బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందినిని వరసగా ప్రమాదాలు వెంటాడాయి. రెండు ప్రమాదాలు జరిగిన సమయంలో ఒకడే డ్రైవర్ ఉన్నాడు. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువు లాస్యను కబలించింది. లాస్య నందినికి ఎమ్మెల్యేగా కాలం కలిసిరాలేదు. లిఫ్టులో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి ఆమె బయటపడింది. నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13న రెండవసారి ప్రమాదం సంభవించింది. మూడవసారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక యువఎమ్మెల్యే మృతి చెందింది. లాస్య కారు పది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ప్రమాదానికి గురైంది.
తండ్రి సాయన్న మరణంతో లాస్య నందిత రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దివంగత నేత సాయన్న 1994 నుంచి 2004 వరకు 3 సార్లు టిడిపి ఎమ్మెల్యేగా , రెండు సార్లు టిఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. అనారోగ్యంతో 2023, ఫిబ్రవరి 19న కన్నుమూశారు. దీంతో గత ఎన్నికల్లో లాస్య నందిత కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలిచారు. తండ్రి మరణించిన ఏడాదికే లాస్య రోడ్డుప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.