Thursday, January 23, 2025

రష్యాకు రహస్యంగా 40 వేల రాకెట్లు.. లీకైన పత్రాల్లో ఈజిప్టు ప్రణాళిక

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ఉక్రెయిన్ పై ఏడాది కాలంగా సాగిస్తున్న యుద్ధంలో ఆయుధ నిల్వలను కోల్పోతున్న రష్యాకు ఈజిప్టు సహాయంగా 40 వేల రాకెట్లను తయారు చేసిన విషయం బయటపడింది. రహస్యంగా వీటిని రష్యాకు తరలించడానికి ప్రణాళిక సిధ్ధ్దం చేసిందని అమెరికా నిఘా సంస్థలు రూపొందించిన రహస్య పత్రాలు లీకు కావడం పాశ్చాత్య దేశాల్లో కలవరం రేపుతోంది. అమెరికా వార్తా సంస్థ “ది వాషింగ్టన్ పోస్ట్” ఈ కథనం వెల్లడించింది. ఈ సాయం విషయంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ పతా ఎల్‌సిసి తన సైనికాధికారులతో ఇటీవల రహస్యంగా భేటీ అయ్యారని, మందుగుండు సామగ్రిని అందించడం పైనా చర్చించారని సమాచారం. అయితే పాశ్చాత్య దేశాల నుంచి ఇబ్బంది రాకుండా ఈ ప్రణాళికను రహస్యంగా ఉంచాలని అధికారులకు సూచించినట్టు తాజా కథనం పేర్కొంది.

అయితే ఈ విషయాలు తెలుసుకున్న అమెరికా అధికారులు నిర్ఘాంతపోయినట్టు తెలిసింది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో అమెరికాకు అత్యంత సన్నిహిత దేశంగా కొనసాగుతున్న ఈజిప్టు ఇప్పుడు రహస్యంగా రష్యాకు ఆయుధాలను సమకూర్చాలని భావిస్తే ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అమెరికాకు చెందిన సెనెటర్ క్రిస్ మర్ఫీ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సంబంధించిన కీలక సమాచారంపై అమెరికా రక్షణ శాఖ కొన్ని నివేదికలు రూపొందించినట్టు సమాచారం. వీటిలో ఇరు దేశాల సైనికుల మరణాలు, ప్రమాదాలు, సైనిక శక్తి సామర్ధాలు, ఆయుధ సంపత్తికి చెందిన డేటా ఉన్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు ఉక్రెయిన్‌కు అమెరికా అందించిన ఆయుధాలు, శిక్షణ సహాయం, సైనిక వ్యూహాలతోపాటు అత్యంత రహస్యం అని పేర్కొన్న మ్యాప్‌లు, ఫోటోలు కూడా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా ఇవి లీకైనట్టు వార్తలు వస్తుండటం చర్చనీయాంశం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News