మోడీ అనాలోచిత విధానాల వల్లే రోడ్లపైకి యువత
అగ్నిపథ్ పథకంపై పునరాలోచన చేయాలి
మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఘటన తీవ్ర విచారకరం, బాధాకరం, దురదృష్టకరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి అనాలోచిత నిర్ణయాల వల్ల మొన్న రైతన్నలు, నేడు యువత రోడ్లపైకి రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడి మొన్న రైతన్నలు, నేడు యువత రక్తాన్ని కళ్ళారా చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఘటన వెనుక టిఆర్‌ఎస్ ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించడాన్ని కొప్పుల తీవ్రంగా ఖండించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో యువత పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతోందని ఈ ఘటనల వెనుక కూడా టిఆర్‌ఎస్ ఉందా అని మంత్రి ప్రశ్నించారు. ఆ యా రాష్ట్రాల్లో రాజ్యమేలుతున్నది మీ పార్టీయే కదా అని ఆయన నిలదీశారు. అర్థం పర్థం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడి నవ్వులపాలు కావద్దని హితువు పలికారు. బాధ్యత గత ఎంపీవన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. యావత్ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున అగ్నిపథ్ పథకంపై పునరాలోచ చేయాల్సిందిగా ఆయన ప్రధాని మోడికి విజ్ఞప్తి చేశారు.