15 క్లస్టర్ల అమ్మకాలు
ఈ నెల 24వ తేదీన క్లస్టర్ల ఈ- వేలం
మనతెలంగాణ/హైదరాబాద్: నాగోల్ సమీపంలోని బండ్లగూడ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్‌కు సంబంధించిన 15 క్లస్టర్స్ (అపార్ట్‌మెంట్స్ టవర్లు) అమ్మకాల (ఈ- వేలం)పై సోమవారం ఉదయం రెండో దశ ప్రీ బిడ్ మీటింగ్ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నాగోల్ సమీపంలో ఉన్న బండ్లగూడ ‘సహభావన’లోని 15 క్లస్టర్స్ (అపార్ట్‌మెంట్స్ టవర్లు)ను యధావిధిగా ఆన్‌లైన్ వేలం (ఈ వేలం)లో విక్రయానికి పెట్టిన సంగతి తెలిసిందే.
‘సహభావన‘ క్లస్టర్ల ప్రాంగణంలో జరిగే రెండో దశ
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టిసి ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన ఆన్‌లైన్ వేలం జరగనుంది. సిటీ సెంటర్‌లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న ఇక్కడి క్లస్టర్స్ కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు, డెవలపర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడి క్లస్టర్స్ ను కొనుగోలు చేసిన సంస్థలు పూర్తి స్థాయిలో వాటిని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. తొలి ప్రీ బిడ్ మీటింగ్‌లో వచ్చిన సూచనలు, సలహాలు, అభిప్రాయాలను హెచ్‌ఎండిఏ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. బిడ్డర్లు, డెవలపర్లు, ఆసక్తి కలిగిన సంస్థలు సోమవారం బండ్లగూడ ‘సహభావన‘ క్లస్టర్ల ప్రాంగణంలో జరిగే రెండో దశ ప్రీ బిడ్ మీటింగ్‌కు హాజరుకావాలని హెచ్‌ఎండిఏ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధికారులు కోరారు.
ఖమ్మంలోనూ..
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ చెందిన ఎనిమిది (8) టవర్స్ విక్రయంపై ఖమ్మంలో రెండో ప్రీ బిడ్ మీటింగ్ జరగనుంది.