సిటీ బ్యూరో ః తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన ఆషాడ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా నిర్వహించే లష్కర్ బోనాల పండుగ తేదీలు ఖరారు చేశారు. జూలై 9వ తేదీన శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి బోనాలు, 10వ తేదీన రంగం (భవిష్యవాణి) జాతర కార్యక్రమం నిర్వహించనున్నట్లు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం జరిగిన మహాకాళి అమ్మవారి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింభమైన బోనాల ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాలతో ప్రతి ఏటా ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తోందన్నారు.
ప్రతి సంవత్సరం గోల్కొండ బోనాల ఉత్సవాలు ప్రారంభైన తర్వాత సికింద్రాబాద్, ఆ ర్వాత పాతబస్తీ బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జూలై 9,10 తేదీలో సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పే బోనాలు, బతుకమ్మ వేడుకల విశిష్టతను ప్రభుత్వం మరింత పెంచడం ద్వారా విశ్వవ్యాప్తం చేసిందన్నారు. ఇదేక్రమంలో అనేక దేశాల్లో ఎంతో ఘనంగా బోనాలు, బతుకమ్మ పండుగను జరుపుకుంపటున్నారని ఇది మకకెంతో గౌరవమన్నారు. ప్రతి ఏటా సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారని వారికి ఏలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లను చేయనున్నట్లు తెలిపారు.
ఇందుకు సంబంధించి ఇప్పటీకే కోట్లాది రూపాయాలతో అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో అభివృద్ది చేయడం ద్వారా ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు తరలివచ్చినా చిన్న ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా బోనాల పండుగ జరుపుకోగలుగుతున్నమని చెప్పారు. బోనాల ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి త్వరలో అధికారులు, ఆలయ పాలకమండలి ఇతర ప్రముఖలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ కృష్ణ, ఈఓ మనోహర్‌రెడ్డి, గణేష్ టెంపుల్ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.