Wednesday, January 22, 2025

గోదావరి ఆర్చ్ వంతెనపై గరిష్ట వేగాన్ని పెంచిన దక్షిణ మధ్య రైల్వే

- Advertisement -
- Advertisement -

SCR increased speed over Godavari Arch Bridge

వేగ పరిమితి గంటకు 50 కిలోమీటర్లకు పెంపు
లక్ష్యాన్ని చేరుకోవడానికి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల నిర్వహణ

హైదరాబాద్: రైల్వే ట్రాక్ మరమ్మతులపై దృష్టిని కేంద్రీకరించడం అత్యంత భద్రతతో పాటు పరిమితులకు లోబడి వీలైన చోట్లలో గరిష్ట వేగాన్ని పెంచడం కోసం దక్షిణ మధ్య రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తోంది. తదనుగుణంగా జోన్ మరో ముఖ్యమైన పని చేపట్టింది. గోదావరి – కొవ్వూరు స్టేషన్ల మధ్య గోదావరి ఆర్చ్ వంతెనపై రైళ్ల గరిష్ట వేగాన్ని గంటకు 50 కిలోమీటర్లకు పెంచేందుకు తగు చర్యలు తీసుకున్నారు. 2015 సంవత్సరం నుంచి గోదావరి వంతెనపై గరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లు ఉండేది. ఇటీవల 2022 ఏప్రిల్ నెలలో వేగ పరిమితిని గంటకు 40 కిలోమీటర్లకు పెంచారు. ఆ తరువాత ఇప్పుడు వేగ పరిమితిని గంటకు 50 కిలోమీటర్లకు పెంచి జరిపిన పరీక్షలు విజయవంతం కాగా ప్రస్తుతం విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లను 2.9 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెనపై నడుపుతున్నారు.

గోదావరి నదిపై 2.9 కిలోమీటర్ల పొడవున్న కమాన్
గోదావరి టు- కొవ్వూరు మధ్య దూరం 5 కిలోమీటర్లు కాగా, ఇది గూడూరు -దువ్వాడ సెక్షన్‌లో గ్రాండ్ ట్రంక్ రూట్‌లో (గోల్డెన్ డయాగ్నల్) ఉంది. దేశంలోని దక్షిణాది రాష్ట్రాల నుంచి తూర్పు, ఈశాన్య ప్రాంతానికి ఈ వంతెన వారధి లాంటిది. గోదావరి నదిపై 2.9 కిలోమీటర్ల పొడవున్న కమాన్ వంతెనపైన రైళ్లను గరిష్ట సామర్ధ్యంతో నడుపుతున్నందున ప్రయాణికుల, సరుకుల రవాణాలో ఇది కీలకంగా మారింది. అంతేకాక ఈ సెక్షను పూర్తిగా పటిష్టమయ్యింది. అతి ముఖ్యమైన గోదావరి నదిపై ఈ వంతెన ఉన్న ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకొని 2015 నుంచి 2022 ఏప్రిల్ వరకు గంటకు 30 కిలోమీటర్లకు మించి వెళ్లకూడదన్న పరిమితిని రైల్వే శాఖ విధించింది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లు…
అప్పటి నుంచి ఈ వంతెనపై ప్రయాణించేటప్పుడు గరిష్ట వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేశారు. అయితే ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులు అధునాతన యంత్రాలతో సవాళ్లతో కూడిన పరీక్షలు జరిపడమే కాకుండా కఠినమైన పని పరిస్థితుల్లో స్లీపర్లను మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. తద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గరిష్ట వేగాన్ని గంటకు 40 కిలోమీటర్లకు పెంచారు. ఇప్పుడు వేగానికి సంబంధించిన పరీక్షలు జరిపి ప్రయాణికుల రైళ్లు, గూడ్స్ రైళ్ల వేగాన్ని గంటకు 50 కిలోమీటర్లకు పెంచి రైళ్లను విజయవంతంగా నడుపుతున్నారు.

సిబ్బందిని అభినందించిన జిఎం
జోన్‌కు సంబంధించిన ముఖ్యమైన ఈ పనిని అంకిత భావంతో పూర్తిచేసిన సిబ్బందిని, ప్రత్యేకంగా ఇంజనీరింగ్ బృందాన్ని దక్షిణమధ్య రైల్వే ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. తూర్పు పశ్చిమాలకు వారధిగా ఉన్న ఈ వంతెనపై రైళ్ల రాకపోకల వేగాన్ని పెంచడం వల్ల రద్దీ తగ్గుతుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News