Sunday, December 22, 2024

46 ఏండ్లకు తెరుచుకునే తలుపులు

- Advertisement -
- Advertisement -

సముద్రతీరంలోని పూరీ క్షేత్రంలో జగన్నాథుడి రహస్య రత్నభాండాగారం తలుపులు ఆదివారం తిరిగి తెరుచుకోనున్నాయి. ఇందుకోసం ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ఈ రత్న భండార్‌లో ఎంతటి విలువైన నగల సంపద ఉందనేది లెక్కించడానికి 46 సంవత్సరాల తరువాత ఇప్పుడు అత్యంత నిపుణుల బృందం, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో తెరువనుంది. గతంలో 1978లో ఈ ఖజానాను తెరిచారు. ఈ రహస్య మాళిగలోని రత్నఖచిత నగలు వజ్రాలు వైడూర్యాలు ఇతర విలువైన వాటిని లెక్కించడం, వాటి విలువ నిర్థారించడం, గతంలో దీనిని తెరిచినప్పుడు రికార్డు అయిన నగల విలువకు ఇప్పటి వాటికి తేడాలు ఉన్నాయా? లేదా అనేది నిర్థారించుకోవడం కీలక అంశం కానుంది. కాగా ఇదే దశలో భారతీయ పురాతన వందల శతాబ్దాల కిందటి ఆలయాల అనుబంధంగా పలు రహస్యాలు ,

ప్రత్యేకించి లక్షల కోట్లు విలువ చేసే బంగారు నిధుల నిక్షిప్త ప్రాంతాలు ఉన్నాయనే కథల నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడి జగన్నాథుని ఖాజానా లెక్కింపు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పూరి క్షేత్రాన్ని పర్యవేక్షించే భారత పురావస్తు శాఖ (ఎఎస్‌ఐ) ఈ నేపధ్యంలోనే ఆలయానికి అవసరం అయిన మరమ్మత్తులు కూడా చేపడుతుందని వెల్లడైంది. రత్న భండార్‌ను తిరిగి తెరిచేందుకు తాము పూర్తి స్థాయిలో సమాయత్తం అయినట్లు పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వెయిన్ శనివారం విలేకరులకు తెలిపారు. దీనికి సంబంధించి అన్ని కూడా పద్ధతి ప్రకారం జరుగుతాయి. ప్రత్యేకించి శ్రీ జగన్నాథ ఆలయ చట్టం పరిధిలో, ప్రభుత్వం వెలువరించిన ప్రామాణిక కార్యనిర్వాహక పద్ధతులు (సాప్ )నకు అనుగుణంగా వ్యవహరించడం జరుగుతుందని వివరించారు. చాలాకాలం తరువాత ఈ ఖజానాను తెరిచిచూడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 16 మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు ఇప్పుడు దీనిని తెరుస్తున్నారు.

పూర్తిగా సాంప్రదాయకంగా, పూజాదికాలతో
రత్నభండార్ తిరిగి తెరిచే ఘట్టం అంతా కూడా ఇక్కడి క్షేత్ర పూర్వపు సాంప్రదాయాలకు అనుగుణంగా సాగుతాయని కమిటీ సభ్యులు సౌమేంద్ర ముదులి తెలిపారు. కమిటీకి ఛైర్మన్‌గా ఒరిస్సా హైకోర్టు రిటైర్డ్ జడ్జి విశ్వనాథ్ రథ్ నాయకత్వం వహిస్తున్నారు. ముందుగా ఆలయంలోని లోక్‌నాథ స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారని ముదులి తెలిపారు. ఇక్కడి బంగారు నగలకు కాపలాగా పురాతన నాగసర్పాలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. దీనితో ముందుగా లోపలికి ఆలయ అధీకృత ఉన్నతాధికారి , పాములు పట్టే కొందరు బోయలు , స్నేక్ క్యాచర్స్ లోపలికి వెళ్లుతారు. ఇక్కడి ఖజానాలోని కొన్ని విలువైన నగరలు మాయం అయ్యాయని అనుమానాలు ఉన్నట్లు

స్థానిక బలభద్ర ఆలయ నిర్వాహకులు హలధార్ దాస్‌మెహాపాత్ర తెలియచేయడంతో దీనిపై కదలిక ఏర్పడింది. లోపల కాలసర్పాలు ఉన్నాయనేది , ప్రాణాపాయం ఉంటుందనేది కేవలం అపోహ అని ఆలయ పూజారులు కూడా తెలిపారు. ఇవన్నీ వదంతులే అని, అంతా ఇప్పుడు చేసేది పవిత్ర కార్యక్రమమని భావించుకుని ముందుకు వెళ్లాలని హలధార్ బాబా మనవిచేశారు. ఇది జగన్నాథుడి సంకల్పం అనుకుని ముందుకు వెళ్లితే ఎటువంటి ఆటంకాలు ఉండవని సెలవిచ్చారు. పవిత్ర ఉద్ధేశం కీలకం అన్నారు. నగలు ఇతర వస్తువులను తూకం వేయకుండా లెక్కించడం మంచిదని సూచించారు. తరువాత సీల్ వేయాలని కోరారు.

త్రివలయ రత్నభాంఢాగారం
ఇక్కడి అత్యంత రహస్యాల రత్నభండార్ మూడు వలయాలుగా ఉంటుందని ఇక్కడి ఆలయ నిర్వాహకులు , వయోవృద్ధులు తెలిపారు. మొదటి వరుసలో అంటే బాహ్య వలయంలో ఉండే నగలలో ఇప్పటివరకూ పూజాదికాలు, క్రతువులలో వాడిన వాటిని ఉంచుతారు. ఇక అంతర్ వలయాలలోనివే అత్యంత కీలకమైనవి. వీటిలోనే ఇప్పటివరకూ వినియోగంలోకి రాని అత్యంత విలువైన నగలు వజ్రవైఢూర్యాలు , ఇతర అమూల్య వస్తువులు దాచి ఉంచారని చెపుతారు. వీటిని అప్పటి రాజులు, భక్తులు శతాబ్దాల నాటి నుంచి జగన్నాథుడికి సమర్పించుకున్నవని, వీటి విలుల భారీగా ఉంటుందని వెల్లడైంది.

కాగా అనధికారికంగా తెలిసిన దాని ప్రకారం ఇవి దాదాపు లక్షకోట్ల రూపాయల విలువకు పడగలెత్తాయనే ప్రచారం సాగుతోంది. కాగా 2018లో రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా ఈ రత్నభండార్‌లోని నగల వివరాలు తెలిపారు. దీని మేరకు ఇక్కడ 12,831 భారీలు ( ఒక్క భారీ విలువ 11.6 గ్రాములు) బంగారు ఆభరణాలు, నవరత్న ఉంటాయని వెల్లడించారు. కాగా 22,153 భారీల వెండి వస్తువులు ఇతర వస్తువులు ఉన్నాయని కూడా తెలిపారు. కిలోల చొప్పున చూస్తే వీటి లెక్కలు, వీటి ఇప్పటి విలువ అనేది భారీ స్థాయిలో ఉంటుందని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News