జమ్ము: 3888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ గుహ క్షేత్రానికి జమ్ము లోని భగవతి నగర్ స్థావరం నుంచి 4400 మంది యాత్రికులతో రెండో బృందం శనివారం బయలుదేరింది. వీరు మొత్తం 188 వాహనాలతో బయలుదేరారు. దీంతో జమ్ము స్థావరం నుంచి బయలుదేరిన యాత్రికుల సంఖ్య 7904 కు చేరింది. శనివారం తెల్లవారు జామున4.50 గంటలకు 94 వాహనాల ద్వారా పహల్‌గామ్‌కు బయలుదేరగా, అంతకన్నా గంట ముందు బల్తాల్ స్థావరం నుంచి 92 వాహనాల ద్వారా 1683 మంది యాత్రికులు బయలు దేరారని అధికారులు తెలిపారు.
62 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘయాత్రలో శనివారం కశ్మీర్ లోని రెండు మార్గాల ద్వారా ప్రారంభమైంది. ఇందులో ఒకటి అనంత్‌నాగ్ జిల్లా నున్వాన్ పహల్‌గామ్ రూట్‌లో ప్రారంభం కాగా, రెండోది గండెర్బల్ జిల్లాలో తక్కువ సమయంలో చేరుకునే నిటారుగా ఉండే 14 కిమీ పొడవు బల్తాల్ రూట్. భగవతి నగర్ స్థావర శిబిరం పరిధిలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంతవరకు 3.5 లక్షల మంది ఈ యాత్రకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.