Sunday, December 22, 2024

వైద్యానికి మేలు ‘సెకండ్ ఒపీనియన్’

- Advertisement -
- Advertisement -

అది ప్రాణాంతక వ్యాధి అని డాక్టర్ నిర్ధారించినపుడు, దాని నివారణకు దీర్ఘకాల చికిత్స, సర్జరీయే శరణ్యమని రిపోర్టులు చెబుతున్నపుడు ఎవరైనా బెంబేలుపడిపోతారు.ఆ అగమ్య పరిస్థితిలో ఎవరికైనా అందరూ సూచించేది ఒకటే ‘మరో డాక్టర్ వద్దకు వెళ్లి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి’ అని. అదే చివరి ఆశ మరి. ఒక వైద్యుడి రోగ నిర్ధారణపై చికిత్సకు వెళ్లే ముందు మరో వైద్యుడిని సంప్రదించి ‘ఇది నిజమేనా’ అని తెలుసుకోవడం ఎంతో ముఖ్యమైనది. ఆ తర్వాతే చివరి నిర్ణయం తీసుకోవాలి. సెకండ్ ఒపీనియన్ వల్ల చాలా విషయాలపై స్పష్టత వస్తుంది. ఒక్కోసారి రోగ నిర్ధారణలో అనుకోని లోటుపాట్లు జరగవచ్చు. ఎవరిని తప్పుపట్టకున్నా మొదటి డాక్టర్ చెప్పిన ఇబ్బందులు తప్పే అవకాశం కూడా ఉంది. సర్జరీకి బదులు మందులతో చికిత్స సరిపోవచ్చు. సర్జరీ విధానం మారవచ్చు.

చికిత్సా విధానంలో వచ్చిన ఆధునిక పద్ధతులను తెలుసుకోవచ్చు.డబ్బులకు కటకట ఉన్నవారు తక్కువలో మంచి వైద్యం అందించే సంస్థల గురించి తెలుసుకోవచ్చు.ఏ ఇద్దరి వైద్యుల ట్రీట్‌మెంట్ ఒక్కలా ఉండదు. విషయ పరిజ్ఞానంలోనూ తేడాలుంటాయి. కాబట్టి సెకండ్ ఒపీనియన్ వల్ల ఉపశమనం పొందినవారు కూడా ఉంటారు. అయితే సెకండ్ ఒపీనియన్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది అసలు సమస్య. గ్రామాల్లో ఉన్నవారు పట్టణ డాక్టర్ వద్దకు వస్తారు. పట్టణవాసులు నగరానికి వచ్చి తేల్చుకుంటారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానాలున్నాయి. వాటిలో అన్ని రకాల స్పెషలిస్టులు ఉన్నారు. వారే రోగ నిర్ధారణ చేశాక సెకండ్ ఒపీనియన్ కోసం ఎవరిని సంప్రదించాలి అనేది నగరవాసులకు అర్థం కాని విషయమే. అయితే ఈ సేవల కోసం అమెరికా లాంటి దేశాల్లోని వైద్య సంస్థలు ముందుకు వస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఆన్‌లైన్ ద్వారా రిపోర్టులు పంపించి డాక్టర్లను ఫోన్లో సంప్రదించి సెకండ్ ఒపీనియన్ పొందవచ్చు. క్యాన్సర్, హృద్రోగం, అవయవాల మార్పిడి లాంటి తీవ్రత గల వైద్య చికిత్సలకు ఆధునిక విధానాల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం.

సెకండ్ ఒపీనియన్ ఇవ్వడమే కాకుండా ఇండియాలో చికిత్స చేయించుకునే వారికి వైద్యపరంగా సాయపడుతున్నారు.దూరం నుంచే వీడియో ద్వారా వైద్య సూచనలు, చికిత్సలో సహాయం ఇక్కడి డాక్టర్లకు అందించేందుకు కూడా అక్కడి వైద్య నిపుణులు సిద్ధపడుతున్నారు. దీనికి తగిన డాలర్లు చెల్లించే స్తోమత ఉన్నవారు ఈ సేవలు పొందవచ్చు. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో మన దేశంలో కన్నా వ్యాధులపై, వైద్య విధానాలపై పరిశోధన సమృద్ధిగా జరుగుతోంది. ఫార్మసీ లాబ్స్‌ల్లో కొత్త రకం, మేలైన మందుల సృష్టికి కృషి చేస్తున్నారు. అరుదైన వ్యాధుల కోసం రూ. కోట్ల ఖరీదైన మందుల కోసం ప్రపంచం అగ్రదేశాల వైపు చూస్తోంది. అక్కడి ఆరోగ్య పత్రికలు అన్ని దేశాల వైద్యులకు మార్గదర్శకాలుగా పని చేస్తున్నాయి. రెండు వందల ఏళ్ల చరిత్ర గల ‘లాన్సెట్’ మెడికల్ జర్నల్ ఇంగ్లాండ్ నుంచి వస్తోంది. కోవిడ్ సమయంలో డాక్టర్లకు ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని అందించిన దీని సేవలు ఎంతో గొప్పవి. అంతటి వైద్య పరిజ్ఞానం గల డాక్టర్ల సెకండ్ ఒపీనియన్ లభిస్తే అంతకన్నా మేలు మరోటి ఉండదు. విదేశాల్లో సెకండ్ ఒపీనియన్ అందించే సంస్థలు ఎన్ని ఉన్నా వాటి చార్జీలు వందల, వేల డాలర్లలో ఉన్నాయి.

