కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: జనాభా ప్రాతిపాదికన బిసిలకు సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బిసిలకు న్యాయం చేస్తామని ఏఐసి అగ్రనేత రాహుల్ గాంధీ, ఖర్గే మాట ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో బిసిలు 54 శాతం ఉన్నారని, ఆ ప్రాతిపాదికన టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో షాద్ నగర్‌లో బిసి గర్జన సభ పెట్టబోతున్నామన్నారు. ఈ సభలకు సెప్టెంబర్ 6, 9 తేదీలను పరిశీలిస్తున్నామన్నారు.
ఇప్పటికే పది జిల్లాల్లో బిసి మీటింగ్‌లను జరిపామన్నారు. ఈ సభ వల్ల కాంగ్రెస్‌కు లాభం చేకూరుతుందన్నారు. కర్ణాటక సిఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా రాబోతున్నారన్నారు. మూడు లక్షల మందితో సభ నిర్వహిస్తామన్నారు. రేవంత్ రెడ్డికి సెక్యూరిటీని తొలగించాల్సిన అవసరం ఏముందని? ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. రేవంత్ జనాల మధ్య తిరిగే వ్యక్తి అని, అతనికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.