హైదరాబాద్ : నల్లమల్ల అడవుల్లో ఆపరేషన్ మదర్ టైగర్ విఫలమైంది. రాత్రంతా తల్లి పులి కోసం అటవీ సిబ్బంది ఎదురు చూశారు. మదర్ టైగర్ రాకపోవడంతో నాలుగు పులి పిల్లలను ఆత్మకూర్ అటవీ శాఖ సిబ్బంది తరలించారు. తల్లి పులి కోసం సెర్చింగ్ కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురంలో నాలుగు పులి పిల్లలు కనిపించడంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన సంగతి విధితమే. పెద్ద గుమ్మాడాపురానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఆ ఏరియాలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించి, నిర్ధారించారు. పెద్ద గుమ్మాడాపురానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని ముసలిమడుగు గ్రామ సమీపంలో సంగమేశ్వరం వెళ్లే తారు రహదారిపైకి పులి వస్తుండగా చూసినట్లు ఓ గొర్రెల కాపరి, పండ్ల వ్యాపారి తెలిపారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పులి అడుగు జాడల ద్వారా దాన్ని గుర్తించేందుకు యత్నిస్తున్నారు. ఆత్మకూర్‌లోని అటవీశాఖ సంరక్షణలో నాలుగు పులి పిల్లలకు పాలు సెరెలాక్, చికెన్, లివర్ ముక్కలను అందిస్తున్నారు.