సిటీ ఆటో అండ్ మోటర్ క్యాబ్ డ్రైవర్స్ వెల్ఫేర్ సొసైటీ
మనతెలంగాణ/హైదరాబాద్ : స్క్రాప్ వాహనాల విక్రయాల్లో జరిగిన అక్రమాలపై అవకతవకలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని సిటీ ఆటో అండ్ మోటర్ క్యాబ్ డ్రైవర్స్ వెల్ఫేర్ సొసైటీ డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు మహమూద్ ఆటో స్క్రాప్‌లో ఆర్టీఏ అధికారుల ప్రమేయంపై అధికారులను ప్రశ్నించారు.
ఈస్ట్, వెస్ట్ జోన్‌లకు చెందిన ఆర్టీవోల పరిధిలో 7వేల స్క్రాప్ ఆటోలను రూ.50వేల నుంచి రూ.70వేల వరకు అక్రమంగా విక్రయించారని, స్క్రాప్ డీలర్లతో కుమ్మక్నై కొందరు అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. రవాణా శాఖలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేశామని, ప్రస్తుతం అవి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జాయింట్ కమిషనర్, రవాణా శాఖ మంత్రికి సైతం ఫిర్యాదు చేశామన్నారు. ఈ అవినీతిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆల్ ఇండియా వుమెన్ ఎంపవర్‌మెంట్ పార్టీ అధ్యక్షురాలు సాజిదా సికిందర్, సొసైటీ ఉపాధ్యక్షులు అక్తర్ అహ్మద్, జావిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.