Friday, December 20, 2024

అభివృద్ధికి అభయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ ఆదిలాబాద్ ప్రతినిధి: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సర్కార్ అన్నివిధాలుగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. సోమవారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ విధానంలో రూ.56 వేల కోట్ల ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేశారు. ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా మోదీ శంకుస్థాపన చేశారు. అం డర్ డ్రైనేజీ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. ఆదిలాబాద్‌బేల- రోడ్డు విస్తరణ పనులు, రైల్వే విద్యుదీకరణ మార్గానికి ప్రధాని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ…‘రాష్ట్రాభివృద్ధికి, తెలంగాణ ప్రభుత్వానికి, సిఎం రేవంత్‌రెడ్డికి సంపూర్ణంగా సహకరిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణలో గడిచిన పదేళ్లలో వేల కోట్లకు పైగా పనులు ప్రారంభించామని అన్నారు. ఎన్‌టిపిసి రెండో యూనిట్ ప్రారంభించామని, దీంతో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. దేశంలో ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నామని, అందులో ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేస్తామని ప్రధాని వెల్లడించారు. నవీకరణ యోగ్య శక్తికి సంబంధించిన వివిధ రైళ్లు, రోడ్డు వంటి అనేక ప్రాజెక్ట్‌లను దేశ ప్రజలకు అంకితం చేయడంతో పాటు శంకుస్థాపన చేశామని అన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి రేటును నమోదు చేయడాన్ని గురించి ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయని అన్నారు.

తన దృష్టిలో అభివృద్ధి సాధన అంటే.. నిరుపేదలు, దళితులు, ఆదివాసులు, వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించడమేనని అన్నారు. ఒక్క తెలంగాణకే కాకుండా యావత్తు దేశానికి సంబంధించిన అభివృద్ధ్ది ప్రధానమైన ప్రాజెక్ట్‌లకు ఆదిలాబాద్ గడ్డ సాక్షిగా ఉందన్నారు. నేడు చేపడుతున్న ఆధునిక రైతు ప్రాజెక్ట్‌లు, రహదారి ప్రాజెక్ట్‌లు తెలంగాణతో పాటు యావత్తు దేశాభివృద్ధికి ఊతం అందిస్తాయన్నారు. పర్యాట రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం ద్వారా లెక్కలేనన్ని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయన్నారు. రాష్ట్రాలను అభివృద్ధి పర్చడం ద్వారా దేశాన్ని అభివృద్ధ్ది పథంలో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి అధికంగా కేటాయింపులు జరిగిన విషయాన్ని ప్రధాన మంత్రి వివరించారు. కాగా, ఒక ప్రధాన మంత్రి ఆదిలాబాద్‌కు రావడం 41 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News