Friday, November 22, 2024

కాలం చెల్లిన ‘దేశద్రోహం’

- Advertisement -
- Advertisement -

Section 124A of IPC is the most vicious of all

 

‘దేశ ద్రోహ నేరం’ ఆరోపణ అనేక సార్లు దుర్వినియోగమైం ది. ఈ ఆరోపణ కింద అరుదుగా మాత్రమే శిక్షలు పడుతున్నాయి. దేశద్రోహ నేరాన్ని మోపే ఐపిసి సెక్షన్ 124 ఎ వలసవాద చట్టాన్ని రిటైర్డ్ ఆర్మీ మేజర్ జనరల్ ఎస్.జి. ఓంభత్‌కెరి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ‘దేశ ద్రోహ నేరం’ అనేది అంత తేలికైంది కాదు. “ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ద్వేషించినా, ధిక్కరించినా, అసంతృప్తిని ప్రేరేపించినా వారికి మూడేళ్ళ జైలు శిక్ష కానీ, జీవిత ఖైదు కానీ విధించవచ్చు. వీటితో పాటు జరిమానా కూడా విధించవచ్చు”.

భారత శిక్షాస్మృతిని 1837లో లార్డ్ మెకా లే ఆమోదించినప్పుడు, 1860లో చట్టంగా రూపొందినప్పుడు ‘దేశ ద్రోహం’ చేర్చలేదు. ఆ తరువాత 1870లో దీన్ని సెక్షన్ 124 ఎ గా జోడించారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన నాయకులు ఈ చట్టాన్ని పునరుద్ధరించాలనుకోలేదు. ఇంత దుర్వినియోగం అవుతుందని ఊహించనూ లేదు.

నేటి ఆధునిక ప్రపంచంలో ‘దేశ ద్రోహం’ మోపే సెక్షన్ 124 ఎ చాలా విచిత్రమైంది. పదిహేడవ శతాబ్దంలో ఇంగ్లాండులో రూపొందించిన ఈ ‘దేశ ద్రోహ’ చట్టాన్ని 2010లో తొలగించారు. మన స్వతంత్ర భారత దేశంలో మాత్రం ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో భారతీయుల వ్యక్తిగత స్వేచ్ఛను అదుపు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. ఐపిసిలో 124 ఎ సెక్షన్ జోడించిన ఇరవై ఏళ్ళకు తొలి కేసు నమోదైనప్పటికీ, అది న్యాయస్థానం ముందు నిలబడలేదు.

స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్‌పై 1897లో ‘దేశ ద్రోహ’ నేరం మోపి, 18 నెలలు జైలు శిక్ష విధించారు. ‘ప్రభుత్వం పట్ల అవిధేయత కూడా దేశ ద్రోహమే’ అని ఈ కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ స్ట్రా అంటాడు. “ఒక మనిషి అసంతృప్తితో ఆవేశపడినా, ఈ చట్టం కింద నేరమే” అని నిర్వచించాడు. 1870లో రూపొందించిన ఈ చట్టానికి, ఇప్పుడు అమలు జరగుతున్న 1898 నాటి చట్టానికి చాలా తేడా ఉంది. ప్రభుత్వం పట్ల అసంతృప్తిని రెచ్చగొట్టినా, ఆవేశపడినా 1870 నాటి 124 ఎ సెక్షన్ ప్రకారం ‘దేశద్రోహం’. ప్రభు త్వం పట్ల ద్వేషాన్ని పెంచినా, ప్రభుత్వాన్ని ఉల్లంఘించినా 1898 లో మార్చిన 124 ఎ ప్రకారం ‘దేశద్రోహం’. భారత శిక్షాస్మృతిలో చేసిన సవరణల ప్రకారం అసంతృప్తితో పాటు అవిధేయత, శతృపూరిత ధోరణిని కూడా దేశద్రోహమే.

తిలక్ తర్వాత ఈ చట్టం కింద మహాత్మా గాంధీ పైన పెట్టిన కేసు సందర్భంగా ఆయన ఇలా అంటారు. “పౌరుల స్వేచ్ఛను హరించడానికి బ్రిటిష్ రాజు భారత శిక్షాస్మృతిని రూపొందించి, అందులో 124 ఎ కింద నాపైన నేరారోపణ చేయడం నాకు మంచిదే. చట్టం ద్వారా అభిమానాన్ని కల్పించలేం. ఎవరైనా ఒకరిపైన అభిమానం లేకపోయినట్టయితే, తన అసంతృప్తిని పూర్తిగా వ్యక్తం చేయనివ్వాలి. అలా చేయనిస్తే అతనిలో బాధ తగ్గి, హింసను ప్రేరేపించే అవకాశం పోతుంది. ఈ సెక్షన్ల కింద నాపై కేసు పెట్టడం గౌరవంగా భావిస్తాను”. ఈ కేసు విచారణ కేవలం రెండు గంటలు కూడా సాగలేదు. గాంధీ జీకి ఆరేళ్ళు జైలు శిక్షపడినప్పటికీ, అనారోగ్య కారణాలతో రెండేళ్ళకే జైలు నుంచి విడుదలయ్యారు.

