వేసవి ప్రారంభం కానున్న దశలో న్యూఢిల్లీ సరిహద్దులు పచ్చని పంటలు పండించే రైతుల ఉగ్ర పద ఘట్టనలతో ఎర్ర బారుతున్నాయి. నేడు పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ల నుంచి పాతిక వేల మంది రైతులు అత్యాధునిక సౌకర్యాలు గలిగిన ఐదు వేల ట్రాక్టర్లతో దేశ రాజధానిని ముట్టడించనున్నారు. రైతుల ఢిల్లీ ముట్టడి ఎంత భీషణంగా ఉంటుందో 2020 నవంబర్ నుంచి 2021 నవంబర్ వరకు దాని సరిహద్దుల్లో సాగిన చారిత్రాత్మక ఆందోళనను గుర్తుకు తెచ్చుకొంటే తెలుస్తుంది. అప్పుడది ఢిల్లీకి సమాంతరంగా వెలిసిన ఉద్యమ నగరం అయింది. రైతులు తమ ట్రాక్టర్ల కిందే కాపురాలు పెట్టేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పంట మీది, పంట భూమి మీది రైతు ఆనవాళ్ల్లు పూర్తిగా చెరిపి వేసి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల పాదాక్రాంతం చేయడానికి, తగిన చర్చకు పెట్టకుండానే తెచ్చిన షుగర్ కోటెడ్ బిళ్ళల్లాంటి మూడు ముష్కర చట్టాలను అంతం చేసే వరకు ఆ ఉద్యమం ఆగలేదు. ఆ ఉద్యమంలో 700 మంది రైతులు మరణించారు. ట్రాక్టర్లను కదలనీయకుండా చేయడానికి రోడ్ల మీద మొనదేలిన మేకులను అమర్చడం వంటి దుర్మార్గాలకు ఢిల్లీ పోలీసులు పాల్పడ్డారు. తీవ్రమైన నిర్బంధ చట్టాలు అమలు చేశారు.
అనేక మందిని అరెస్టు చేశారు. చెప్పనలవికాని దమనకాండకు దిగారు. 2020 జనవరి 26 రిపబ్లిక్ డే నాడు ఆందోళనకారుల్లో ఒక బృందం దారి తప్పి ఎర్రకోట బురుజులకు చేరుకొన్న ఘట్టం సంచలనం సృష్టించింది. చిట్టచివరకు ఆ మూడు చట్టాలను ఉపసంహరిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించక తప్పలేదు. ఆ సమయంలో ఆయన జాతికి క్షమాపణలు కూడా చెప్పుకొన్నారు. ఆ తర్వాత పార్లమెంట్‌లోనే ఆ మూడు చట్టాలకు ముగింపు పలికారు. అదే సమయంలో రైతులకు జరుగుతున్న ఇతర అన్యాయాలను తొలగించే విషయంలో చర్చల్లో వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇంత వరకు నెరవేర్చలేదు. కనీస మద్దతు ధరల విధానానికి ప్రత్యేక చట్టం తీసుకు రావడం అందులో ఒకటి. ఇంకా స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు వంటివి ఉన్నాయి. రైతులు అంత మహోద్యమం జరిపినా వారి దయనీయ స్థితి ఇప్పటికీ మారలేదు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి మాదిరిగానే కొనసాగుతున్నది. ప్రధాని నరేంద్ర మోడీ పదేళ్ల పాలన వైఫల్యాల్లో ఇది చాలా తీవ్రమైనది. రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న వాగ్దానం ఎటుబోయిందో ఎవరికీ తెలియదు. ఉద్యమ సమయంలో రైతు ప్రతినిధులతో జరిపిన చర్చల్లో ప్రభుత్వం ఆడిన కపట నాటకం అంతా ఇంతాకాదు.
తమ అపరిష్కృత సమస్యల విషయంలో, ప్రభుత్వానికి రైతులు అనేక సార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోడంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా గల 200 రైతు సంఘాల సంఘటిత శక్తితో ఫిబ్రవరి 13 నాటి ఛలో ఢిల్లీకి బయలుదేరారు. ఒకవైపు పంజాబ్, హర్యానాల నుంచి వేలాది ట్రాక్టర్లతో రైతుల ఆందోళన మొదలైందన్న వార్తలు, మరో వైపు హర్యానా రాష్ట్రమంతటా 144 సెక్షన్ విధింపు అప్పటి మాదిరిగానే ఢిల్లీలో బారికేడ్లు కఠిన ఆంక్షల సమాచారం రెండు వైపుల నుంచి సమర సన్నద్ధతను చాటుతున్నాయి. ఇదే సమయంలో ముగ్గురు కేంద్ర మంత్రుల బృందం హర్యానాలో రైతు నాయకులతో చర్చలు జరుపుతూ ఉండడం రేపు ఉదయం చలో ఢిల్లీ కార్యక్రమం అనుకొన్నట్టు ఆరంభమవుతుందో లేదో అనే సంశయానికి అవకాశాన్ని మిగిలిస్తున్నది. చర్చలు జరుపుతూనే అణచివేత చర్యలు తప్పవనే ప్రభుత్వం రైతులను హెచ్చరిస్తూ వుండడం పరిష్కారానికి ఆస్కారం కలిగించేటట్టు లేదు. అయితే కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధానిగా మోడీ హ్యాట్రిక్‌ను సాధించాలనే దీక్షతో పని చేస్తున్న బిజెపి పెద్దలు రైతులను మరొకసారి మోసం చేసే దుస్సాహసానికి పాల్పడబోరని ఆశిద్దాం.
ప్రభుత్వం మోసకారి పన్నాగాలతో రైతుల డిమాండ్లను ఎల్లకాలం తిరస్కరించడానికే సిద్ధంగా వున్నదని రూఢి అవుతున్నట్టు సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ చేసిన ప్రకటన గమనించదగినది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గాని, బిజెపి పాలనలో గాని దేశంలోనే రైతులకు గట్టిగా జరిగిన మేలు ఒక్కటీ లేదు. పంట చేతికి వచ్చిన సమయంలో ధరలు పడిపోయి వారు పడుతున్న ఇక్కట్లకు అంతం లేదు. రైతుల మహోద్యమాలు పదే పదే చోటు చేసుకొంటే గాని వారు మరింత సమైక్యతతో దేశమంతటా ఒక పెనుశక్తిగా మారితే గాని వారిపై దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడి సాధిస్తున్న దోపిడీ అంతం కాదు.