Friday, November 22, 2024

టీమిండియాకు పరీక్ష

- Advertisement -
- Advertisement -

సిరీస్‌పై కివీస్ కన్ను
నేటి నుంచి రెండో టెస్టు
పుణె: న్యూజిలాండ్‌తో పుణె వేదికగా గురువారం నుంచి జరిగే రెండో టెస్టు ఆతిథ్య టీమిండియాకు సవాల్‌గా మారింది. తొలి టెస్టులో చిరస్మరణీయ విజయం సాధించిన న్యూజిలాండ్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. మరోవైపు మొదటి టెస్టులో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుని సిరీస్‌ను సమం చేయాలనే లక్షంతో భారత్ పోరుకు సిద్ధమైంది. శుభ్‌మన్ గిల్ రాకతో టీమిండియా బ్యాటింగ్ బలంగా మారింది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా ఆడాలని భావిస్తోంది.

శుభారంభం దక్కాలి..

కిందటి మ్యాచ్‌లో భారత్ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం ప్రధాన కారణం. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలడంతో భారత్‌కు ఆరంభంలోనే ఓటమి ఖాయమైంది. కానీ పుణెలో మాత్రం తొలి రోజు నుంచే మెరుగైన ఆటను కనబరచాలనే పట్టుదలతో భారత్ ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌లు జట్టుకు శుభారంభం అందించాలి. ఇద్దరు మెరుగ్గా ఆడితే భారత్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి.

తొలి టెస్టులో ఇద్దరు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. ఈ మ్యాచ్‌లో మాత్రం భారీ స్కోర్లు చేయాలని భావిస్తున్నారు. శుభ్‌మన్ గిల్ చేరికతో బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారింది. గిల్ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశమే. ఇక సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి జట్టుకు చాలా కీలకంగా మారాడు. కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పాలి. విరాట్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే భారత్‌కు ఎదురే ఉండదు.

ఇర్దరిపై భారీ ఆశలు..

మరోవైపు తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చిరస్మరణీయ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్, యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. క్లిష్ట సమయంలో ఇద్దరు ఎలాంటి ఒత్తిడి లేకుండా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. సర్ఫరాజ్ ఏకంగా 150 పరుగులు చేసి సత్తా చాటాడు. రిషబ్ పంత్ 99 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇద్దరు ఈసారి కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో ఉన్నారు. సర్ఫరాజ్, రిషబ్‌లు చెలరేగితే కివీస్ బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. ఇక తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో కూడా విఫలమైన కెఎల్ రాహుల్‌కు తుది జట్టులో స్థానం లభించడం కష్టంగానే కనిపిస్తోంది.

గిల్ రాకతో రాహుల్‌కు ఈ పరిస్థితి తప్పడం లేదు. తొలి టెస్టులో సెంచరీతో అలరించిన సర్ఫరాజ్‌కు మరో ఛాన్స్ ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. అదే జరిగితే రాహుల్ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. కాగా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు కూడా తమ బ్యాట్‌లకు పనిచెప్పాల్సి ఉంటుంది. తొలి టెస్టులో వీరి వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపింది. రెండో ఇన్నింగ్స్‌లో వీర్దిదరూ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచి ఉంటే భారత్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉండేవి. బౌలర్లు కూడా మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. తొలి టెస్టులో బౌలర్లు విఫలమయ్యారు. ఇది కూడా జట్టు ఓటమికి ఒక కారణంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గ రాణించక తప్పదు. అప్పుడే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

ఆత్మవిశ్వాసంతో..

తొలి టెస్టులో సంచలన విజయం సాధించిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కివీస్ చారిత్రక గెలుపుతో పెను ప్రకంపనలు సృష్టించింది. భారత్ వంటి బలమైన జట్టును సొంత గడ్డపై ఓడించి కివీస్ సత్తా చాటింది. పుణెలోనూ గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలనే లక్షంతో ఉంది. మ్యాట్ హెన్రీ, ఓరౌర్కీ, ఎజాజ్ పటేల్, సౌథిలతో కివీస్ బౌలింగ్ చాలా బలంగా ఉంది. అతేగాక టామ్ లాథమ్, కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లుండెల్, డారిల్ మిఛెల్, గ్లెన్ ఫిలిప్స్ వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు కూడా జట్టులో ఉన్నారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న కివీస్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News