Monday, November 18, 2024

అక్రమాల ‘అగ్గి’

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య

బైక్ షో రూంకు అనుమతుల్లేవ్ పార్కింగ్ చేయాల్సిన సెల్లార్‌లో వాహనాల
విక్రయాలు భవనం ఐదో అంతస్తు అక్రమం మృతుల కుటుంబాలకు
రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం నాడు మరొకరు మృతి చెందారు. అగ్నిప్రమాద ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 8కి చేరింది. ఈక్రమంలో ఈ ఘటనలో గాయాలపాలైన మరో 9మంది క్షతగాత్రులకు యశోద, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాదంలలో దట్టమైన పొగ వ్యాపించడం వల్లే 8 మంది చనిపోయారని అగ్నిమాపక శాఖ అదనపు డిజి సంజయ్ కు మార్ తెలిపారు. ప్రమాదం ఘటన విచారణ నిమి త్తం లాడ్జీ యజమాని సుమీత్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు ద్విచక్ర వాహనాల షోరూం, లాడ్జిని సీజ్ చేశామని తెలిపారు. ఈ కేసు లో సుమీత్‌తో పాటు అతని తండ్రి రాజేందర్ సింగ్ ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్ర శ్నిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ-బైకు షోరూమ్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రూబీ ప్రైడ్ భవనానికి నాలుగు అంతస్థులకే జిహెచ్‌ఎంసి అనుమతి ఉందని కానీ అదనంగా మరో అంతస్థు నిర్మించినట్లు గుర్తించామన్నారు.

సెల్లార్‌లో కేవలం పార్కింగ్ మాత్రమే చేయడానికి అనుమతి ఉండగా విద్యుత్ వాహనాల విక్రయాలు చేస్తున్నారని తెలిపారు. భవనాలు 18 మీటర్ల ఎత్తు దాటితేనే అగ్నిమాపకశాఖ అనుమతి అవసరమని.. అంతకంటే తక్కువ ఎత్తులో నిర్మించే భవనాలను జిహెచ్‌ఎంసి పర్యవేక్షిస్తుందని డిజి సం జయ్ కుమార్ వివరించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాడ్జి సెల్లార్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ బైక్ షోరూం లో బ్యాటరీ పేలడంతో ఇక్కడ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో లాడ్జిలో ఉన్న టూరిస్టుల్లో ఎనిమిది మంది పడ్డారు. ప్రమాదంలో మరికొందరు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదంపై స్పందించిన ప్రధాని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ఇస్తామని వెల్లడించారు.

ఉన్నతస్థాయి విచారణ : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సికిందరాబాద్ ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. ఈ అగ్నిప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈక్రమంలో ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోం మంత్రి మహమూద్ అలీ మంగళవారం నాడు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ఈ ప్రమాదంపై అగ్నిమాపక శాఖ, పోలీసుశాఖ సంయుక్తంగా విచారణ చేపడుతున్నాయని, దర్యాప్తులో బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోమంత్రి స్పష్టం చేశారు.

బ్యాటరీ చార్జింగ్ వల్లే ప్రమాదం 

రూబీ లాడ్జ్ సెల్లార్‌లోని ఎలక్ట్రికల్ వాహనాల షోరూంలో బ్యాటరీలు ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అగ్నిప్రమాద స్థలిలో ఎలక్ట్రిక్ వాహనాలు, సిలిండర్లను పరిశీలించిన క్లూస్ టీమ్స్ కీలక ఆధారాలను సేకరించింది. సిలిండర్లు పేలి ఉంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగి ఉండేదని తెలిపిన పోలీసులు ఘటనపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు.

మృతుల కుటుంబాలకి మూడు లక్షల ఎక్స్ గ్రేషియా: హోం మంత్రి మహమూద్ అలీ

సికిందరాబాద్‌లోని అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని మంగళవారం నాడు హోంమంత్రి మహమూద్ ఆలీ, అగ్నిమాపక డిజి సంజయ్ జైన్, హైదరాబాద్ నార్త్ జోన్ డి.సి.పి. చందన దీప్తి ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ప్రమాద సంఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికీ మూడు లక్షల రూపాయలను ఎక్స్ గ్రేషియ అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. సంఘటనా స్థలంలో లాడ్జింగ్ ఉన్నందువల్ల వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని తెలియజేశారు. చనిపోయిన వారిలో, ఢిల్లీ వాస్త్యవులు రాజీవ్ మాలిక్, సందీప్ మాలిక్, వీరేంద్ర కుమార్, ఒడిశా రాష్ట్రం బాలాసోర్ వాస్తవ్యులు మిథాలి మహాపాత్ర, కటక్ వాస్తవ్యులు చందన్ జేతి, ఆంధ్రప్రదేశ్ విజయవాడ వాస్తవ్యులు అల్లాడి హరీష్, చెన్నై నుండి సీతరామన్, యెన్. బాలాజీ లు గా గుర్తించడం జరిగిందని మంత్రి తెలిపారు.

