సచివాలయంలో మూలకుపడ్డ బ్యాటరీ వెహికిల్స్
ఆరో అంతస్థులో రెండు, సెంట్రల్ లాన్ వద్ద మరో రెండు
ఉద్యోగులు, సందర్శకులకు వినియోగించాలన్న డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్: పర్యావరణ హితం రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈవీ పాలసీని తీసుకువచ్చి జీవో నెం.41 జారీచేసింది. అయితే రాష్ట్ర పాలనాయంత్రాంగానికి గుండెకాయలాంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పొల్యూషన్ ఫ్రీ చర్యలకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. అంతే కాకుండా ఇప్పటి వరకు సచివాలయంలో అందుబాటులోఉన్న పొల్యూషన్ ఫ్రీ అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోకపోవడం గమనార్హం.
వాస్తవానికి ఎలక్ట్రికల్ వాహనాలు(ఈవీ) వినియోగం పెంచేందుకు ప్రభుత్వం రాయితీలను ప్రకటించింది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం ఎలక్ట్రికల్ వాహనాలు(ఈవీ) వినియోగం కోసం పాలసీని ప్రకటించగా, ప్రస్తుత ప్రభుత్వం అంతకు ధీటుగా ఎలక్ట్రికల్ వాహనాలు(ఈవీ) పాలసీని ప్రకటించి అందరినీ ఆకర్షించింది. ఈవీ పాలసీలో భాగంగా సచివాలయం పరిధిలో వినియోగం కోసం కొనుగోలుచేసిన బ్యాటరీ వాహనాలు వినియోగించడంలో నాడు కేసీఆర్ ప్రభుత్వం నేడు రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమయ్యాయి. సచివాలయం నిర్మాణ సమయంలో, ఆతర్వాత ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం మారాక గత ఏడాదికాలంగా సచివాలయంలో ఉన్న ఎలక్ట్రికల్ వాహనాలు ఎక్కడ ఉన్నవి అక్కడే పార్కింగ్‌లో ఉండడం గమనార్హం.
నాలుగు బ్యాటరీ వాహనాలు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వినియోగం కోసం సుమారు రూ.25లక్షల వరకు ఖర్చుచేసి నాలుగు ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేసింది. వాటిలో రెండింటిని గ్రౌండ్ ఫ్లోర్‌లోని సీఎం ఎంట్రెన్స్ ఏరియాలో ఉంచారు. మిగతా రెండు సీఎం ఉండే ఆరోవ అంతస్థులో ఉన్నాయి. అయితే ఆరోవ అంతస్థులో ఉన్న ఈవీ వాహనాలను కిందకు దించే అవకాశం లేకపోవడం విశేషం. ప్రారంభంలో వాటిని క్రేన్ ద్వారా ఏకంగా ఆరో అంతస్థులోకి తీసుకువెళ్ళినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అయితే గత ఏడాదికాలంలో వాటిని ఏమాత్రం వినియోగించకపోవడంలో ఔచిత్యం ఏమిటనేది ఉద్యోగులకు, సచివాలయం సందర్శకులకులకు, అంతుపట్టడంలేదు.
చిత్తశుద్ధి లేక
ప్రభుత్వం కొనుగోలుచేసి సచివాలయంలో అందుబాటులో ఉంచిన నాలుగు ఎలక్ట్రికల్ వాహనాలను ఉద్యోగులు, సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సందర్శకులకు, ఉద్యోగుల రాకపోకలకు ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగిస్తున్న తీరును కొందరు ఉదహరిస్తున్నారు. దాంతో పాటు తిరుమలలో కూడా ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అందుబాటులో ఉన్న ఎలక్ట్రికల్ వాహనాలను నిత్యం వినియోగించడం వల్ల వాటి పట్ల అవగాహన పెరుగుతుందని అంటున్నారు. సచివాలయంలో ఉన్న ఎలక్ట్రికల్ వాహనాలను ఎంతో కాలంగా వాటిని నిరర్ధకంగా ఉంచడం ఏమాత్రం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు. ఉదయం వేళల్లో ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో వచ్చే ఉద్యోగులను ప్రధాన ద్వారాల నుంచి కారిడార్ వరకు వెళ్లేందుకు ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. అంతే కాకుండా మధ్యాహ్నం మూడు గంటల నుంచి సందర్శకులను ప్రధాన ద్వారం నుంచి కారిడార్ వరకు రాకపోకలకు ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించడం వల్ల సందర్శకుల సమయం ఆదా అవుతుంది.
జీవో నెం.41 రాయితీలు
ప్రభుత్వం ముందుచూపుతో ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలుకు బంపర్ ఆఫర్లను ప్రభుత్వం ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీ నగరం ఎదుర్కొంటున్న వాహన కాలుష్యం సమస్య హైదరాబాద్ నగరానికి భవిష్యత్తులో ఎదురుకాకుండా ఉండేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి, ప్రభుత్వం వాటి కొనుగోళ్ళపై ఉన్న రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులలో వందశాతం మినహాయింపు కల్పిస్తూ జీవో నెం.41 జారీచేసింది. ఈ ఉత్తర్వులు పాలసీ రెండేళ్లపాటు అంటే 2026 డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటాయని ప్రకటించింది. అంతే కాకుండా రెండో వాహనం కొనుగోలుకు ఇప్పటి వరకు ఉన్న రెండు శాతం పన్నును కూడా రద్దుచేసింది. ఈ ప్రోత్సాహకం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, టాక్సీలు, మూడు సీట్ల ఆటోరిక్షాలు, లైట్ గూడ్స్ క్యారియర్లు (మూడు చక్రాల మోడల్‌లతో సహా), ట్రాక్టర్లు, బస్సులు వంటి వాణిజ్య ప్రయాణీకుల వాహనాలకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది.