న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని వారాణాసిలో జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని ఓ బావిలో శివలింగం బయటపడిన ఘటనపై వీడియోగ్రఫీ సర్వేను వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. ముస్లింలను జ్ఞానవాపి మసీదు నమాజ్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. అదే సమయంలో శివలింగం బయటపడిన ప్రాంతానికి భద్రత కల్పించాలని ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించే బాధ్యత కలెక్టర్‌కు అప్పగించింది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహతో కూడా సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.
అంతకు ముందు జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ వీడియో సర్వే నివేదికను ఈ నెల 19లోగా సమర్పించాలని వారణాసి న్యాయస్థానం ఆదేశించింది. అదే సమయంలో కోర్ట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రాను తొలగించింది. అజయ్ కుమార్ మిశ్రా పూర్తి స్థాయిలో సహకరించడం లేదనే ఆరోపణలు రావడంతో ఆయన్ను తొలగించింది. మరోవైపు నివేదిక సమర్పించేందుకు రెండు రోజుల సమయం కావాలని అసిస్టెంట్ కోర్ట్ కమిషనర్ అజయ్ ప్రతాప్ సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో కోర్టు 2 రోజుల గడువిచ్చింది.