Sunday, December 22, 2024

సూత్రధారి సుబ్బారావు?

- Advertisement -
- Advertisement -

 

Secunderabad 'Agnipath' riot mastermind Aavula Subbarao arrested

మన తెలంగాణ/హైదరాబాద్/సిటీ బ్యూరో : అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లను ప్రోత్సాహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎపి ప్రకాశం జిల్లా కంభంలో సుబ్బారావును పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారావు నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. అల్లర్లలో సుబ్బారాపు పాత్ర ఉందన్న అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ్నించి సుబ్బారావును పోలీసులు నరసరావుపేటకు తరలించి విచారణ జరిపారు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసులు ఇప్పటివరకు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 12 మంది యువకులు ప్రధాన కారకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్మీ ఉద్యోగాల ఆశావహులను కొందరు రెచ్చగొట్టినట్లు పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. వాట్సాప్ గ్రూపుల్లో యువతను రెచ్చగొట్టినట్లు ప్రాథమికంగా తేల్చారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్లాక్స్, 17/6 గ్రూప్‌తో పాటు పలు పేర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అల్లర్లకు సంబంధించి ఆందోళనకారుల వాట్సప్ సందేశాలు ఇప్పటికే వైరల్ అవ్వగా, పలువురు అభ్యర్థులతో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సబ్బారావు దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరో వైపు కరీంనగర్‌కు చెందిన స్టార్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు వసీంపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సుబ్బారావును విచారణ అనంతరం ఎపి పోలీసులు తెలంగాణ పోలీసులకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కోచింగ్ అకాడమీలదే కీలక పాత్ర..!

వాట్సాప్ గ్రూప్‌ల వేదికగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిరసనకు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రైవేట్ అకాడమీల సహకారంతోనే కుట్రకు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. డిఫెన్స్ పరీక్షల సంబంధించి కోచింగ్ ఇస్తున్న ఆవుల సుబ్బారావు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువకులను రెచ్చగొట్టినట్టుగా తెలస్తోంది. ఇక, శుక్రవారం ఆందోళనలో 10 డిఫెన్స్ అకాడమీలకు చెందిన ఆందోళకారులు పాల్గొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, వాట్సాప్ గ్రూప్‌ల వేదికగానే సికింద్రాబాద్ వద్ద నిరసన తెలిపేందుకు చాటింగ్‌లు జరిగినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నిరసనల్లో పాల్గొన్నవారిలో పలువురు హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం కోచింగ్ పొందారు. ఆ సమయంలో వీరు కొన్ని వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఆర్మీ రిక్రూట్‌మెంట్ గురించిన సమాచారం, ప్రిపరేషన్ టిప్స్ షేర్ చేసుకునేవారు.

అయితే మూడు రోజుల క్రితం అగ్నిపథ్ స్కీమ్ ప్రకటన వెలువడగానే.. ఒక్కసారి ఈ వాట్సాప్ గ్రూప్‌లు యాక్టివ్ అయ్యాయి. అగ్నిపథ్ స్కీమ్ గురించి వాట్సాప్ గ్రూప్‌లలో తీవ్ర చర్చ సాగింది. అగ్నిపథ్ స్కీమ్ వల్ల ఆర్మీలో తమ కేరీర్ అవకాశాలు దెబ్బతింటాయని వారు భావించారు. ఈ క్రమంలోనే దేశంలోని ఇతర ప్రాంతాల్లో అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసనల గురించి తెలియడంతో సికింద్రాబాద్ వద్ద కూడా నిరసన తెలియజేయాలని వారు వాట్సాప్ గ్రూప్ ద్వారా మెసేజ్‌లు, ఆడియో క్లిప్స్ షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం నుంచే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు పలువురు యువకులు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున తరలివచ్చిన యువకులు తొలుత రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి రైళ్లకు నిప్పుపెట్టి, స్టేషన్‌లోని రైళ్లు, ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకులు వాట్సాప్ సందేశాలను పరిశీలిస్తున్నారు.

52 మంది నిందితుల అరెస్టు, రిమాండ్

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అగ్నిపథ్ ఆందోళనలతో చెలరేగిన హింసపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరెవరు ఆందోళనలో పాల్గొన్నారు? వీరంతా ఒక్కసారిగా ఎలా వచ్చారు? వీరు హింసకు పాల్పడేలా ఎవరైనా ఉసిగొల్పారా? అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 50మందికిపైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసుస్టేషన్ల వారీగా వారీగా వైద్యపరీక్షలకు తరలిస్తున్నారు. గవర్నమెంట్ రైల్వే పోలీసుస్టేషన్ నుంచి 15మంది, గోపాలపురం పోలీసుస్టేషన్ నుంచి 20మందిని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించారు. టాస్క్‌పోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్న 20మందిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత నిందితులను ఆర్పీఎఫ్ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. 52 మంది నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వీరందరినీ పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వాట్సాప్ గ్రూపుల్లో జరుపుతున్న సంభాషణలు పూర్తిగా పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 30 మందిలో ఇద్దరు యువకులు బోగీలకు నిప్పుపెట్టినట్లు గుర్తించారు. కామారెడ్డి వాసి సంతోష్, ఆదిలాబాద్ వాసి పృథ్వీరాజ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు ఇద్దరూ పెట్రోల్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. కామారెడ్డి వాసి మధుసూదన్ వాట్సాప్‌లో ఆడియో సందేశం పంపినట్లు బోగీలు తగలబెడితే కేంద్రం దృష్టికి వెళ్తుందని ఆడియోలో ఉన్నట్లు తేల్చారు.

