Sunday, January 19, 2025

బోనమెత్తిన లష్కర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆషాఢమాసం వచ్చిందంటే రాష్ట్రంలో బోనాల సందడి ప్రారంభమవుతుంది. గత ఆదివారం గోల్కొండ బోనాలు ప్రారంభం కాగా ఈ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. బోనాల పండుగ కోసం ఆలయాన్ని పూలతో అలంకరించారు.

ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మంత్రి తొలి బోనం సమర్పించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అమ్మవారి ఊరేగింపులో భాగంగా పోతురాజులు నృత్యాలు చేశారు. మహిళలు, అమ్మాయిలు బోనాలతో సందడి చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను సమర్పించారు. అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. రెండు రోజుల పాటు ఘటం ఉత్సవాల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, రంగం కార్యక్రమాలు జరుగుతాయి. ఈ బోనాలు ముగిసిన తర్వాత భాగ్యనగరంలో ఈ నెల 16వ తేదీ, 17న ఉమ్మడి దేవాలయాల్లో జరిగే బోనాలకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
బోనాలతో భక్తుల కోలాహాలం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బోనాలు కావడంతో చిన్నా,పెద్దా అందరూ సందడి చేస్తున్నారు. అమ్మవారి ఘటాలు ఊరేగింపుగా వెళుతుంటే అందరూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. సికింద్రాబాద్‌లో అమ్మాయిలు బోనాలతో కోలాహలం చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
ఉజ్జయిని మహంకాళికి 202 సంవత్సరాల చరిత్ర…
ప్రతి ఏటా ఆషాఢమాసంలో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర శివస్తుతులతో, పోతారాజుల నృత్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ బోనాలకు దాదాపుగా 202 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయం నిర్మాణానికి ప్రేరణ ఒక ఆర్మీ జవాన్‌గా పేర్కొంటారు. సికింద్రాబాద్ నివాసి అయిన సురటి అప్పయ్య 1813 ప్రాంతాల్లో ఆర్మీలో డోలి బేరర్ గా పనిచేసేవాడు. అతను బదిలీపై మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో కలరా వ్యాధి ప్రబలి వేలాది మంది చనిపోయారు. అప్పుడు అప్పయ్య ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ ప్రాంతం నుంచి కలరా వ్యాధి పారద్రోలితే సికింద్రాబాద్‌లో అమ్మవారి విగ్రహం ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తానని అప్పయ్య మొక్కుకున్నారు.

ఆయన కోరిక నెరవేరడంతో 1815 సంవత్సరంలో ప్రస్తుతం అమ్మవారు ఉన్న చోటునే అమ్మవారిని ప్రతిష్టించారు. అప్పుడే ఆ విగ్రహానికి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేశారు. ఆ ప్రాంతం అంతా అప్పటికాలంలో అడవిలా ఉండేది. ప్రక్కనే ఉన్న బావి మరమ్మతు చేస్తుంటే అందులో శ్రీ మాణిక్యాలమ్మ విగ్రహం లభ్యమైంది. ఈ విగ్రహాన్ని అమ్మవారి కుడివైపున ప్రతిష్ట చేశారు. అప్పటి నుంచి సురటి అప్పయ్య కుటుంబ సభ్యులు ఆలయ ధర్మకర్తలుగా వ్యవహారిస్తున్నారు. 1953లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News