కమ్యూనిస్టు పార్టీపైన 1934లో విధించిన నిషేధాన్ని ఖండించినందుకు కమల్ కృష్ణ సర్‌కార్‌పైన ‘దేశం ద్రోహ’ నేరం మోపిన సందర్భంగా ఇద్దరు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులు ఇలా అన్నారు. “ఇలాంటి ఉపన్యాసాలను ‘దేశ ద్రోహం’ అనడం చాలా అసంబద్ధం. ఇలా కేసులు పెడితే ప్రస్తుత తరహా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే వాదనలు, మరొక తరహా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే వాదనలు ద్వేషాన్ని పెంచుతాయి. మరొక తరహా ప్రభు త్వం రావాలని చేసే సూచనలతో ప్రస్తుత ప్రభుత్వం పట్ల ద్వేషం, ఉల్లంఘన అవసరం లేదు”

స్వాతంత్య్రం వచ్చాక కూడా 124 ఎ సెక్షన్ అలాగే ఉండిపోయింది. రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చాక అర్టికల్ 19 ద్వారా పౌరులందరికీ వాక్ స్వాతంత్య్రాన్ని కల్పించారు. రాజ్యాంగంలో ‘దేశ ద్రోహం’ అనే పదం లేదు. పౌరులందరికీ వాక్ స్వాతంత్య్రా న్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రసాదించే ఆర్టికల్ 19(ఎ)కు మినహాయింపుగా అందులో ‘దేశ ద్రోహం’ చేర్చలేదు. దానితోపాటే వాక్ స్వాతంత్య్రానికి బాసటగా ఆర్టికల్ 19ని పొందుపరిచారు.

మన రాజకీయ వర్ణ విశ్లేషణలో రెండు పత్రికలపైన కేసులు పెట్టారు. ఇప్పుడైతే ఇదొక అపహాస్యం అవుతుంది కానీ, నెహ్రూ ప్రభుత్వం పట్ల విమర్శనా దృష్టితో వచ్చే ‘క్రాస్ రోడ్స్’ అనే వామపక్ష పత్రికను నిషేధించారు. ఆర్‌ఎస్‌ఎస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’పై సెన్సార్ షిప్ విధించారు. ఆర్గనైజర్ పత్రికను అచ్చుకు పంపే ముందు తమ పరిశీలనకు పంపాలని ఢిల్లీ చీఫ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండిటినీ సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. వాక్ స్వాతంత్య్రాన్ని అదుపు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 1951లో రాజ్యాంగాన్ని తొలిసారిగా సవరించి ఆర్టికల్ 19 (2)ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వాక్ స్వాతంత్య్రంపైన ‘సహేతుకమైన ఆంక్షల’ ను చొప్పించింది. హింసాత్మకమైన బెదిరింపు లు, మతాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలను అదుపు చేయడానికి ఈ సవరణలను తెచ్చారని అర్థం చేసుకోవచ్చు. కానీ, ఎన్నికల ర్యాలీలో ఒక కేంద్ర మంత్రి ‘దేశ ద్రోహులను కాల్చి చంపండి’ అని పిలుపిస్తే ఏ చర్యా తీసుకోలేదు.

ఆర్టికల్ 19ని సవరించినప్పటికీ సెక్షన్ 124 ఎ అలాగే ఉండిపోయింది. కేదార్ నాథ్‌కు, బీహార్ రాష్ర్ట ప్రభుత్వానికి మధ్య 1962లో జరిగిన కేసులో ‘దేశ ద్రోహ’ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కానీ, ప్రభుత్వాన్ని రక్షించడానికి ఈ చట్టం అవసరమని న్యాయస్థానం సమర్థించింది.