రెచ్చగొట్టి విధ్వంసానికి ఊతమిచ్చింది సుబ్బారావే… సికింద్రాబాద్ ఆందోళనల్లో పాల్గొన్నట్లు అనుమానం

ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సుబ్బారావు.. జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో సైనికాధికారిగా పనిచేశారు. 2014 నుంచి ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట, హైదరాబాద్‌లోనూ సాయి డిఫెన్స్ అకాడమీ బ్రాంచి నిర్వహిస్తున్నారు. అగ్నిపథ్‌కు సంబంధించి ముందుగానే ఆవుల సుబ్బారావుకు కొంత సమాచారం లీక్ అయినట్లు తెలిసింది. గుంటూరు ఆర్మీ కార్యాలయం వద్ద.. నెలరోజుల నుంచి ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వారితో మాట్లాడి ఈ ఆందోళనలకు నాయకత్వం వహించినట్లు సమాచారం. ఈ నిరసనల్లో పాల్గొన్నవారిలో 80 నుంచి 90 శాతం మంది సాయి డిఫెన్స్ అకాడమీ వారే ఉన్నట్లు సమాచారం. అగ్నిపథ్ పథకం వల్ల ఆర్మీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని.. దీన్ని అంగీకరిస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందంటూ యువకులను రెచ్చగొట్టి వారితో ఆందోళనలు చేయించినట్లు తెలుస్తోంది. సుబ్బారావు సికింద్రాబాద్ ఆందోళనల్లో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఇతర ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల నుంచి యువకులను రప్పించి ఆందోళన చేయించినట్లు సమాచారం. రైల్వే స్టేషన్‌లో ఆందోళన సమయంలో యువకులకు తాగునీరు, ఆహారం ఇతర పదార్థాలు.. ఈ డిఫెన్స్ అకాడమీ ద్వారా సమకూరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వ్యాపారం దెబ్బతింటుందనే భావనతోనే….!?

ఆర్మీలో చేరాలనుకునే వారికి సుబ్బారావు మూడు నెలలు శిక్షణ ఇస్తున్నాడు. తన వద్ద శిక్షణ తీసుకునే అభ్యర్థులు ఉద్యోగంలో చేరిన తర్వాతే వారి నుంచి రూ.1,00,000 తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు సుబ్బారావు వద్ద శిక్షణ తీసుకున్న 12,000మంది అభ్యర్థులు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం అగ్నిపథ్‌ను ప్రకటించడంతో తన వ్యాపారానికి దెబ్బతగులుతుందని భావించాడు. దీంతో తన వద్ద శిక్షణ తీసుకుంటున్న వారితో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టాని ప్లాన్ వేశాడు. తన వద్ద శిక్షణ తీసుకున్న 450మంది యువకులను సుబ్బారావు గుంటూరు నుంచి రైలు ద్వారా సికింద్రాబాద్‌కు పంపినట్లు పోలీసులు గుర్తించారు. విధ్వంసం చేసిన వారిలో ఎక్కువ మంది నర్సారావు పేటలోని సాయి డిఫెన్స్ అకాడమికి చెందిన వారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్మీలో చేరాలనుకునే వారికి శిక్షణ ఇచ్చేందుకు ఉప్పల్‌లో సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. ఇక్కడ భవనాన్ని అద్దెకు తీసుకుని వాటికి రంగులు వేయిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంలో సుబ్బారావు పాత్ర బయటపడడంతో పోలీసులు వెతకడం ప్రారంభించారు. దీంతో నిందితుడు తన సొంత జిల్లా ఖమ్మంలో షెల్టర్ తీసుకున్నాడు.

సికింద్రాడాద్ రైల్వే స్టేషన్‌లో భారీస్థాయిలో బందోబస్తు

అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో స్టేషన్‌లో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్‌ఏఎఫ్, సీఆర్‌పీఎఫ్, రైల్వే, తెలంగాణ పోలీసు బలగాలు స్టేషన్ వద్ద మోహరించారు. భారీ భద్రత నడుమ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. స్టేషన్ లోపలికి వచ్చే మార్గాల్లో భారీగా మోహరించిన బలగాలు.. ప్రయాణికులను క్షుణ్నంగా పరిశీలించాకే లోపలికి అనుమతిస్తున్నారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో జనం గుమిగూడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.

ఆడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో పోలీసుల దర్యాప్తు

మరోవైపు సికింద్రాబాద్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్నటి ఘటనలో అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్నారు. యువకుల వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలిస్తున్నారు. నిరసనలకు పిలుపునిస్తూ వాట్సాప్ గ్రూప్‌లో సర్య్కులేట్ అవుతున్న ఆడియో సందేశాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రైళ్లను తగలబెట్టడానికి రావాలంటూ వాట్సాప్ వాయిస్ సందేశాలు బయటకొచ్చాయి. అయితే ఆడియోలు ఎక్కడ నుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

14 సెక్షన్ల కింద కేసులుః అనురాధ, రైల్వే ఎస్పీ

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంలో 1,500 నుంచి 2,000 మంది పాల్గొన్నట్లు రైల్వే ఎస్పి అనురాధ తెలిపారు. విధ్వంసానికి పాల్పడిన వారిపై 143,147,307,435,427,448,336,332,341,149,150,151,152, 3పిఓపిపిఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, నిరసన కారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News