అగ్నిప్రమాదం జరిగిన తర్వాత దట్టమైన పొగ వ్యాపించడంతో వీరు ప్రాణాలు కోల్పోయారని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలిందన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని, ఈ సంఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. ఘటనలో గాయపడిన వారిలో కొద్దిమంది యశోద ఆసుపత్రిలో, మరి కొద్దిమంది గాంధీ ఆసుపత్రి లోనూ చికిత్స పొందుతున్నారని తెలిపారు. సంఘటనపై పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయని, అన్ని కోణాలలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించామని. దర్యాప్తు పూర్తి అయిన తరువాత మరిన్ని వివరాలు తెలిసి ఆస్కారం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి, ప్రమాదానికి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అన్నారు.

విమానంలో మృతదేహాల తరలింపు 

సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జీలో ఆర్దరాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన ఎనిమిది మంది మృత దేహాలకు పోసుమార్టుం నిర్వహించిన వైద్యులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారి మృతదేహాలను విమానం ద్వారా వారి స్వస్థలాలకు తరలించారు. మృతి చెందిన ఎనిమిది మంది మృత దేహాలను మంగళవారం గాంధీ ఆసుపత్రి మార్చురీలో పోస్టుమార్టుం నిర్వహించారు. అగ్ని ప్రమాద ఘటన తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు మంగళవారం గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఎనిమిది మంది మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, బందువులు , స్నేహితుల రోదనలతో గాంధీ మార్చురీ వద్ద విషాద చాయలు అలుముకున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి మృతులకు సంబంధించిన వారిని ఎవ్వరిని లోపలికి అనుమతించకుండా భద్రతా చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో ఐదు మందికి యషోదాఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మృతుల,క్షతగాత్రుల వివరాలు 

సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఎనిమిది మంది వివరాలను అధికారులు ప్రకటించారు. ఢిల్లీకి చెందిన వీరేంద్ర కుమార్ దేవకర్ (50), అన్నదమ్ములైన రాజీవ్ మాలిక్ (60), సందీప్ మాలిక్ (56)లు, చెన్నయ్ కు చెందిన సీతారామన్ (48), బాలాజీ (52) మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. విజయవాడకు చెందిన హరీష్ (33) డెడ్ బాడీని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒరిస్సాకు చెందిన చందన్ జేతి (28) సతీమణి మిథాలీలు (డెర్మటాలిస్ట్ డాక్టర్) బెంగుళూరులో పని చేస్తూ ఇటీవలే ఓ సెమినార్ కు హాజరయ్యేందుకు సిటీకి వచ్చారు. అలాగే గాయపడిన వారిలో వైజాగ్ కు చెందిన సంతోష్, యోగిత బెంగళూరుకు చెందిన జయంత్, కోల్ కతాకు చెందిన దేభాశీష్ గుప్తా, చెన్నైకి చెందిన కేశవన్, హర్యానాకు చెందిన దీపక్ యాదవ్, ఒడిశాకు చెందిన ఉమేష్ కుమార్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇదిలావుండగా ప్రమాద సమయంలో రూబీ లాడ్జిలోని 23 రూమ్స్‌లో 24 మంది టూరిస్టులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

కారిడార్‌లు లేవు : అగ్నిమాపక శాఖ నివేదిక

రూబీ లాడ్జి విషాద ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ నివేదిక విడుదల చేసింది. మూడు పేజీల రిపోర్ట్లో కీలక విషయాలను వెల్లడించింది. రూబీ లాడ్జీలో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయలేదని, భవనం మొత్తం కూడా క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండిపోయిందని, ఈ భవనానికి కనీసం కారిడార్ కూడా లేదని అగ్నిమాపక శాఖ నివేదికలో పేర్కొంది. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయలేదని, భవన, హోటల్ యజమాని నిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. లీథియం బ్యాటరీల పేలుళ్ల వల్ల దట్టమైన పొగలు వ్యాపించాయని, పొగలు వల్ల భవనంలోకి వెళ్లలేకపోయామని ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. భవనానికి సింగిల్ ఎంట్రీ, ఎగ్జిట్ మాత్రమే ఉంది. లిప్ట్ పక్కన మెట్లు ఏర్పాటు చేయకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకోలేదని, సెల్లార్లో మొదటిగా అగ్ని ప్రమాదం మొదలైందని, ఆ తర్వాత మొదటి అంతస్తు వరకు మంటలు వ్యాపించాయని నివేదికలో ఫైర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. లాడ్జిలో స్ప్రింక్లర్లు ఉన్నాయని, మంటలు వచ్చినప్పుడు మాత్రమే అవి తెరుచుకుంటాయని, ఈ ప్రమాదంలో మంటలు ఎక్కువగా రావడంతో అవి పనిచేయలేదని తెలిపార.అదేవిధంగా లోపలికి వెళ్లడానికి, బయటికి రావడానికి ఒకే ద్వారం ఉండటంతో ప్రమాదం జరిగినప్పుడు బయటికి ఎవరు రాలేకపోయారని నివేదికలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News