వినియోగం, దుర్వినియోగం

‘దేశ ద్రోహ’ నేరం కింద 2015-19 మధ్య 191 కేసులు నమోదైతే, 43 కేసులలో మాత్రమే విచారణ పూర్తి అయ్యింది. వీటిలో నాలుగు కేసులలో మాత్రమే శిక్షలు పడ్డాయి. సాక్ష్యాలు లేవని పోలీసులే ఆరు కేసులను ఉపసంహరించుకున్నారు. వాటిలో రెండు తప్పుడు కేసులని కూడా తేలాయి. అయినప్పటికీ ఈ సెక్షన్లకింద కేసులు నమోదు చేయడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. ‘దేశద్రోహ’ నేరం కింద 2015-18 మధ్య కేసులు రెట్టింపు అయ్యాయి. ‘దేశ ద్రోహ’ చట్టం కింద తప్పుడు కేసులు నమోదు చేసేటప్పుడు పోలీసులు నమ్మక ద్రోహానికి నమ్మిన బంటులా నిలుస్తున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ ఈ చట్టం వల్ల దుర్వినియోగమవుతోంది.‘మితిమీరిన దేశ భక్తి’ వల్ల 2016లో ‘దేశ ద్రోహ’ చట్టం కింద అనేక కేసులు పెట్టారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ పారికర్ పాకిస్థాన్ వెళుతున్నప్పుడు నరకానికి వెళుతున్నట్టుందని వ్యాఖ్యానించారు.

దీనికి స్పందించిన కన్నడ నటి రమ్య పాకిస్థాన్ ప్రజలు ఆదరించే మనస్తత్వం గలవారని అన్నందుకు ఆమె పై ‘దేశ ద్రోహ’ నేరం మోపారు. అదే ఏడాది జెఎన్‌యు విద్యార్థి సంఘ నాయకుడు కన్హయ్యకుమార్ విముక్తి కావాలని కోరినందుకు ఆయనతో పాటు మరో ఇద్దరిపైన కూడా ‘దేశ ద్రోహ’ నేరం కింద కేసు పెట్టారు. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయవాదుల వేషంలో వచ్చిన కొందరు ఆయనపై దాడి చేశారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద 2016లో సుప్రీంకోర్టు కేదార్‌నాథ్ కేసును పునరుద్ఘాటిస్తూ, చట్టం గురించి ఇలా వివరించింది. “పౌరులు ప్రభుత్వం గురిం చి మాటల ద్వారా కానీ, రాతపూర్వకంగా గాని విమర్శ చేయవచ్చు వ్యాఖ్యానించవచ్చు. అయితే, చట్టప్రకారం ఏర్పడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను విచ్ఛినం చేసే ఉద్దేశంతో హింసను ప్రేరేపించనంతకాలం పౌరులకు ఆ హక్కు ఉంటుంది”

ఉత్తర కర్ణాటకలోని బీదర్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2020లో ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడని ప్రైవేటు వ్యక్తు లు ‘దేశం ద్రోహ’ నేరం కింద ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ పిల్లవాడిని ప్రశ్నించి, విధవరాలైన అతని తల్లిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఈ చట్టం గురించి ఏం తెలుసు? ఫిర్యాదు చేయగానే పోలీసులు ఆ ఫిర్యాదును ఎందుకు తిరస్కరించలేదు? బెంగళూరుకు చెందిన విద్యార్థిని దిశరవిని ఇంటి నుంచి హైజాక్ చేసిన పోలీసులు ఢిల్లీ తీసుకెళ్ళి ‘దేశ ద్రోహ’ నేరం కింద కేసు పెట్టారు. ఆందోళన చేస్తున్న రైతులకు సంబంధించిన టూల్ కిట్‌ను ఆమె వ్యాపింప చేస్తోందని వారి ఆరోపణ. రైతుల ఆందోళనకు మద్దతు తెలపడం దేశ ద్రోహం ఎలా అవుతుంది? పౌరులపైన ‘దేశ ద్రోహ’ నేరం మోపితే, ప్రభుత్వ ఉద్యోగాలను ఒదులుకోవాలి. ఒకవేళ బెయిల్ దొరికితే ఎప్పుడు కోరితే అప్పుడు న్యాయస్థానాల ముం దు హాజరు కావాలి. డబ్బుల ఖర్చు, సమయం వృథా, మానసిక ఆందోళనను భరిస్తూ కోర్టుల చుట్టూ తిరగడమే ఒక పెద్ద శిక్ష. దీనిని చట్టప్రకారం ఎదుర్కోవడం చాలా కష్టం.

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని అదుపు చేయడానికి లెక్కలేనన్ని చట్టాలు ఉన్నాయి. వీటిలో చెప్పుకోదగ్గది ‘చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టం (యుఎపిఎ), భద్రతా బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ). భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 ఎ అన్నిటికంటే దుర్మార్గమైనది. విధేయులైన భారతీయులను ‘జాతి వ్యతిరేకులు’ గా పోలీసులు తమ కలం పోటుతో చిత్రిస్తారు. భారత శిక్షాస్మృతి సృష్టికర్త మెకాలే కూడా ఊహించనంతటి భయంకరమైన చట్టం ఇది. ఈ ‘దేశ ద్రోహ’ చట్టాన్ని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైంది.

 

* అభిజిత్ సేన్ గుప్తా
                                                                                   (కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి
                                                                                         ‘దవైర్’ సౌజన్యం)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News