హైదరాబాద్: రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను సమీక్షించేందుకు నందలూరు టు రాజంపేట సెక్షన్‌లో తనిఖీలో నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పాల్గొన్నారు. ఈసెక్షన్‌లో జిఎం శనివారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ ట్రాక్ పునరుద్ధరణ పనులను ఆయన సమీక్షించారు. ఈ సెక్షన్‌లో భారీ వర్షాలతో రైల్వే ట్రాక్ దెబ్బతిందని అధికారులు జిఎంతో పేర్కొన్నారు. పునరుద్ధరణ పనుల ప్రణాళికలపై అధికారులతో జిఎం చర్చించారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని జిఎం అడిగి తెలుసుకున్నారు. రైళ్లను సాధారణ స్థాయిలో నడిపించేందుకు సాధ్యమైనంతగా త్వరగా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
రైళ్ల నిర్వహణలో ప్రామాణిక భద్రతా నిబంధనలను పాటిస్తూ ట్రాక్ పునరుద్ధరణ పనులు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. కనిష్టస్థాయి అంతరాయాలతో రైళ్ల సర్వీసులను నడిపించే అంశంపై అధికారులకు ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ తనిఖీల్లో ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ సంజీవ్ అగర్వాల్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జి.జాన్ ప్రసాద్, ప్రిన్సిపల్ ఎలక్ట్రికల్ ఇంజర్ సోమేష్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ అధికారి ఎమ్.ఆర్.ఎన్.రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్ జి.కె.ద్వివేది, గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ కె.వెంకటరమణా రెడ్డి ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.