Sunday, December 22, 2024

రెజ్లర్లు, ఢిల్లీ పోలీసుల మధ్య బాహాబాహి!

- Advertisement -
- Advertisement -
మల్లయోధులు(రెజర్లు) ఏప్రిల్ 23 నుంచి జంతర్ మంతర్ బైఠాయింపు నిరసన చేస్తున్నారు.

న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న మల్లయోధులు(రెజ్లర్లు), ఢిల్లీ పోలీసుల మధ్య నేడు ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనకారుల్లో చాలా మందికి తల గాయాలయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంఎల్‌ఎ సోమ్‌నాథ్ భారతీ సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల్లో ఇద్దరు తాగిన మత్తులో ఇద్దరు రెజర్లపై దాడి చేశారని కొందరు రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపించింది.

ఇదిలావుండగా సోమ్‌నాథ్ భారతీ అనుమతి లేకుండానే ఫోల్డింగ్ బెడ్స్ తీసుకుని నిరసన ప్రదేశానికి వచ్చారని న్యూఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ప్రణవ్ తాయల్ తెలిపారు. ఆ బెడ్ల గురించి ప్రశ్నించినప్పుడు ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారని, ట్రక్‌ల నుంచి బెడ్లను తిరిగి పొందే ప్రయత్నం చేశారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా పోలీసులకు, రెజ్లర్లకు మధ్య చిన్న వాగ్వివాదం నడిచిందని, ఈ నేపథ్యంలోనే భారతీని, మరి ఇద్దరిని నిర్బంధించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది.

మాజీ రెజ్లర్ రాజ్‌వీర్ మాట్లాడుతూ ‘ పరుపులు వానకి తడిసిపోయాయి. అందుకనే మేము పడుకునేందుకు ఫోల్డింగ్ బెడ్లు తెచ్చాము. కానీ పోలీసులు అనుమతించలేదు. తాగి ఉన్న పోలీసు ధర్మేంద్ర, వినేశ్ ఫోగట్‌ని దుర్భాషలాడారు. దాంతో వాగ్వివాదం చోటుచేసుకుంది’ అన్నారు. ‘వారు మమ్మల్ని కొట్టడం ప్రారంభించారు. బజరంగ్ పునియా మరిది దుష్యంత్, రాహుల్ తలలకు గాయాలయ్యాయి. పోలీసులు ఆ ప్రదేశానికి డాక్టర్లను కూడా రానివ్వలేదు. పైగా మహిళా కానిస్టేబుళ్లు కూడా దుష్ప్రవర్తనతో వ్యవహరించారు’ అని వివరించారు. పునియా భార్య సంగీత సైతం తనను పోలీసులు తోసేశారని తెలిపింది.

భారతీయ జనతా పార్టీ(బిజెపి) ఉత్తర్‌ప్రదేశ్ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఎఫ్‌ఐ)కి చీఫ్‌గా ఉన్నారు. ఆయన మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణ. ఆ కారణంగానే రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి జంతర్ మంతర్ వద్ద బైఠియించి నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఏడుగురు మహిళా రెజ్లర్లను వేధించిన, బెదిరించిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు సైతం సింగ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News