Saturday, November 23, 2024

సరిహద్దులలో చైనా రెండో కబ్జా గ్రామం

- Advertisement -
- Advertisement -
Second China-Constructed Enclave In Arunachal Pradesh
హిమాలయం, బ్రహ్మపుత్ర వెంబడి దూకుడు

న్యూఢిల్లీ: చైనా వారి అరుణాచల్ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. భారత్ చైనాల మధ్య వివాదాస్పదమైన అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా సైనిక వర్గాలు మరో గ్రామాన్ని నిర్మించాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో వెలిసిన రెండో చైనా గ్రామం ఇది. కనీసం 60 భవనాలతో కూడిన ఓ నివాసిత సముదాయాన్ని ఇక్కడ నెలకొల్పారు. ఇప్పటికే ఇక్కడ వెలిసిన తొలి చైనా గ్రామం వ్యవహారంపై భారతదేశం తీవ్రంగానే స్పందించింది. కానీ ఈ క్రమంలోనే ఇక్కడ రెండో చైనా గ్రామం వెలిసినట్లుగా నిర్థారణ కావడం, ఓ ప్రముఖ న్యూస్‌ఛానల్ సంబంధిత ఉపగ్రహ ఛాయాచిత్రాలను పొందుపర్చింది. ఇక్కడ ఇప్పుడు వెలిసిన సముదాయం 2019లో ఉనికిలో లేదు. ఇంతకు ముందు అరుణాచల్‌ప్రదేశ్‌లోనే చైనా నిర్మించిన గ్రామానికి ఇప్పుడు వెలిసిన క్లస్టర్ 93 కిలోమీటర్ల దూరంలో ఉంది. జనవరిలో చైనా తొలి గ్రామం ఉనికి వెలుగులోకి వచ్చింది. దీనిని తరువాత అమెరికా భద్రతా సంస్థ కూడా నిర్థారించింది. సరిహద్దు ప్రాంతాలలో చైనా అక్రమ నిర్మాణాలు గత కొన్ని సంవత్సరాల నుంచి సాగిస్తోందని, దశాబ్దాలుగా ఆక్రమించుకుని పెట్టుకున్న ప్రాంతాలలో ఫక్కా నిర్మాణాలు చేపట్టిందని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ నిరసన వ్యక్తం చేసింది. అక్రమంగా నిర్మాణాలు చేపట్టడమే కాకుండా పైగా సమర్థనలకు కూడా దిగుతోందని , ఇటువంటి వైఖరిని ఆమోదించేది లేదని తెలిపారు.

రెండో గ్రామం 6 కిలోమీటర్ల లోపల

ఇప్పుడు వెలిసిన చైనా రెండో గ్రామం భారతదేశపు భూభాగం పరిధిలో ఆరు కిలోమీటర్ల లోపల ఉంది. ఇది వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి), అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఏర్పాటు అయింది. ఈ ప్రాంతం తమదేనని చైనా పలు దశలు వాదిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇక్కడ నిర్మాణాలకు దిగింది. ఇక్కడ వెలిసిన చైనా సముదాయం పూర్తిగా అక్రమం అని ఇది చైనా ఆక్రమించుకున్న ప్రాంతం అవుతుందని, దీనికి చెల్లుబాటు లేదని ఈ అంశంపై భారత సైన్యం అధికారికంగా స్పందించింది. చైనా నిర్మించుకున్న గ్రామం పూర్తిగా భారతదేశపు భూభాగంలోనే ఉందని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా విశ్లేషించిన డిజిటల్ మ్యాప్ క్రమంలో స్పష్టం అయింది. ఈ ఆక్రమిత ప్రాంతం అత్యంత కీలకమైన భౌగోళిక వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. బ్రహ్మపుత్ర నదిని ఆనుకుని ఉందని శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీ నిపుణులు అయిన అనూప్‌దాస్‌గుప్తా స్పష్టం చేశారు.

ఈ మ్యాపింగ్‌లలో ఆయనకు దశాబ్దాల అనుభవం ఉంది. ఇక ఈ చైనా సముదాయ గ్రామం ఫోటోను చైనా అధికారిక వార్తాసంస్థ జిన్హూవా ఈ ఏడాది జులైలోనే వెలువరించింది. పైగా ఈ ప్రాంతం సందర్శనకు చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ వచ్చినప్పుడే వినియోగించే అధునాతన విమానాశ్రయానికి కేవలం 33 కిలోమీటర్ల దూరంలోనే ఈ కొత్త బస ఉంది.హిమాలయ శ్రేణువుల ప్రాంతాలను చైనా క్రమేపీ కబళిస్తూ వస్తోంది. ఈ ప్రాంతంలోని వారు ఇప్పటివరకూ చైనా భాష మాట్లాడలేని వారే. అయితే చైనా ఇక్కడి గ్రామానికి చీనీ భాషలో పేరు పెట్టింది. ఇక్కడ నిర్మించుకున్న పలు భవనాలపై చైనా జెండా బొమ్మతో కూడిన ఓ ప్రత్యేక నిర్మాణం ఉంది. ఈ విధంగా ఇక్కడ తమ ప్రాదేశిక హక్కును చాటుకుంటూ చైనా భారత్‌తో కాలుదువ్వుతున్న వైనం స్పష్టం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News