Sunday, December 22, 2024

శాస్త్ర ప్రగతికి మూఢత్వ చెదలు

- Advertisement -
- Advertisement -

ప్రకృతి రహస్యాలను ఛేదించి మానవ ప్రగతికి బాటలు వేసేది సైన్స్. సమాజ అభివృద్ధికి సైన్స్‌కి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. ఈ క్రమంలో భారత దేశం కూడా విజ్ఞాన శాస్త్రంలో తనదైన శేలిలో ముందుకెళ్తున్నది. మన సైన్సును ప్రపంచ వ్యాప్తం చేసిన మొట్టమొదటి పరిశోధన ‘రామన్ ఎఫెక్ట్’. భారతీయ శాస్త్రవేత్త సి.వి రామన్ ఫిబ్రవరి 28న కనుగొన్న కాంతిపై పరిశోధన ఇదీ. దీనికిగాను ఆయనకు నోబెల్ ప్రైస్ పొందారు. ఈ సందర్భంగా ‘జాతీయ విజ్ఞాన దినోత్సవ’ (నేషనల్ సైన్స్ డే) ప్రతి ఏటా భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ ఏడు ‘వికసిత్ భారత్ కోసం దేశీయ సాంకేతికత’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. నేడు కృత్తిమ మేధ, రోబోటిక్, మెసెన్ లర్నింగ్, డాటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతతో ప్రపంచం దూసుకుపోతుంది.మరోవైపు ఈ సాంకేతికతను భారత దేశం కూడా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే మన దేశం అంతరిక్ష రంగంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతున్నది. అంతేకాకుండా సేవా రంగం, ఔషధ రంగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల 2023లో ‘ఇస్రో’ చంద్రయాన్- 3 విజయవంతం కావడం శాస్త్రరంగంలో భారత్ సాధించిన గొప్ప విజయం అనవచ్చు.

తరువాత కొంత కాలానికే భారత దేశపు ప్రతిష్ఠాత్మక ఆదిత్య -ఎల్1 ప్రయోగం కూడా విజయవంతంగా ముగియడం మరొక విజయంగా చెప్పుకోవచ్చు. మన దేశ వైజ్ఞానిక ప్రభను అంతర్జాతీయ సూచికలు సైతం నిర్ధారిస్తున్నాయి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII)2023 లో మొత్తం 132 దేశాలలో భారత దేశం 40వ స్థానాన్ని నిలుపుకుంది. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్లుఐపిఒ) నివేదిక 2022 ప్రకారం ప్రపంచంలోని రెసిడెంట్ పేటెంట్ ఫైలింగ్ కార్యకలాపాల పరంగా భారతదేశం 7వ స్థానంలో ఉంది. వైజ్ఞానిక పరిశోధన పత్రాల ప్రచురణలో ఇండియా ప్రపంచంలోనే 3వ స్థానానికి చేరుకుందని ఇటీవల పార్లమెంట్ స్థాయి సంఘం పేర్కొన్నది. ఇదంతా కూడా దేశీయంగా సైన్సు ప్రగతికి నిదర్శనం అని చెప్పవచ్చు. కానీ ఇటీవల ప్రభుత్వం నిర్ణయాలు శాస్త్రీయ ప్రగతిని నిరుత్సాహపరిచే విధంగా ఉన్నాయి. దేశంలో శాస్త్ర పరిశోధనలకు అవసరమై నిధుల కేటాయింపును పర్యవేక్షించేందుకు ‘నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. దీనికి ఆశించిన స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదు. ఇదిలా ఉంటే దశాబ్దాలుగా పని చేస్తున్న విజ్ఞాన్ ప్రసార్‌ను 2023 లో మూసివేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్‌సిఎ)కు నిధుల కేటాయింపులు తగ్గించారు.

ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఏటా జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. ఇటీవల సైన్స్‌రంగంలో ఇచ్చే పలు అవార్డులను రద్దు చేశారు. డార్విన్ జీవ పరిణామ క్రమాన్ని వివరించే పాఠాలను పుస్తకాల్లోంచి తొలగించారు. ఇవి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి గోడ్డలి పెట్టు లాంటివి నిర్ణయాలు. మరోవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులు స్థూల జాతీయ ఉత్పత్తిలో ఒక శాతం కూడా ఉండడం లేదు. ఏ దేశ ప్రగతైన పరిశోధన, అభివృద్ధిపైన ఆధారపడి ఉంటుంది. కానీ, భారత దేశం ఆధునికంగా ఎంతో పురోగతి సాధించినప్పటికీ.. నేటికీ మన సైన్సును మత పెద్దల ఆచారాలు, విధానాలే శాసిస్తున్నారు. వీరికి ఇచ్చినంత విలువ మన శాస్త్రవేత్తలకు, వారి ఆవిష్కరణలకు ఇవ్వడం లేదు. మనిషి వైజ్ఞానిక ఫలాలు అనుభవిస్తూనే… అంధత్వంలోకి జారుకుంటున్నాడు. విద్యావంతులలో శాస్త్రీయ వైఖరి లోపించడం, మితిమీరిన మతవిశ్వాసాలు, అశాస్త్రీయ బోధనలు, ప్రభుత్వ విధానాలు, మీడియా ప్రకటనలు ప్రజల్ని మూఢత్వ దిశగా ప్రేరేపిస్తున్నాయి. ఇటీవల రంగురాళ్లు ధరించడం, సంఖ్యా శాస్త్రం ఆధారంగా పేర్లు మార్చుకోనే వారి సంఖ్య పెరిగింది. ఇటీవల ఆధునిక, సనాతన భావజాలాల చర్చ కొనసాగుతుంది. ప్రజల్లో ప్రశ్నించేతత్వం లోపిస్తుంది.

ఐఐటి లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సైతం అశాస్త్రీయ ప్రచారం జరుగుతుంది. భూత వైద్యానికి, అతీంద్రియ శక్తులకు ఆదరణ పెరుగుతుంది.సమాజ అభివృద్ధికి మూలం విజ్ఞానశాస్త్రవే. కావున విద్యాసంస్థల్లో శాస్త్రీయ ప్రగతిశీల విద్య అభ్యసనం జరగాలి. ప్రభుత్వాలు హేతుబద్ధ, శాస్త్రీయ ఆలోచన విధానాలను ప్రోత్సహించాలి.అంతేకాకుండా సైన్స్ ప్రచార సంస్థలు కూడా ఆ దిశగా కృషీ చేయాలి.అప్పుడే దేశంలో వేళ్ళానుకొని ఉన్న సామాజిక రుగ్మతలను నిర్మూలించవచ్చు. మన విశ్వవిద్యాలయాలు పరిశోధన కేంద్రాలుగా ఎదగడానికి కావాల్సిన వాతావరణాన్ని కల్పించాలి.ఇవి నవ కల్పనలకు నాంది పలుకాలి. యువతను పరిశోధన వైపు ఆకర్షించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి.దీని కోసం శాస్త్ర సాంకేతిక రంగాలకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించాలి. సైన్సు సత్యాలు విశ్వవ్యాపితం. అవి జాతీయ సరిహద్దులకు పరిమితం కావు.మతాల అడ్డుగోడల మధ్య బంధీలు కావు. కుల విభజనలకు లొంగవు. కావున శాస్త్రీయ పురోగతివైపు ప్రతి ఒక్కరం అడిగేద్దాం. అప్పుడే నూతన ఆవిష్కరణతో వైజ్ఞానిక విప్లవానికి నాంది పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News