు చైనీస్ శాస్త్రవేత్తలతో కలసి ఈ బృందం పనిచేసింది.