మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా పరిస్థితులు అనుకూలించి అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఇప్పటికే విడుదలయ్యేది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ పూర్తి కాలేదు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. వారం, రెండు వారాల్లో షూటింగ్ పూర్తవుతుందనగా కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘లాహె లాహె…’ అంటూ సాగే ఒక మంచి పాటను విడుదల చేశారు. ఈ పాట సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. ఈ సెకండ్ వేవ్ వచ్చి ఉండకుంటే బ్యాక్ టు బ్యాక్ పాటలు విడుదలై ఉండేవి. కానీ విడుదల ఆలస్యమవుతున్న కారణంగా పాటలను కూడా హోల్డ్‌లో పెట్టారు.
ఎట్టకేలకు ‘ఆచార్య’ రెండవ పాటకు సంబంధించిన అప్డేట్ను దర్శకుడు కొరటాల శివ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా షూటింగ్‌ను పరిస్థితులు చక్కబడ్డ తర్వాత పునః ప్రారంభిస్తామంటూ ప్రకటించిన కొరటాల శివ సినిమా నుండి రెండవ పాటను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఒక చిట్ చాట్‌లో తెలియజేశాడు. మణి శర్మ స్వరాలు అందించిన ఈ సినిమాలోని మొదటి పాట సూపర్ హిట్ కావడంతో రెండవ పాట కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మొదటి పాటకు కాస్త డెవోషనల్ టచ్ ఇచ్చారు. రెండవ పాట పూర్తి రొమాంటిక్‌గా ఉంటుందని తెలిసింది. రొమాంటిక్ మాస్ బిట్‌తో ఆచార్య రాబోతున్నాడు. ఈ పాటతో సినిమాపై మాస్ ఆడియన్స్‌కు మరింతగా పిచ్చెక్కడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే మెగా అభిమానులతో పాటు అంతా కూడా ‘ఆచార్య’ ఎప్పుడెప్పుడు వస్తాడా అంటూ ఎదురు చూస్తున్నారు. చరణ్ కూడా ఈ సినిమాలో నటించడం వల్ల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పరిస్థితులు కుదుట పడితే ఈ ఏడాది చివరి వరకు అయినా ‘ఆచార్య’ వచ్చేనో చూడాలి.