Monday, December 23, 2024

చల్లారని సెగలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ మొదటి జాబితా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ తర్వాతనే విడుదల చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, మరింతమందిలో అసంతృప్తి రగలకుండా చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది. కర్ణాటకలో అవలంభించిన విధానాన్నే ఇక్కడ అమలు చే యాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. పార్టీలోని అసంతృప్తులకు చెక్ పెట్టాలంటే ఈ విధానాన్నే అనుసరించాలని అధిష్ఠానం సూచించడంతో ఆ దిశగా రాష్ట్ర కాంగ్రెస్ చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది. ఈ లోపు పార్టీలోని అసంతృప్తులను దారికి తెచ్చుకునేలా ఏఐసిసి నుంచి పార్లమెంట్ అబ్జర్వర్లుగా కొనసాగుతున్న నేతలు రంగంలోకి దిగడంతో అసంతృప్తులు సై తం దారికొస్తున్నట్టుగా సమాచారం. అయితే జాబి తా విడుదల అయిన తరువాత మరింతమంది అసంతృప్తులు భారీగా బయటకు వచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ సెగ్మెంట్‌లలో అబ్జర్వర్లు మకాం వేసి ఆయా నేతలను సమన్వయం చేస్తున్నారు. అయితే పార్లమెంట్ అబ్జర్వర్లు చెప్పినా వినకుండా తమకు ఇష్టం  వచ్చినట్టు మాట్లాడే నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్ఠానం ఆదేశించడంతో ఆ దిశగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది.

వివిధ సర్వేలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్టు దాదాపు ఖరారయినట్టుగా తెలిసింది. అయితే మొదటి జాబితాలోని పేర్లను ముందుగా 17 మంది పార్లమెంట్ అబ్జర్వర్లకు మాత్రమే తెలిసేలా కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు చేపట్టినట్టుగా సమాచారం.ఈ నేపథ్యంలోనే ఆ అబ్జర్వర్లు కూడా జాబితా విడుదల అయ్యే వరకు వారి పేర్లను లీక్ చేయకుండా చూడడంతో పాటు అసంతృప్తులను దారిలోకి తీసుకురావాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసి ఏఐసిసికి జాబితాను పంపాయి. వాళ్లు ఓకే చెప్పగానే మొదటి జాబితాను ప్రకటిస్తారు.అయితే అంతకంటే ముందే పార్లమెంట్ అబ్జర్వర్లకు పార్టీ ముఖ్యమైన బాధ్యతలను అప్పగించింది.

సిట్టింగ్‌లో, మాజీల సీట్లతో ఫస్ట్ రౌండ్‌లోనే 25 మందిని ఫైనల్ చేసిన స్క్రీనింగ్ కమిటీ కాంపిటీషన్ అధికంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలకు మూడు పేర్ల చొప్పున సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించింది. సీఈసీ వివిధ సర్వేలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆ మూడు పేర్లలో ఒక అభ్యర్థిని ఫైనల్ చేయనుంది. ఈ నెల రెండో వారంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే అబ్జర్వర్లు జిల్లా కేంద్రాల్లో మకాం వేసి ఆశావహులను బుజ్జగించే ప్రయత్నం మొదలు పెట్టినట్టుగా తెలిసింది.

టికెట్ రాని వారిని బుజ్జగించేందుకు సర్వే ఫలితాలు…
ఆశావహులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు సర్వే ఫలితాలను వినియోగించనున్నారు. సునీల్ ఇప్పటివరకు చేసిన రాష్ట్ర సర్వేలు, నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ఫ్లాష్ సర్వే, పార్టీలతో సంబంధం లేకుండా చేసిన పాపులర్ సర్వే రిజల్ట్‌కు సంబంధించి టికెట్లు ఆశిస్తున్న వారికి వివరించనున్నారు. సునీల్ కనుగోలుతో పాటు అబ్జర్వర్లు ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఆ తర్వాత పార్టీలో వివిధ రకాల వెయ్యి నామినేటెడ్ పదవులు లభిస్తాయని వారికి భరోసా ఇవ్వనున్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసినోళ్లను ఏఐసిసి నుంచి పదవులతో పాటు ఎమ్మెల్సీ, రాజ్యసభతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు వంటి పోస్టులన్నీ టికెట్ రాని నేతలకు ఇస్తామంటూ అధిష్ఠానం కూడా హామీ ఇవ్వాలని నిర్ణయించింది.

ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం అయితే
ఫ్లాష్ సర్వేలు నిర్వహించిన సూర్యాపేట, జనగామ, ఖైరతాబాద్, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, మిర్యాలగూడ, భువనగిరి తదితర 27 నియోజక వర్గాల్లో మరోసారి సర్వేలు జరిగినట్లు సమాచారం. గెలుపే లక్ష్యంగా పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పిసిసి వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆలస్యం కావడం పార్టీ గెలుపుపై ఆ ప్రభావం తీవ్రంగా చూపినట్లు రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తుంది. అలాంటప్పుడు ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన చేయాలని భావిస్తున్నప్పటికీ అవకాశాలు కనిపించడం లేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూలు తేదీ ఆలస్యం అయితే షెడ్యూల్ కన్నా ముందే మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News