మనతెలంగాణ/హైదరాబాద్: విద్యార్థి సంఘాలు, వీఆర్‌ఏలు, టీచర్స్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అసెంబ్లీ దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు. అసెంబ్లీ చుట్టుపక్కల ఎలాంటి నిరసనలు ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. దాదాపు రెండు వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విఆర్‌ఏలు యత్నించడంతో వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విఆర్‌ఎలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం విఆర్‌ఎలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో పాటు రాష్ట్ర సర్కార్ ప్లే స్కేల్ ను పెంచాలన్నారు. ఇప్పటికే ఒత్తిడి తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది విఆర్‌ఎలు సూసైడ్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఆర్‌ఎల ను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో విఆర్‌ఎలు, టీచర్ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించి, భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలావుండగా అసెంబ్లీ నుంచి బిజెపి ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్ ను సస్పెండ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Police imposed 144 Section around TS Assembly