అయితే ఈ మధ్య అమెరికాలోని ఇండియన్ డాక్టర్లు ఇండియాలో ఉన్న పేషెంట్లకు టెలీ మెడిసిన్ సేవలు అందించేందుకు ‘మై అమెరికన్ డాక్టర్’ అనే సంస్థను ప్రారంభించారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న 50 మందికి పైగా స్పెషలిస్టులు ఈ ఆరోగ్య సేవలు భారతీయులకు అందిస్తారు. దీని కోసం 149 డాలర్లు చెల్లించాలి. ఆ తర్వాతి సంప్రదింపులకు అందులో సగం కడితే చాలు. డాక్టర్‌ను వర్చువల్‌గా కలిసాక 72 గంటల్లో అన్ని రిపోర్టులు అందజేస్తామని దాని సిఇఒ రాజ్‌నార్ల తెలియజేస్తున్నారు. వీరి వద్ద సెకండ్ ఒపీనియన్ సౌకర్యం కూడా ఉంది. డాక్టర్ల ఎంపిక, అపాయింట్‌మెంట్ సమయం అన్ని పేషంట్ ఇష్టమే. అమెరికన్ డాక్టర్ కన్సల్టేషన్, సెకండ్ ఒపీనియన్ ఇంత సులువుగా, తక్కువ ధరలో అందించడం అభినందనీయమే. ఏడాదికి పది లక్షలకు పైగా రోగులు చికిత్స కోసం వివిధ దేశాలకు వెళుతున్నారు. అదంతా ఎంతో శ్రమ, ఖర్చుతో కూడుకున్నది. వైద్య సదుపాయాల విషయం లో హైదరాబాద్ ఎంతో వృద్ధి చెందినందువల్ల చికిత్స కోసం అమెరికాకి వెళ్ళే కన్నా అక్కడి వైద్య నైపుణ్యాన్ని ఇక్కడ వాడుకుంటే తక్కువ ప్రయాసతో మంచి వైద్యాన్ని అందుకోవచ్చని ‘మై అమెరికన్ డాక్టర్’ వ్యవస్థాపకుల అభిప్రాయం.

మై యుఎస్ ఎడిఆర్ డాట్ కామ్‌లో అన్ని వివరాలు చూడవచ్చు. భారీ చెల్లింపులు ఎదురయే సందర్భాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తమ పాలసీదారులకు రెండో, మూడో వైద్య సలహా కోసం సొంత ఖర్చులతో ఏర్పాట్లు చేస్తాయి. సెకండ్ ఒపీనియన్ కవర్ అయ్యే హెల్త్ పాలసీ ఉన్నవారు దేశంలో ఉత్తమ వైద్యుని అభిప్రాయం పొందే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో కూడా ప్రముఖ వైద్యుల రెండో అభిప్రాయం సేకరణ ఇప్పుడు కొంత సులభతరమైంది.దేశంలో అత్యాధునిక ఆసుపత్రి అయిన అపోలో హాస్పిటల్ ఆన్‌లైన్ ద్వారా సెకండ్ ఒపీనియన్‌ను ఉచితంగా అందిస్తోంది. అపోలో సెకండ్ ఒపీనియన్ డాట్ కామ్ సైట్లో రోగి వివరాలు చేర్చి అన్ని సందేహాలు తీర్చుకోవచ్చు.చివరగా నిపుణుని సూచనలతో కూడిన పత్రాన్ని ఇ మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఇవే సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు యశోద, కాంటినెంటల్ హాస్పిటల్స్ తమ వెబ్ సైట్లలో పేర్కొన్నాయి. అలాంటి సౌకర్యం అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉచితంగా ఇవ్వాలి. ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీలో దీనిని చేర్చాలి. రోగుల ఆశలు దిగజారుతున్నప్పుడు సెకండ్ ఒపీనియన్ ఒక్కోసారి ప్రాణం పోయవచ్చు. చావు అంచుకు వెళ్లిన వారిలో ఏ కొందరు వెనక్కి వచ్చినా పునర్జన్మనే కదా!

బి.నర్సన్ 9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News