న్యూఢిల్లీ: భూసేకరణకు సంబంధించిన ఒక కేసులో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్‌కు సమన్లు జారీచేసిన సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్‌తోపాటు ఆయన సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేఇసనట్లు అధికారులు గురువారం తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్‌డిఎం వినీత్ కుమార్‌తోపాటు ఆయన పేషీలో పనిచేసే ఒక ఉద్యగిని సస్పెండ్ చేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్ మనోజ్ కుమార్ తెలిపారు. గత నెలలో గవర్నర్‌కు సమన్లు జారీ కాగా రాజ్యాంగపరంగా గవర్నర్‌కు ఉండే హక్కులను రాజ్‌భవన్ తెలియచేసింది. లోడా బిహారీ గ్రామానికి చెందిన చంద్రహాస్ అనే వ్యక్తి ఒక భూసంబంధిత పిటిషన్‌ను ఎస్‌డిఎం కోర్టులో దాఖలు చేశారు. మరో వ్యక్తితోపాటు గవర్నర్‌ను ప్రతివాదులుగా అతను చేర్చాడు.
తన అత్త కటోరీ దేవికి చెందిన ఆస్తిని ఒక వ్యక్తి అక్రమంగా తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణ కింద అప్పగించాడని, ఇందుకు రూ.12 లక్షల నష్టపరిహారాన్ని పొందాడని చంద్రహాస్ తన పిటిషన్‌లో ఆరోపించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎస్‌డిఎం కుమార్ భూమిని అమ్మిన వ్యక్తితోపాటు రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌కు అక్టోబర్ 7న సమన్లు జారీచేశారు. అక్టోబర్ 18న కోర్టులో మీరు కాని, మీ ప్రతినిధి కాని హాజరుకావాలని ఆయన గవర్నర్‌ను ఆదేశించారు.
అక్టోబర్ 10వ తేదీన గవర్నర్ కార్యాలయం సమన్లు అందుకోగా వెంటనే గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి బద్రీనాథ్ సింగ్ డిఎంకు లేఖ రాస్తూ రాజ్యాంగపరంగా గవర్నర్‌కు సంక్రమించే అధికారాలను, హక్కులను ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని కూడా ఆయన డిఎంను ఆదేశించారు.