ప్రత్యేక టీముల ఏర్పాటు
సంఘటన ప్రాంతంలో సిసి కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తు ఇబ్బంది
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి
మనతెలంగాణ, హైదరాబాద్ : ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలికను అటవీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లి లైంగిక దాడి చేసిన నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాలిక ఈ నెల 4వ తేదీన ఇంటి ఎదుట ఆడుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక కన్పించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలిక(6) కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. స్థానికంగా ఉంటున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. సోమవారం ఉదయం నిందితుడు తీసుకుని వచ్చి వదిలేసిపోయాడు. బాలిక ఒంటిపై తీవ్ర గాయాలు ఉండడంతో అత్యాచారం జరిగిందని నిర్ధారించుకుని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో వైద్యులు బాలికకు మూడు ఆపరేషన్లు చేశారు. అప్పటి నుంచి నిందితుడి కోసం వెతుకుతున్నా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ఎలాంటి ఆనవాళ్లు కూడా పోలీసులకు దొరకలేదు. బాలిక ఉంటున్న ఇంటి సమీపంలో అటవీ ప్రాంతం ఉండడంతో ఎక్కడా సిసి కెమెరాలు లేవు. ఇది పోలీసుల దర్యాప్తుకు ఇబ్బందిగా మారింది. ఎలాంటి క్లూ కూడా పోలీసులకు అభించలేదు. అదే రోజు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించినా లాభం లేకుండా పోయింది. మరోవైపు బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని ఇప్పటి వరకు పట్టుకోకపోవడంపై రాజకీయ పార్టీ నాయకులు పలు విమర్శలు చేస్తున్నారు. వెంటనే నిందితుడిని పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
స్పెషల్ టీం…
బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి ఆచూకీ లభించకపోవడంతో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ స్పష్టం చేశారు.